logo

దారి పొడవునా గులాబీ దండు!

భారాస అధినేత బస్సు యాత్రతో గులాబీ దండులో జోష్‌ నెలకొంది. కరీంనగర్‌, జగిత్యాల జిల్లాల్లో కొనసాగిన యాత్రకు అపూర్వ స్పందన లభించింది. వీణవంక నుంచి జగిత్యాల వరకు దారి పొడువునా జనాలు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు.

Published : 06 May 2024 04:48 IST

జగిత్యాలలో కేసీఆర్‌కు ఘనస్వాగతం

జగిత్యాల రోడ్‌ షోలో మాట్లాడుతున్న కేసీఆర్‌

ఈనాడు, కరీంనగర్‌, న్యూస్‌టుడే, జగిత్యాల, వీణవంక: భారాస అధినేత బస్సు యాత్రతో గులాబీ దండులో జోష్‌ నెలకొంది. కరీంనగర్‌, జగిత్యాల జిల్లాల్లో కొనసాగిన యాత్రకు అపూర్వ స్పందన లభించింది. వీణవంక నుంచి జగిత్యాల వరకు దారి పొడువునా జనాలు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. శనివారం అర్ధరాత్రి దాటిన తర్వాత బస్సులో కేసీఆర్‌ వీణవంకకు చేరుకున్నారు. హుజూరాబాద్‌ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి నివాసంలో బస చేశారు. ఆదివారం మధ్యాహ్నం అక్కడ రైతులు, వివిధ వర్గాలతో ఆత్మీయ సమ్మేళనం నిర్వహించగా ఉమ్మడి జిల్లాతో ఉన్న అనుబంధాన్ని నెమరు వేసుకున్నారు. ముఖ్యంగా హుజూరాబాద్‌ గడ్డ ఉద్యమకాలంలో అండగా నిలిచిన తీరుతోపాటు అభివృద్ధి పరంగా ఇక్కడికి అందిన సంక్షేమ ఫలాలను గుర్తు చేశారు. నాయకులు, కార్యకర్తలు అధైర్యపడొద్దని మళ్లీ అధికారంలోకి వస్తామనే ధీమా వ్యక్తం చేశారు. నిరుత్సాహపడకుండా ఉత్తేజంతో పని చేయాలని పిలుపునిచ్చారు. కరీంనగర్‌లో భారాస అభ్యర్థి బోయినపల్లి వినోద్‌కుమార్‌ను గెలిపించాలని కోరారు. వీణవంక నుంచి జగిత్యాల వరకు బస్సు యాత్రలో సందడి కనిపించింది. ఊరూరా నాయకులు ఆపి ఉద్యమ నేతకు అభివాదం తెలుపుతూనే పూల వర్షం కురిపించి అభిమానాన్ని చాటారు. మానకొండూర్‌, కరీంనగర్‌, కొత్తపల్లి, గంగాధర, పూడూరు, మల్యాల, జగిత్యాలలో పెద్దఎత్తున శ్రేణులు దారికి ఎడమ వైపున నిలిచిన ప్రజలు, కార్యకర్తలకు కేసీఆర్‌ విజయ సంకేతం చూపిస్తూ ముందుకు సాగారు. కొండగట్టు వద్ద హోటల్‌లో టీ తాగి జగిత్యాలకు వెళ్లారు. జగిత్యాల కొత్త బస్టాండ్‌ నుంచి పాత బస్టాండ్‌ వరకు ర్యాలీ నిర్వహించారు. అక్కడి కూడలిలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై విమర్శలు చేస్తూ తమ హయాంలో జరిగిన అభివృద్ధిని ప్రసంగంలో వివరించారు. ప్రత్యర్థులపై విమర్శల బాణాలతో కార్యకర్తలను ఉత్సాహపరిచారు. జగిత్యాల జిల్లా ఉండాలా వద్దా? అని ప్రశ్నించగా జనం ఉండాలి అని సమాధానమిచ్చారు.. వరద కాలువ తమ హయాంలో సజీవంగా ఉండేదని.. ఇప్పుడు ఎండిపోయిందని, ఇందుకు కారకులెవరో గుర్తించాలని పేర్కొన్నారు. ఈ ప్రాంతంలో బీడీ కార్మికులు ఎక్కువ. వారికి పింఛన్‌ తీసుకొచ్చా.. వారందరూ భారాస అండగా నిలవాలని కోరారు. జగిత్యాలకు వైద్య కళాశాల వస్తదని ఎప్పుడన్నా ఊహించారా.. అది సాకారం చేశామని గుర్తు చేశారు. నిజామాబాద్‌ భారాస అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్‌, పెద్దపల్లి భారాస అభ్యర్థి కొప్పుల ఈశ్వర్‌ను గెలిపించాలని కోరారు.

పాల్గొన్న జనం

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని