logo

తరలొస్తూ.. తర్ఫీదు పొందుతూ

కొందరు వేసవి సెలవులను ఇంట్లోనే ఉంటూ చరవాణుల్లో వీడియోగేమ్‌లు ఆడుకుంటుంటే.. ఈ చిన్నారులు మాత్రం సృజనాత్మకతకు పదునెడుతున్నారు.

Published : 08 May 2024 07:05 IST

వేసవి శిబిరాలకు చిన్నారుల ఆసక్తి

బాలభవన్‌లో ..

 న్యూస్‌టుడే, నిజామాబాద్‌ సాంస్కృతికం: కొందరు వేసవి సెలవులను ఇంట్లోనే ఉంటూ చరవాణుల్లో వీడియోగేమ్‌లు ఆడుకుంటుంటే.. ఈ చిన్నారులు మాత్రం సృజనాత్మకతకు పదునెడుతున్నారు. సమయపాలన, క్రమశిక్షణ, నైతిక విలువలు పెంపొందించుకోవడానికి ప్రాధాన్యమిస్తున్నారు. ప్రత్యేక వేసవి శిక్షణ శిబిరాలకు తరలివెళ్తున్నారు. తమకు ఇష్టమైనవి నేర్చుకునేందుకు ఉదయం 6 గంటల నుంచే సమాయత్తం అవుతున్నారు. 8 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు శిబిరాల్లోనే శిక్షణ పొందుతున్నారు.

 రామకృష్ణ సేవా సమితిలో..

గంగాస్థాన్‌ ఫేస్‌-2 రామకృష్ణ ధ్యానమందిరంలో 120 మంది శిక్షణ పొందుతున్నారు. అందమైన చేతిరాత, సంగీతం, యోగా, ధ్యానం, కర్రసాము, తైక్వాండో వంటి అంశాలు నేర్చుకుంటున్నారు. నలుగురు శిక్షకుల ఆధ్వరంలో ఉదయం 7 నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు కొనసాగుతున్నాయి. చిన్నారులకు అల్పాహారం కూడా అందిస్తున్నారు. తరగతులు ఈ నెల 31 వరకు కొనసాగుతాయని అధ్యక్షుడు సాయిప్రసాద్‌ పేర్కొంటున్నారు. శివాజీనగర్‌ రామకృష్ణ విద్యానికేతన్‌లో ప్రార్థన, లలితసంగీతం, వేదగణితం, భజనలు, ఆంగ్లభాషపై పట్టు, నీతికథలు అంశాలపై 100 మంది శిక్షణ తీసుకుంటున్నారు. ఈ నెల 15న తరగతులు ముగియనున్నాయి.

ఆర్యసమాజ్‌లో..

ఇందూరు ఆర్యసమాజ్‌ ఆధ్వర్యంలో కస్బాగల్లీ వైదిక సత్సంగ్‌భవన్‌లోని ఆవాస శిక్షణ శిబిరంలో 120 మంది బాలలు పాల్గొంటున్నారు. 9 రోజుల పాటు వేదమంత్రపఠనం, హోమ నిర్వహణ, భగవద్గీత శ్లోకాల కంఠస్థం, యోగా, ప్రాణాయామం, వ్యక్తిత్వ వికాసం వంటి అంశాలపై ఆరుగురు శిక్షకులు అవగాహన కల్పిస్తున్నారు. ఈ నెల 11న శిబిరం ముగుస్తుందని అధ్యక్షుడు సూర్యప్రకాశ్‌ తెలిపారు.

ఇస్కాన్‌ ద్వారకానగర్‌ కేంద్రంలో..

ఇందూరు ఇస్కాన్‌ ద్వారకానగర్‌ కేంద్రంలో సంస్కార్‌ శిబిరానికి 100 మంది హాజరవుతున్నారు. ఉదయం 8 నుంచి 11 గంటల వరకు తరగతులు కొనసాగుతున్నాయి. ప్రకృతిసిద్ధమైన రాఖీలు, హోలీ రంగులు, మట్టి గణపతుల తయారీ, సేంద్రియ సాగు, ధ్యానం, యోగా, వ్యక్తిత్వ వికాసం, నాటికలపై ఆరుగురు తర్ఫీదునిస్తున్నారు. ఈ నెల 12 వరకు తరగతులు కొనసాగుతాయని అధ్యక్షుడు సిద్ధరాం బలరాందాస్‌ తెలిపారు.

బాలభవన్‌లో 650 మంది..

చిన్నారుల ఆత్మీయ నేస్తంగా పేరొందిన జిల్లా బాలభవన్‌లో శిక్షణ తరగతులకు 650కి పైగా చిన్నారులు చేరారు. జిల్లా నుంచే కాకుండా సమీప జిల్లాలు కరీంనగర్‌, మెదక్‌, హైదరాబాద్‌ ఇతర ప్రాంతాలకు చెందిన పిల్లలు వచ్చారు. ఇక్కడ చిత్రలేఖనం, శాస్త్రీయ నృత్యం, కుట్లు అల్లికలు, ఎంబ్రాయిడరీ, వృథా వస్తువులతో అందమైన ఆకృతుల తయారీ, గ్లాస్‌పెయింటింగ్‌, నీతికథలు, కర్రసాము, స్కేటింగ్‌ వంటి అంశాలపై 11 మంది శిక్షకులు తర్ఫీదునిస్తున్నారు. వచ్చే నెల 10 వరకు తరగతులు కొనసాగుతాయని పర్యవేక్షకుడు వి.ప్రభాకర్‌ తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

    ap-districts
    ts-districts

    సుఖీభవ

    చదువు