logo

ఆదాయానికి గండి

‘కామారెడ్డిలో పాత జాతీయరహదారిపై ఉన్న ఓ వాణిజ్య భవనం నివాసయోగ్య పన్ను పరిధిలో ఉంది. నిర్మాణాల వైశాల్యం ఎక్కువ ఉన్నా తక్కువ చూపారు. నిర్దేశిత కొలతల ఆధారంగా పన్ను చెల్లించడం లేదు.

Published : 07 May 2024 06:07 IST

నెల రోజుల్లో వాణిజ్య భవనాలు 7,000 గుర్తింపు

కామారెడ్డిలో సర్వే చేపట్టిన పురపాలక సిబ్బంది

‘కామారెడ్డిలో పాత జాతీయరహదారిపై ఉన్న ఓ వాణిజ్య భవనం నివాసయోగ్య పన్ను పరిధిలో ఉంది. నిర్మాణాల వైశాల్యం ఎక్కువ ఉన్నా తక్కువ చూపారు. నిర్దేశిత కొలతల ఆధారంగా పన్ను చెల్లించడం లేదు. ఏళ్ల నుంచి కొలతలను మార్చి పన్ను తక్కువ వచ్చేలా చేశారు. దీంతో పురపాలిక ఆదాయానికి గండి పడుతోంది.’

కామారెడ్డి పట్టణం- న్యూస్‌టుడే

అనుమతి లేకుండా ఇళ్ల నిర్మాణాలు చేపట్టి సర్కారు ఆదాయానికి గండి కొడుతున్నారు. వాణిజ్య అవసరాలకు వినియోగిస్తున్న ఇళ్లకు గృహ అవసర పన్ను విధిస్తున్నారు. ఇటీవల పురపాలక సిబ్బంది ఏప్రిల్‌ 1వ తేదీ నుంచి కొలతల సర్వే చేపట్టారు. నెల రోజుల్లో 7000 వాణిజ్య భవనాలను గుర్తించారు. త్వరలో వాటి కొలతలను ఆన్‌లైన్‌ చేయనున్నారు. పన్ను సవరిస్తే బల్దియాకు ఆదాయం రానుంది.

వార్డుల్లో పర్యటన

జిల్లాకేంద్రంలో వార్డుల్లో సిబ్బంది ప్రత్యేక సర్వే చేపడుతున్నారు. ఇప్పటికే బల్దియాకు రూ.6.80 కోట్ల ఆదాయం ఆస్తి పన్నుల రూపేణా సమకూరుతోంది. 49 వార్డుల్లో 22,135 నిర్మాణాలు ఉన్నాయి. అందులో నివాస, నివాసేతర, వాణిజ్య గృహాలు పన్ను పరిధిలో ఉన్నాయి. అనేక నిర్మాణాలు వాణిజ్య అవసరాలకు వాడుతున్నా.. గృహ కేటగిరీ కింద పన్ను చెల్లిస్తున్నారు. దీంతో పురపాలికకు నష్టం వాటిల్లుతుంది. ఈ సమస్యను అధిగమించేందుకు పన్నుల సవరణ చేపట్టేందుకు సిబ్బంది వార్డుల్లో పర్యటిస్తున్నారు. రూ.12 కోట్ల మేర ఆస్తి పన్నులు రాబట్టాలని అధికారులు అంచనా వేస్తున్నారు.

మరో 60 రోజుల పాటు

కామారెడ్డిలో వార్డుకు 50 గృహాల చొప్పున సిబ్బంది కొలతలు తీయాలని పురపాలక అధికారులు బిల్‌కలెక్టర్లకు ఆదేశాలిచ్చినా ఎండ తీవ్రత కారణంగా సర్వేకు అగచాట్లు తప్పడం లేదు. దీంతో మరో 60 రోజుల పాటు నివాస భవనాల కొలతల సర్వే చేపట్టనున్నారు. నిర్మాణం ఏ విధంగా ఉందో భువన్‌ సర్వేకు జోడించాలి. తర్వాత ప్రక్రియ చేపడితే సత్ఫలితాలను ఆశించే వీలుంది.

కొలతలు తీసుకున్నాం

సుజాత, కమిషనర్‌

జిల్లాకేంద్రంలో ప్రధాన ప్రాంతాలతో పాటు అంతర్గత కాలనీల్లో వాణిజ్యభవనాలను గుర్తించాం. కొలతలను తీసుకున్నాం. రికార్డుల్లో నమోదు చేశాం. త్వరలో ఆన్‌లైన్‌ చేస్తాం. ఈ నెలలో గృహ నిర్మాణాల సర్వే కొనసాగనుంది. ఎండల కారణంగా సిబ్బందికి మరింత సమయం ఇవ్వనున్నాం.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని