logo

నకిలీ విత్తు.. నమ్మి చిత్తు

ఈ చిత్రంలోని రైతు పేరు పత్యానాయక్‌. సిరికొండ మండలం పిప్రితండా. ఈయన ఓ ప్రైవేట్‌ కంపెనీకి సంబంధించిన పొద్దుతిరుగుడు విత్తనం విత్తారు. వీటిని నర్సింగ్‌పల్లిలో స్థానిక డీలర్‌ వద్ద బస్తా రూ.2,500 చొప్పున కొనుగోలు చేశారు.

Published : 21 Jan 2022 03:35 IST

నష్టాలు మూటగట్టుకుంటున్న రైతులు

పల్లెల్లో నిఘాపెడితేనే ప్రయోజనం

ఈ చిత్రంలోని రైతు పేరు పత్యానాయక్‌. సిరికొండ మండలం పిప్రితండా. ఈయన ఓ ప్రైవేట్‌ కంపెనీకి సంబంధించిన పొద్దుతిరుగుడు విత్తనం విత్తారు. వీటిని నర్సింగ్‌పల్లిలో స్థానిక డీలర్‌ వద్ద బస్తా రూ.2,500 చొప్పున కొనుగోలు చేశారు. బస్తాకు రూ.వెయ్యి చొప్పున అదనంగా వెచ్చించినా పంట వస్తే చాలనుకున్నారు. దాదాపు 23 ఎకరాల్లో వేస్తే పాతిక శాతమైనా మొలకరాలేదు. ఈ విషయాన్ని మండల వ్యవసాయశాఖ అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. బిల్లు లేకపోవడంతో న్యాయ పోరాటం చేయలేకపోయారు. దుక్కి, విత్తనం, ఎరువులు, కూలీలంటూ రూ.80 వేల వరకు పెట్టుబడి పెట్టారు. భూమి పడావుగా ఉంచుకోలేక దున్నేసి మళ్లీ జిల్లా కేంద్రం నుంచి విత్తనం తెచ్చి విత్తుకొన్నారు. ఇప్పుడా రైతు నష్టపరిహారం కోసం విత్తనం అమ్మిన వ్యాపారిపై ఆధారపడాల్సి వస్తోంది. ఒక్క సిరికొండ మండలంలోనే ఇలా 250 ఎకరాల్లో అన్నదాతలు నాసిరకం పొద్దుతిరుగుడు విత్తనం వేసి తీవ్రంగా నష్టపోయారు.

న్యూస్‌టుడే, నిజామాబాద్‌ వ్యవసాయం, సిరికొండ

వ్యవసాయాధారిత జిల్లాగా ఉన్న ఇందూరులో నకిలీ విత్తనాలు అన్నదాతను నట్టేటా ముంచుతున్నాయి. సీజన్‌లో డిమాండ్‌ ఉన్న పంటలకు ఏర్పడే కొరతను ఆసరా చేసుకుని వ్యాపారులు దోపిడీకి పాల్పడుతున్నారు. చట్టాల్లో ఎన్ని సంస్కరణలు తీసుకొచ్చినా.. పకడ్బందీగా తనిఖీలు చేసినా అక్రమార్కుల ఆగడాలు కొనసాగుతూనే ఉన్నాయి. ఎలాంటి అనుమతులు లేకుండానే పల్లెల్లో పాగా వేసి విత్తనాలు విక్రయిస్తున్నారు. వ్యాపారుల కక్కుర్తి, అధికారుల ఉదాసీనత అన్నీ కలిపి ఏటా ఆశల సాగులో రైతులు విత్తు‘కొని’ చిత్తవుతున్నారు.


గత వానాకాలం సీజన్లో పూత రాకపోవడంతో దున్నేసిన సోయా పంట

ప్రత్యామ్నాయాన్ని ఆసరాగా చేసుకుని..
యాసంగిలో ధాన్యం కొనుగోలు చేయమని ప్రభుత్వం చెప్పడంతో అన్నదాతలు ప్రత్యామ్నాయ పంటల కోసం పరుగులు తీశారు. ముఖ్యంగా పొద్దు తిరుగుడు వేసేందుకు ఇబ్బంది పడ్డారు. జిల్లాలో బస్తా విత్తనం లేకపోవడంతో ఇతర ప్రాంతాల నుంచి దొరికింది తెచ్చుకున్నారు. అదీనూ రెండింతల ఎక్కువ ధరకు కొన్నారు. అవి నాసిరకం కావడం, జన్యుస్వచ్ఛత లేకపోవడంతో సగానికి సగం  మొలక రాలేదు. అధిక ధర కారణంగా వ్యాపారులు బిల్లులివ్వలేదు.
సన్నాలంటూ  మోసం..
యాసంగిలో సన్నాలకు డిమాండ్‌ ఉండదు. అయినప్పటికీ రైస్‌మిల్లులకు, వ్యాపారులకు అమ్ముకోవచ్చని స్వల్పకాలికంగా వచ్చే సన్నాల వైపు మొగ్గు చూపారు. గంగాకావేరి అనే స్థానిక విత్తనానికి విపరీతమైన డిమాండ్‌ ఏర్పడింది. ఇదే పేరు చెప్పి ఎవరు పడితే వారు నకిలీ సరకు అమ్ముకుని సొమ్ము చేసుకున్నారు. 25 కిలోల బస్తా రూ.వెయ్యి వరకు విక్రయించారు. ఇందులో కొన్ని దీర్ఘకాలిక రకాలు ఉండటంతో నారు పోసిన తర్వాత వాస్తవం తెలుసుకుని లబోదిబోమంటున్నారు. ఒకవేళ చి‘వరి’ వరకు నీరందకపోతే తీవ్ర నష్టం తప్పదని ఆందోళన చెందుతున్నారు.
విత్తనోత్పత్తిలో  శరాఘాతం
జిల్లాలో ప్రభుత్వ, ప్రైవేటు కంపెనీలు సుమారు 70 వేల ఎకరాల్లో విత్తనోత్పత్తి చేయిస్తున్నాయి. అయితే వీటిని విత్తుకునేటప్పుడు ప్రైవేటు కంపెనీలు బిల్లులివ్వడం లేదు. ఇవీ పూత రాక, దిగుబడి లేక నష్టపోతున్న కేసులు ఆర్మూర్‌, భీమ్‌గల్‌ డివిజన్లలో ఎక్కువగా కనిపిస్తున్నాయి. తాజాగా ఆర్మూర్‌ మండలంలోని ఓ గ్రామంలో విత్తన జొన్న విత్తనం ఫెయిల్‌ అయింది. ఏపుగా పెరిగినప్పటికీ సమయం మించి పోతున్నా పూత, గింజ రావడం లేదు. 60 ఎకరాల్లో నష్టం వాటిల్లింది. బాధితులు కంపెనీ ప్రతినిధులు, సీడ్‌ ఆర్గనైజర్ల వెంట తిరుగుతున్నారు.
బాధ్యులపై చర్యలు తీసుకుంటాం
మేకల గోవింద్‌, జిల్లా వ్యవసాయాధికారి

జిల్లాలోని అన్ని పంటల విత్తనాల నమూనాలను సేకరించి ఫలితాలు చూస్తున్నాం. ప్రతికూలంగా వచ్చిన వాటిపై కేసులు పెడుతున్నాం. ప్రస్తుతం ఏడు కేసులకు సంబంధించి ఛార్జిషీటు సిద్ధం చేశాం. వీటిని త్వరలో కోర్టుకు సమర్పిస్తాం. సిరికొండ మండలంలో వచ్చిన ఫిర్యాదులపై ఏడీఏతో విచారణ జరిపిస్తున్నాం. బాధ్యులపై చర్యలుంటాయి. రైతులు ప్రభుత్వ గుర్తింపు ఉన్న డీలర్ల వద్దే విత్తనాలు కొనుగోలు చేయాలి. సంబంధిత రశీదును తప్పనిసరిగా తీసుకోవాలి. అధిక ధరలున్నా, నాసిరకమైనా సంబంధిత మండల ఏవోలకు ఫిర్యాదు చేయాలి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని