logo

కత్తి దూసిన ఉన్మాదం

తనతో పెళ్లికి నిరాకరించారని కక్ష పెంచుకున్న ఓ యువకుడు.. యువతితో పాటు ఆమె తల్లిపై విచక్షణా రహితంగా కత్తితో దాడి చేశాడు. ఈ ఉన్మాద సంఘటన వింజమూరులోని పాతూరులో శుక్రవారం చోటు చేసుకుంది. నిందితుడు బాధితులకు సమీప బంధువు కావడం గమనార్హం.

Updated : 18 May 2024 06:11 IST

పెళ్లికి నిరాకరించారని దాడి

పూజిత మెడపై కత్తిగాయలు

వింజమూరు, న్యూస్‌టుడే: తనతో పెళ్లికి నిరాకరించారని కక్ష పెంచుకున్న ఓ యువకుడు.. యువతితో పాటు ఆమె తల్లిపై విచక్షణా రహితంగా కత్తితో దాడి చేశాడు. ఈ ఉన్మాద సంఘటన వింజమూరులోని పాతూరులో శుక్రవారం చోటు చేసుకుంది. నిందితుడు బాధితులకు సమీప బంధువు కావడం గమనార్హం. కొబ్బరి బోండాలు నరికే కత్తితో దాడి చేయడంతో.. తల్లీ కూతురు తీవ్రంగా గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. పోలీసులు, బాధితుల వివరాల ప్రకారం.. వింజమూరులోని పాతూరులో సంక్రాంతి కాంతమ్మ తన కుమార్తె పూజితతో కలిసి నివాసం ఉంటున్నారు. ఈమె భర్త వెంకటరత్నం నాలుగేళ్ల కిందట అనారోగ్యంతో మృతి చెందగా- కాంతమ్మ సైతం అగ్ని ప్రమాదంలో ఓ చేతిని కోల్పోయారు. వీరికి ఇద్దరు కుమార్తెలు కాగా.. పెద్దకూతురు సుభాషిణి స్థానిక యాదవ బజారులోనే కాపురం ఉంటున్నారు. రెండో కుమార్తె పూజితను చదివించుకుంటూ.. వచ్చే పింఛనుతో కాంతమ్మ కాలం వెళ్లదీస్తున్నారు. 

చికిత్స పొందుతున్న కాంతమ్మ 

కక్ష పెంచుకుని..

పూజిత పెద్దమ్మ కోడలుకు తమ్ముడు.. ప్రకాశం జిల్లా పామూరు మండలం కొత్తపల్లికి చెందిన వంటేరు నాగార్జున. దాంతో వీరికి అయిదేళ్లుగా పరిచయం. ఆ క్రమంలో ఆమె చదువుకు అతడు సాయం చేశాడు. వీరిద్దరికి వివాహం చేసే విషయమై ఇరు కుటుంబాల మధ్య గతంలో చర్చలు జరగ్గా.. యువతి కుటుంబ సభ్యులు నిరాకరించడంతో అవి నిలిచిపోయాయి. పూజిత నెల్లూరులోని ఓ కళాశాలలో బీ ఫార్మసీ పూర్తి చేశారు. చెన్నైలో ఉద్యోగం వచ్చింది. నాగార్జునకు ఎలాంటి చదువు లేదు. క్యాటరింగ్, హోటల్, భవన నిర్మాణం.. ఇలా ఏ పని ఉంటే.. అది చేస్తూ ఉంటాడు. ఆ క్రమంలో పెళ్లికి నిరాకరించగా.. పూజితతో పాటు ఆమె కుటుంబ సభ్యులపై  కక్ష పెంచుకున్నాడు. నెల్లూరులో పూజిత ఉండే గదికి వెళ్లి అప్పుడప్పుడు గొడవలు పడేవాడు. దాంతో బాధితురాలు తన వెంట పడుతూ ఇబ్బంది పెడుతున్నారని ముత్తుకూరు పోలీసుస్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. పోలీసుల జోక్యంతో వివాదం అప్పటికి సద్దుమనిగింది. యువతిని ఇబ్బంది పెట్టకుండా ఉండేలా.. నాగార్జున ఆమె చదువుకు చేసిన సాయం తిరిగి ఇచ్చేలా మాట్లాడుకున్నారు. 

హత్యాయత్నం నేరం కింద కేసు

బాధిత యువతి స్థానిక ఆసుపత్రిలో చికిత్స పొందుతుండగా.. కాంతమ్మను మెరుగైన వైద్యం కోసం నెల్లూరు తరలించారు. వింజమూరు ప్రభుత్వ ఆసుపత్రి వైద్యుడు మధుమోహన్‌రెడ్డి మాట్లాడుతూ.. తల్లీకూతుళ్లు ఇద్దరికీ కత్తిగాట్లు అధికంగా ఉన్నాయన్నారు. కుట్లు వేసి.. ప్రాథమిక వైద్యం అందించామన్నారు. సమాచారం అందుకున్న కలిగిరి సీఐ ఫిరోజ్, ఎస్సై కోటిరెడ్డి సంఘటనా స్థలానికి చేరుకుని విచారించారు. సీఐ మాట్లాడుతూ నిందితుడిని పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేశామన్నారు. త్వరలోనే పట్టుకుని బాధితులకు న్యాయం చేస్తామన్నారు. హత్యాయత్న నేరం కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.


వేడుకుంటున్నా..  

నిందితుడు నాగార్జున

నాగార్జున మాత్రం ఆ విషయాన్ని అంతటితో వదిలేయలేదు. తనతో బాగుంటూ.. తన సాయం పొంది.. తనతో పెళ్లికి నిరాకరించారన్న కోపంతో సంచిలో కత్తి పెట్టుకుని శుక్రవారం పూజిత ఇంటికి వెళ్లాడు. చపాతి చేసుకుంటున్న కాంతమ్మపై విచక్షణా రహితంగా దాడి చేశాడు. భయాందోళనకు గురైన ఆమె.. నా బిడ్డను నీకే ఇచ్చి పెళ్లి చేస్తాను. చంపొద్దని కాళ్లు పట్టుకుని ప్రాధేయపడినా వినిపించుకోలేదు. కత్తితో ఆమె మెడ, వీపుపైనా దాడి చేశాడు. దాంతో ఆమె కిందపడిపోయారు. ప్రమాదవశాత్తు ఒక చేతిని కోల్పోయి.. ఒంటి చేత్తో పనులు చేసుకుంటూ కాలం వెళ్లదీస్తున్న ఈమె రెండో చేయి.. మో చేతి వరకు విరిగిపోయింది. కాంతమ్మ అపస్మారక స్థితిలోకి వెళ్లగానే.. పూజితను వంట గదిలోకి లాక్కెళ్లి.. ఆమెపైనా కత్తితో దాడి చేశాడు. నిన్నే పెళ్లి చేసుకుంటానని, చంపొద్దని ప్రాధేయపడినా.. మెడ, భుజం, వీపు, చేయిపైనా కత్తితో దాడి చేశాడు. అనంతరం అక్కడి నుంచి బయటకు వచ్చి పారిపోయాడు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని