logo

నేర వార్తలు

నవరంగపూర్‌ జిల్లా రాయ్‌ఘర్‌ సమితిలో భారత్‌మాల ప్రాజెక్టు నిర్మాణం జరుగుతోంది. దీనికి సంబంధించిన సామగ్రి నెలరోజుల క్రితం చోరీ జరిగింది.

Published : 24 Mar 2023 06:06 IST

నిర్మాణ సామగ్రి చోరీ.. అరెస్టు

నవరంగపూర్‌, న్యూస్‌టుడే: నవరంగపూర్‌ జిల్లా రాయ్‌ఘర్‌ సమితిలో భారత్‌మాల ప్రాజెక్టు నిర్మాణం జరుగుతోంది. దీనికి సంబంధించిన సామగ్రి నెలరోజుల క్రితం చోరీ జరిగింది. దర్యాప్తు చేసిన పోలీసులు గురువారం నిందితులను అరెస్ట్‌ చేశారు. సమితిలో జడపరా గ్రామానికి చెందిన సానరామ్‌ గండ్‌, జలంగపర గ్రామానికి చెందిన దేబన ఘరామి, బంకిమ్‌ మిశ్ర, దిలీప్‌ బిశ్వాల్‌, పావరబెల గ్రామానికి చెందిన పరితోష్‌ మండల్‌ ఈ దొంగతనానికి పాల్పడినట్లు రాయ్‌ఘర్‌ ఎస్‌డీపీవో సుబేందు శబర్‌ తెలిపారు. పాత సామగ్రి దుకాణంలో విక్రయించగా వాటిని స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు వెల్లడించారు.


ఉరేసుకుని వ్యక్తి ఆత్మహత్య

జయపురం, న్యూస్‌టుడే: జయపురంలోని జయనగర్‌ ప్రాంతంలో ఉన్న పంచనన్‌ మందిర సమీపంలో చెట్టుకు ఉరేసుకుని వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. టౌన్‌ ఐఐసీ సంబిత్‌ కుమార్‌ తెలిపిన వివరాల ప్రకారం.. మృతి చెందిన వ్యక్తి నవరంగపూర్‌ జిల్లాలో ఖంటిగూడ ప్రాంతానికి చెందిన కైలాస్‌ చలాన్‌(35)గా గుర్తించారు. పోలీసుల ప్రాథమిక దర్యాప్తులో మృతుడు మానసిక వ్యాధితో బాధపడుతున్నట్లు తెలిసింది. మృతికి కారణాలు తెలియరాలేదని పోలీసులు తెలిపారు.


గంజాయి పట్టివేత: ఇద్దరి అరెస్టు

మల్కాన్‌గిరి, న్యూస్‌టుడే: మల్కాన్‌గిరి జిల్లా చిత్రకొండ ఠాణా పోలీసులు గంజాయి స్వాధీనం చేసుకొని ఇద్దరిని అరెస్టు చేశారు. పోలీసుల వివరాల ప్రకారం.. బుధవారం రాత్రి చిత్రకొండ పోలీసులు ఎస్సార్‌ కంపెనీ కూడలి వద్ద పెట్రోలింగ్‌ చేస్తున్న సమయంలో ఓ కారు అతివేగంతో వస్తుండడంతో ఆపి తనిఖీ చేశారు. అందులో గంజాయి గుర్తించి, ఇద్దరిని అరెస్టు చేశారు. ఈ ఇద్దరిలో ఒకరు మైనర్‌, ఇంకొకరు మల్కాన్‌గిరి జిల్లా చిత్రకొండ ఠాణా తటమనపల్లి గ్రామానికి చెందిన సంతోష్‌ ఖిలగా గుర్తించారు. గంజాయి మొత్తం 65 కిలోల గంజాయి స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు.


భూ తగాదాల్లో ఒకరి మృతి: మరో ఇద్దరికి గాయాలు

కటక్‌, న్యూస్‌టుడే: అనుగుల్‌ జిల్లా జరపొడ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో ఉన్న బడసంహార గ్రామంలో గురువారం రెండు కుటుంబాల మధ్య జరిగిన ఘర్షణలో ఒక వ్యక్తి మృతి చెందగా, మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. గ్రామంలో ఉంటున్న రఘునాథ్‌ సాహు, నవీన్‌ సాహు మధ్య కొన్నాళ్లుగా భూ తగాదాలు కొనసాగుతున్నాయి. గురువారం ఉదయం ఈ రెండు కుటుంబాల మధ్య ఘర్షణలు జరిగాయి. ఒకరిపై ఒకరు ఆయుధాలతో దాడులు చేసుకున్నారు. ఈ ఘర్షణల్లో నవీన్‌ సాహు(55) మృతి చెందగా, ఆయన భార్య, కుమారుడు తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకొన్న పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని గాయపడినవారిని జిల్లా ప్రధాన ఆరోగ్యకేంద్రానికి తరలించి దర్యాప్తు చేపట్టారు.


డెలివరీ బాయ్‌ పేరుతో దోపిడీ

కటక్‌, న్యూస్‌టుడే: మయూర్‌భంజ్‌ జిల్లా బరిపద పట్టణంలో గుర్తు తెలియని దుండగుడు మహిళ ఇంటిలో చొరబడి నగలు దోచుకుని పరారయ్యాడు. పట్టణ పోలీసులు అందించిన వివరాల ప్రకారం... పోలీస్‌ స్టేషన్‌కి కొంత దూరంలో ఉన్న వీధిలో ప్రియాంక సాహు అనే మహిళ కుటుంబంతో కలసి ఉంటోంది. ఇంటిలో భర్త, కుమారుడు లేని సమయంలో యువకుడు ఇంటి తలుపు తట్టి తను డెలివరీ బాయ్‌నని చెప్పాడు. ప్రియాంక తలుపు తీయగానే లోపలికి చొరబడి ఆమె తలకు తుపాకీ గురి పెట్టి బంగారు నగలు ఇవ్వాలని బెదిరించాడు. దీంతో ప్రియాంక మెడలో ఉన్న మంగళసూత్రం, చెవి దిద్దులు, బీరువాలో ఉన్న నాలుగు బంగారు ఉంగరాలు ఇవ్వడంతో వాటిని పట్టుకొని బయటకెళ్లి తలుపునకు బయట నుంచి గొళ్లెం వేశాడు. తర్వాత ఆమె కిటికీ వద్దకు వచ్చి కేకలు వేయడంతో ఇరుగుపొరుగు వారు వచ్చి తలుపు గొళ్లెం తీశారు. ఈ ఘటనపై ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఆయన ముఖానికి మాస్క్‌ ధరించి ఉండడం వల్ల గుర్తించలేకపోయినట్లు తెలిపింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని