logo

కలుస్తూ.. కలియతిరుగుతూ..

లోక్‌సభ ఎన్నికల ప్రచారం మూడు రోజుల్లో ముగియనుంది. ప్రధాన పార్టీలు బహిరంగ సభలు, రోడ్‌ షోలతో హోరెత్తిస్తున్నాయి. అభ్యర్థులు ఊళ్లను చుట్టేస్తున్నారు.

Published : 08 May 2024 06:43 IST

సామాజిక వర్గాల ఓట్లే లక్ష్యంగా..

 జోరుగా ఆత్మీయ సమ్మేళనాలు

ఈనాడు, నిజామాబాద్‌: లోక్‌సభ ఎన్నికల ప్రచారం మూడు రోజుల్లో ముగియనుంది. ప్రధాన పార్టీలు బహిరంగ సభలు, రోడ్‌ షోలతో హోరెత్తిస్తున్నాయి. అభ్యర్థులు ఊళ్లను చుట్టేస్తున్నారు. ఘాటైన ప్రసంగాలతో ప్రత్యర్థులపై విమర్శల వర్షం కురిపిస్తున్నారు. మరో వైపు పెద్దసంఖ్యలో ఓటు బ్యాంకును సాధించే వ్యూహాలకు పదును పెడుతున్నారు. కులాల వారీగా ఉన్న ఓట్ల పరిగణనలోకి తీసుకుంటూ.. ఆయా సామాజికవర్గాలతో ఆత్మీయ సమ్మేళనాలు నిర్వహిస్తున్నారు. ఇప్పటి వరకు ఆయా వర్గానికి తోడ్పాటునందించిన విషయాలు చెబుతున్నారు. తమ పార్టీకి ఈ ఎన్నికల్లో మద్దతుగా నిలవాలని కోరుతున్నారు. ఇదే సందర్భంలో సదరు సామాజికవర్గానికి రానున్న రోజుల్లో ప్రయోజనం చేకూర్చే విషయాలపై హామీలు ఇస్తున్నారు.
గంపగుత్తగా ఒడిసిపట్టేందుకు..
నిజామాబాద్‌ లోక్‌సభ స్థానం పరిధిలో ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో బీసీల ఓటు బ్యాంకు పెద్ద సంఖ్యలో ఉంటుంది. వీరిని తమ వైపునకు తిప్పుకొనే ప్రయత్నాలు మూడు పార్టీలు చేస్తున్నాయి. ఒక సామాజికవర్గాన్ని ప్రసన్నం చేసుకునే క్రమంలో అదే కులానికి చెందిన నేతలను రంగంలోకి దింపుతున్నారు. వారు సదరు కుల పెద్దలతో సమావేశమవుతూ తమ పార్టీకి ఓట్లు వేయించాలని కోరుతున్నారు. తర్పల వారీగా సమావేశాలు నిర్వహించుకొని తమ పార్టీ సందేశాలను వివరించి ఓట్లు వేసేలా చూడాలని విన్నవిస్తున్నారు. సంఘం జిల్లా పెద్దలు ఇతర మండలాల వారిని కలవడానికి వెళ్లేందుకు వాహనాలు సమకూరుస్తున్నారు. చిన్నపాటి విందులూ ఏర్పాటు చేస్తున్నారు.

ప్రత్యర్థి ఓట్లు చీల్చే ఎత్తుగడ

లక్షల్లో ఓట్లున్న రెండు బీసీ కులాలపై మూడు పార్టీలు ప్రధానంగా దృష్టి సారించాయి. ఇందులో ఓ సామాజికవర్గం ఒక పార్టీకి ప్రధాన ఓటు బ్యాంకుగా ఉంటూ వస్తోంది. మరో కులంలోనూ ఆ పార్టీకి పెద్దసంఖ్యలో ఓట్లు వచ్చే అవకాశం ఉందని అంచనాలున్నాయి. ఇది గ్రహించిన ప్రత్యర్థి పార్టీలు ఆ రెండింటి ఓటు బ్యాంకును కొంత మేర తమ వైపునకు తిప్పుకొనే ప్రయత్నాలు ముమ్మరం చేశాయి. ఇలా వ్యూహప్రతివ్యూహాలతో ప్రచారంలో జోరు పెంచాయి. ఈ ఎత్తుగడలు.. ఎంత వరకు ఫలిస్తాయనేది పోలింగ్‌ సరళి.. ఫలితాలు వెల్లడైన తర్వాత గానీ అంచనా దొరికే అవకాశం ఉంది.

రిజర్వేషన్ల అంశం  చుట్టే..

ప్రభావం చూపే రిజర్వేషన్ల అంశంపైనా చర్చ పెడుతున్నారు. తమ ప్రసంగాల్లో ఈ విషయాలనే ప్రస్తావిస్తున్నారు. ఒకపార్టీపై మరోపార్టీ నెపం వేస్తూ పరస్పరం విమర్శల దాడులు చేసుకుంటున్నాయి. మీ వల్లే ఆ వర్గానికి నష్టం జరిగిందని ఒకరంటే.. లేదూ మీ పార్టీ నిర్ణయాలతోనే ఆయా వర్గాలు నష్టపోతున్నాయంటూ మరొకరు వాదన చేస్తున్నారు. ఇలా ఒకే అంశంపై ప్రత్యర్థి పార్టీలన్ని మాట్లాడుతున్నా.. ప్రజలు ఎవరి వాదనను విశ్వసిస్తారు? ఏ పార్టీ వైపు మొగ్గుచూపుతారనేది రాజకీయ వర్గాల్లో ఆసక్తికరంగా చర్చ సాగుతోంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

    ap-districts
    ts-districts

    సుఖీభవ

    చదువు