logo

ఇంకా జనం గుండెల్లోనే..

వెంట పదుల సంఖ్యలో కార్లు... వందల్లో కార్యకర్తలు... ఒక నాయకుడు   వస్తున్నాడంటే ఆ హడావుడే వేరు. ఇక గల్లీలో చిన్న స్థాయి ప్రజా ప్రతినిధిగా ఎన్నికైనా చాలు తరాలకు సరిపడా సంపాదించుకోవాలనే తపన.

Updated : 29 Oct 2023 05:41 IST

స్ఫూర్తిదాయక జీవితం.. ఈ మాజీ ఎమ్మెల్యేలది
న్యూస్‌టుడే, బోధన్‌ పట్టణం

వెంట పదుల సంఖ్యలో కార్లు... వందల్లో కార్యకర్తలు... ఒక నాయకుడు   వస్తున్నాడంటే ఆ హడావుడే వేరు. ఇక గల్లీలో చిన్న స్థాయి ప్రజా ప్రతినిధిగా ఎన్నికైనా చాలు తరాలకు సరిపడా సంపాదించుకోవాలనే తపన. ఇందుకు భిన్నం కొందరు నాయకులు. తమకు ఎన్నిసార్లు చట్టసభలకు వెళ్లే అవకాశం లభించినా అది ఇచ్చిన ప్రజల పక్షాన నిల్చొని వారి మాదిరే  సాధారణ జీవితం అనుభవించారు. పరిమిత ఆదాయంతో నిరాడంబర జీవితం గడుపుతున్నారు. అలాంటి నాయకుల జీవితాలను తరచి చూడాల్సిన సమయమిది.

తక్కువ ఖర్చుతో  గెలిచి...

  • రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం నియోజకవర్గం నుంచి రెండుసార్లు శాసనసభకు కొండిగారి రాములు ప్రాతినిధ్యం వహించారు. 1989లో జరిగిన ఎన్నికల్లో చేసిన ఖర్చు రూ. 88వేలని పలుమార్లు ప్రస్తావించారని చెబుతారు. ఆయనా సాధారణ జీవితమే గడిపారు. రూ. వెయ్యితో కాలం వెల్లదీశానని చెప్పేవారు.
  • గజ్వేల్‌ నియోజకవర్గానికి 1962, 67, 72, 78ల్లో ఎమ్మెల్యేగా చేసిన గజ్వేల్‌ సైదయ్యది సాధారణ జీవితమే. ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించి  ప్రజా     సమస్యలు గుర్తించి వాటి పరిష్కారానికి చిత్తశుద్ధితో కృషి చేసేవారని చెబుతారు.
  • సున్నం రాజయ్య, భీంరెడ్డి, నరసింహారెడ్డి... ఇలా పలువురు ఎమ్మెల్యే పదవుల్లో కొనసాగినా దర్పం లేకుండా సాధారణ జీవనాన్నే అనుభవించారు. ప్రజల కోసం నిరంతరం తపించి జనం గుండెల్లో గుడి కట్టుకున్నారు.
  • ఆర్‌ఎస్‌ వాసురెడ్డి రామాయంపేట్‌ నియోజకవర్గానికి 1985లో ఎమ్మెల్యేగా ఎన్నికైన ఆయన ఎలక్షన్‌లో చేసిన ఖర్చు రూ. 30వేలేనట.  ఎమ్మెల్యేగా గెలుపొందినా ఆయన చనిపోయే వరకు సాధారణ జీవితమే గడిపారు. శాసనసభ సమావేశాలకు, ఎక్కడికెళ్లాలన్నా ఆర్టీసీ బస్సుల్లోనే  ప్రయాణం చేశారట.

గుమ్మడి నర్సయ్య...

ప్రస్తుత రాజకీయాల్లో సుపరిచితమైన నాయకుడు గుమ్మడి నర్సయ్య. ఖమ్మం జిల్లాకు చెందిన ఆయన ఐదుసార్లు ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహించినా సాధారణ జీవితమే అనుభవిస్తున్నారు. ఆర్టీసీ బస్సుల్లోనే ప్రయాణిస్తారు. ఇప్పటికీ వ్యవసాయం చేస్తూ జీవనం సాగిస్తున్నారు. తనకు వచ్చిన జీతంలో కొంత పార్టీకి, ప్రస్తుతం పింఛన్‌లోనూ ఇస్తున్నట్లు చెబుతారు. వర్తమాన రాజకీయాల్లో అలాంటి నాయకులు ఉన్నారంటే అతిశయోక్తి కాదు. ప్రస్తుత ఎన్నికల ఖర్చుకు తన ఎన్నికలో అయిన రూ. లక్ష ఖర్చు మధ్య వ్యత్యాసాన్ని చూసి విస్మయం వ్యక్తం చేశారాయన. ఆయన పేరుతో సినిమా తీశారు.


కుంజా బొజ్జి...

ఈయనా పూర్వ ఖమ్మం జిల్లాకు చెందిన వారే. 1952లో కమ్యూనిస్టు పార్టీలో చేరి 1985, 1989, 1994 మధ్య అసెంబ్లీకి ప్రాతినిధ్యం వహించారు. తొలుత రూ. 2వేల వేతనంలోనూ పార్టీకి కొంత చెల్లించిన ఆయన ఇంటి స్థలం తిరస్కరించారట. గాంధీ, పుచ్చలపల్లి సుందరయ్య వంటి వారి స్ఫూర్తినే రాజకీయాల్లో కొనసాగించిన ఆయన రూ. కోటి ఇస్తామన్నా పార్టీ మారలేదని చెబుతారు.


దేశిని చినమల్లయ్య...

పూర్వ కరీంనగర్‌ జిల్లాకు చెందిన ఈయన ఇందుర్తి నియోజకవర్గం నుంచి శాసనసభకు ప్రాతినిధ్యం వహించారు. 1978, 84, 89, 94 ఎన్నికల్లో చట్టసభకు ఎన్నికయ్యారు. మొత్తం నాలుగుసార్లు ఎమ్మెల్యేగా పనిచేసిన ఆయన ఆర్టీసీ బస్సుల్లోనే ప్రయాణం సాగించేవారని చెబుతారు. ఆస్తులు కూడబెట్టుకోకుండా నిరాడంబర జీవితం గడిపిన ఆయన ఆదర్శప్రాయుడు. ప్రతి ఒక్కరిని వరుసలు పెట్టి పిలిచేవారట.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని