logo

హైకోర్టును ఆశ్రయించిన సాహిల్‌

హైదరాబాద్‌ పంజాగుట్ట వద్ద బారీకేడ్లను ఢీకొట్టిన రోడ్డు ప్రమాద ఘటనలో నిందితుడిగా చేర్చడాన్ని సవాలు చేస్తూ బోధన్‌ మాజీ ఎమ్మెల్యే షకీల్‌ కొడుకు సాహిల్‌ అలియాస్‌ రాహిల్‌ హైకోర్టును ఆశ్రయించారు.

Published : 19 Apr 2024 05:35 IST

 విచారణ జూన్‌ 11కు వాయిదా 

ఈనాడు, హైదరాబాద్‌: హైదరాబాద్‌ పంజాగుట్ట వద్ద బారీకేడ్లను ఢీకొట్టిన రోడ్డు ప్రమాద ఘటనలో నిందితుడిగా చేర్చడాన్ని సవాలు చేస్తూ బోధన్‌ మాజీ ఎమ్మెల్యే షకీల్‌ కొడుకు సాహిల్‌ అలియాస్‌ రాహిల్‌ హైకోర్టును ఆశ్రయించారు. తనపై నమోదు చేసిన ఎఫ్‌ఐఆర్‌ను కొట్టేయాలని సాహిల్‌ దాఖలు చేసిన పిటిషన్‌పై గురువారం జస్టిస్‌ కె.లక్ష్మణ్‌ విచారణ చేపట్టారు. పిటిషనర్‌పై అక్రమంగా కేసు నమోదు చేశారని తన తరఫు న్యాయవాది వాదించారు. ఎలాంటి సూచికలు లేకపోవడంతో చీకట్లో బారికేడ్లను కారు ఢీకొందన్నారు. చిన్న ఘటనను పోలీసులు తీవ్రతరం చేస్తూ 13 మంది దాకా నిందితులను చేర్చుతూ వెళ్లారన్నారు. అక్రమంగా నమోదు చేసిన ఈ కేసును కొట్టేయాలని కోరారు. పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ వాదనలు వినిపిస్తూ విదేశాల నుంచి వచ్చిన పిటిషనర్‌ను పోలీసులు అరెస్ట్‌ చేశారని, కింది కోర్టు బెయిలు మంజూరు చేసిందన్నారు. ఈ దశలో ఎలాంటి మధ్యంతర ఉత్తర్వులు అవసరంలేదన్నారు. వాదనలు విన్న న్యాయమూర్తి దర్యాప్తు నిలిపివేతకు నిరాకరిస్తూ పోలీసులకు నోటీసులు జారీ చేశారు. విచారణను జూన్‌ 11కు వాయిదా వేశారు. తనపై కేసు కొట్టివేయాలని కోరుతూ ఇదే కేసులోని మరో నిందితుడైన నాని దాఖలు చేసిన పిటిషన్‌లోనూ పోలీసులకు నోటీసులు జారీ చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని