logo

వితంతువులకు ఆసరా..

పింఛను పొందుతున్న భర్త మరణిస్తే ఆయన స్థానంలో భార్యకు మంజూరు చేయాలని ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

Published : 18 Jan 2023 04:45 IST

భర్త చనిపోయిన నెలలోనే పింఛను మంజూరు

న్యూస్‌టుడే, కామారెడ్డి కలెక్టరేట్‌: పింఛను పొందుతున్న భర్త మరణిస్తే ఆయన స్థానంలో భార్యకు మంజూరు చేయాలని ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు ఉభయ జిల్లాల్లో అర్హులను గుర్తించి దరఖాస్తు చేయించాలని ఉన్నతాధికారుల నుంచి ఆదేశాలు వెలువడ్డాయి. ఆయా గ్రామాల్లో కార్యదర్శులు అర్హులను గుర్తించే పనిలో నిమగ్నమయ్యారు. దరఖాస్తు చేసిన 15 రోజుల్లోనే మంజూరయ్యేలా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం సూచించడంతో ప్రక్రియ వేగంగా సాగుతోంది. ఈ తరహా పింఛన్లు ఇన్నాళ్లుగా ఆగిపోయాయి. ప్రభుత్వ తాజా నిర్ణయంతో అర్హులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. సరాసరిన ప్రతి పంచాయతీలో ఎనిమిది మంది ఉన్నా ఉభయ జిల్లాల్లో 8 వేల మందికిపైగా లబ్ధి చేకూరే అవకాశం ఉంది.


ఎన్నాళ్లకో మోక్షం..

ఆసరా దరఖాస్తులను ప్రభుత్వం మూడేళ్లపాటు పక్కన పెట్టింది. గతేడాది ఆగస్టులో కొత్త పింఛన్లు మంజూరు చేసింది. ఇందులో అన్ని విభాగాల్లో అర్హులను గుర్తించారు. భర్త మృతి చెందితే ఆయన స్థానంలో భార్యకు మంజూరు చేయలేదు. వితంతు విభాగం కింద దరఖాస్తు చేసుకోమని చెప్పేవారు. ఉభయ జిల్లాల్లో పింఛను మంజూరు కాక ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరుగుతున్న వితంతువులు చాలామందే ఉన్నారు. ఎంపీడీవో కార్యాలయాలు, కలెక్టరేట్‌లో నిర్వహిస్తున్న ప్రజావాణి కార్యక్రమాలకు తరచూ వస్తూనే ఉన్నారు. ఇందుకోసం ప్రత్యేకంగా ఐచ్ఛికం లేకపోవడంతో అధికారులు కూడా ఏమీ చేయలేని పరిస్థితి ఉండేది.  


ఎంపీడీవో కార్యాలయాల్లో నమోదు

ఆసరా వెబ్‌సైట్‌ ఇప్పటికీ మూసే ఉంది. భర్తను కోల్పోయిన వారికి పింఛను మంజూరు చేయడానికి ఎంపీడీవో కార్యాలయాల్లో వివరాలు నమోదు చేస్తున్నారు. పంచాయతీ కార్యదర్శులు ఇక్కడే చేయిస్తున్నారు. బాధితుల్లో చాలామంది ఇది వరకే వితంతు పింఛనుకు దరఖాస్తు చేసుకోవడంతో కొందరికి మంజూరైంది.


ఇకపై ప్రతినెలా నవీకరణ

ఈ నెలలోనే అర్హులను గుర్తించి వారికి ఫిబ్రవరి నుంచి పింఛను మంజూరు చేయాలని ప్రభుత్వం పేర్కొంది. ఇక నుంచి ప్రతినెల ఇలాంటి బాధితులను గుర్తించి తక్షణం లబ్ధి చేకూర్చేలా వెబ్‌సైట్‌లో అప్‌డేట్‌ చేయాలని ఉన్నతాధికారులు ఆదేశించారు. భర్త చనిపోయిన వెంటనే మరణ ధ్రువీకరణ పత్రం జారీ చేయడంతో పాటు భార్య వివరాలతో ఎంపీడీవో కార్యాలయంలో ఆసరాకు దరఖాస్తు చేయించాలని సూచించారు.


అర్హులను గుర్తిస్తాం

భర్తను కోల్పోయిన వారికి వెంటనే పింఛను మంజూరు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇప్పటికే జిల్లావ్యాప్తంగా అన్ని ఎంపీడీవో కార్యాలయాల్లో దరఖాస్తులు తీసుకుంటున్నారు. ఈ కార్యక్రమం ప్రతి నెల కొనసాగుతుంది.

సాయన్న, డీఆర్డీవో, కామారెడ్డి

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని