logo

ఓటు పోటెత్తేలా!

ఓటు హక్కుతోనే ప్రజాస్వామ్యం బలోపేతమవుతుంది. వజ్రాయుధాన్ని సమర్థంగా వినియోగిస్తేనే మంచి భవిష్యత్తు కోసం పనిచేసే నాయకులు ఎన్నికవుతారు.

Updated : 26 Apr 2024 06:14 IST

 ప్రత్యేక కార్యక్రమాలతో ప్రజల్లోకి
పోలింగ్‌ శాతం పెంచేందుకు యంత్రాంగం చర్యలు

న్యూస్‌టుడే, ఆర్మూర్‌, కామారెడ్డి కలెక్టరేట్‌ : ఓటు హక్కుతోనే ప్రజాస్వామ్యం బలోపేతమవుతుంది. వజ్రాయుధాన్ని సమర్థంగా వినియోగిస్తేనే మంచి భవిష్యత్తు కోసం పనిచేసే నాయకులు ఎన్నికవుతారు. ఏమాత్రం  అలసత్వం వహించినా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది.గత ఎన్నికల్లో ఓటింగ్‌ శాతాన్ని పరిశీలించిన అధికారులు ఈసారి మరింత పెంచేందుకు దృష్టి సారించారు. స్వీప్‌ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున కార్యక్రమాలు చేపడుతున్నారు. మే 13న జరిగే పోలింగ్‌ రోజున అందరూ బాధ్యతగా ఓటు వేయడానికి పోలింగ్‌ కేంద్రాలకు నడవాలి.

లోక్‌సభ ఎన్నికల్లో ఈసారి పోలింగ్‌ శాతం మెరుగ్గా ఉండేందుకు ఎన్నికల సంఘం కసరత్తు ముమ్మరం చేసింది. ప్రత్యేక కార్యక్రమాలతో ఓటర్లలో చైతన్యం చేస్తోంది. నిజామాబాద్‌ పార్లమెంటు స్థానంలో ఇటీవల కాలంలో కనీసం 70 శాతం పోలింగ్‌ చూసిన దాఖలాలు లేవు. దీంతో యంత్రాంగం తక్కువ పోలింగ్‌ అయ్యే స్థానాలపై దృష్టి పెట్టి దిద్దుబాటు చర్యలు తీసుకునేందుకు ప్రత్యేక పరిశీలకులను రంగంలోకి దించింది.  

5కె రన్‌లో కామారెడ్డి జిల్లా ఎన్నికల అధికారి జితేశ్‌ వి పాటిల్‌, ఎస్పీ సింధూశర్మ (పాతచిత్రం)

స్వీప్‌ ద్వారా చైతన్యం

సిస్టమేటిక్‌ ఓటర్స్‌ ఎడ్యుకేషన్‌ అండ్‌ ఎలెక్టోరల్‌ పార్టిసిపేషన్‌ (ఎస్‌వీఈఈపీ)తో ఎన్నికల యంత్రాంగం క్షేత్రస్థాయిలో వెళ్తోంది. ముఖ్యంగా కళాశాల విద్యార్థులు, మహిళ సంఘాలకు అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నారు. బస్టాండు, రైల్వేస్టేషన్‌, ప్రార్థన మందిరాలు, కళాశాలలు, పరిశ్రమల వద్ద ఓటరు చైతన్య ప్రతిజ్ఞలు చేయిస్తున్నారు. గత ఎన్నికల్లో 40 శాతం కంటే తక్కువగా ఉన్న పోలింగ్‌ కేంద్రాలపై ప్రత్యేక దృష్టి పెట్టారు. కామారెడ్డి జిల్లాలో సంకల్పపత్రాలను విద్యార్థుల ద్వారా తల్లిదండ్రులకు అందించి వాటిపై సంతకాలు చేయించారు. ఇటీవల 5కే పరుగు ద్వారా పోలింగ్‌పై అవగాహన పెంచారు.

అందుబాటులో సౌకర్యాలు

పోలింగ్‌ రోజు ఓటర్లకు ఇబ్బంది కలగవద్దని ఇప్పటికే ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాలు, పరిశ్రమలకు సెలవు విధానం కొనసాగుతోంది. ఎన్నికల విధుల్లో ఉంటే సిబ్బందికి పోస్టల్‌ బ్యాలెట్‌ సౌకర్యం కల్పించారు. కొత్తగా గత ఎన్నికల నుంచి 85   ఏళ్ల పైబడిన వారు,   శారీరక వైకల్యం ఉన్న వారికి ప్రత్యేకంగా ఓటు హక్కు వినియోగించుకునేందుకు చర్యలు తీసుకుంటున్నారు. పోలింగ్‌ కేంద్రాల వద్ద నీడ, మంచి నీటి వసతి, నడకకు వీలుగా ర్యాంపులు అన్నీ సరిచూసుకుంటున్నారు.

సెల్ఫీ  పాయింట్‌

ఈవీఎం మోడల్స్‌, సెల్ఫీ పాయింట్లు ఏర్పాటు చేస్తున్నారు. ఓటు విలువ తెలిసేలా మహిళా సంఘాలకు రంగోళి, మెహందీ పోటీలతో ఉత్సాహపరుస్తున్నారు. ప్రత్యేక కూడళ్ల వద్ద సాంస్కృతిక కార్యక్రమాలు చేస్తున్నారు. అన్ని వర్గాల ప్రజలు ప్రజాస్వామ్య హక్కుగా ఓటును వినియోగించుకోవాలని వివరిస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని