logo

వ్యవసాయాధికారుల కొరత.. అన్నదాతల వెత

రైతుల సంక్షేమాభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం కోట్లాది రూపాయలు ఖర్చు చేస్తున్నా, అధికారుల నిర్లక్ష్యం కారణంగా ఆ సేవలు సక్రమంగా అందడం లేదు. వెనుకబడిన కొరాపుట్‌ జిల్లాలో వ్యవసాయ విభాగం పని తీరు తీవ్ర అసంతృప్తికి గురిచేస్తోంది.

Published : 28 Apr 2024 06:51 IST

సిబ్బంది భర్తీపై కొరవడిన శ్రద్ధ
న్యూస్‌టుడే, సిమిలిగుడ

ఉపయోగపడని కొత్త కార్యాలయం

అధ్వానంగా వ్యవసాయ కార్యాలయాలు, అధికారులను కలిసేందుకు కి.మీ. వెళ్లాల్సిన దుస్థితి. వ్యవసాయాధికారులు, సిబ్బంది కొరత. ఇదీ కొరాపుట్‌ జిల్లాలో కర్షకులు       ఎదుర్కొంటున్న దుస్థితి.

రైతుల సంక్షేమాభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం కోట్లాది రూపాయలు ఖర్చు చేస్తున్నా, అధికారుల నిర్లక్ష్యం కారణంగా ఆ సేవలు సక్రమంగా అందడం లేదు. వెనుకబడిన కొరాపుట్‌ జిల్లాలో వ్యవసాయ విభాగం పని తీరు తీవ్ర అసంతృప్తికి గురిచేస్తోంది. ముఖ్యంగా సంబంధిత విభాగంలో ఏళ్ల తరబడి అధికారులు, సిబ్బంది పోస్టులు ఖాళీగా ఉన్నా వాటిని భర్తీ చేసేందుకు ప్రభుత్వం శ్రద్ధ చూపడం లేదు. దీంతో కార్యాలయానికి వెళ్తున్న రైతులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

చిత్తశుద్ధి లోపం

నందపూర్‌ వ్యవసాయ విభాగంలో పదుల సంఖ్యలో పోస్టులు ఖాళీగా ఉండడంతోపాటు పనితీరులో చిత్తశుద్ధి లేదు. కొరాపుట్‌ వ్యవసాయ శాఖ పరిధిలో ఉన్న సిమిలిగుడ వ్యవసాయ శాఖ కార్యాలయం పనితీరులోనూ అన్నదాతలకు వెతలు తప్పడం లేదు. నిబంధన ప్రకారం సమితి కేంద్రం ఆవరణలోనే వ్యవసాయ శాఖ కార్యాలయం ఉండాలి. అయిదేళ్ల కిందట సిమిలిగుడ సమితి కేంద్రంలోని వ్యవసాయ కార్యాలయ భవనం మరమ్మతులకు గురైంది. దీంతో సమితి కేంద్రానికి 4 కిలోమీటర్ల దూరంలో ఉన్న జానిగుడలోని రైతు సలహా కేంద్రం భవనానికి ఈ కార్యాలయాన్ని మార్చారు. దీనిపై ఆధారపడిన 17 పంచాయతీలకు చెందిన రైతులు కార్యాలయాలకు వెళ్లాలంటే ఎన్నో ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తోంది. ఏదైనా అవసరం నిమిత్తం, వ్యవసాయంపై సూచనలు కోసం రైతులు కార్యాలయానికి వెళ్లినప్పుడు అక్కడ అధికారులు, సిబ్బంది లేకపోవడంతో నిరాశతో వెనుదిరిగిన సంఘటనలెన్నో ఉన్నాయి. అధికారుల కొరత, ఉన్న కొద్దిమంది క్షేత్రస్థాయిలో పనిచేయడంలో శ్రద్ధ చూపకపోవడం ఇందుకు కారణంగా చెప్పుకోవచ్చు. మూడేళ్లుగా వ్యవసాయాధికారి పోస్ట్‌ ఖాళీగా ఉంది.  

ఒక్కరే మూడుచోట్ల..

దశమంతపూర్‌ సమితికి చెందిన వ్యవసాయ విభాగం అధికారి మహేష్‌ పాఢి స్థానిక కార్యాలయంతోపాటు మరో రెండు సమితుల్లోని కార్యాలయాల్లోనూ బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఒకే అధికారి మూడుచోట్ల విధులు నిర్వహించడంతో ఇబ్బందులు తలెత్తుతున్నాయి. వీఎల్‌డబ్ల్యూల సంఖ్య తక్కువగా ఉండడంతోపాటు ఒక్కొక్కరు రెండు, మూడు పంచాయతీల్లో విధులు నిర్వహించడం గమనార్హం. వారంలో అయిదు రోజులపాటు కార్యాలయం మూసే ఉంటోందని రైతులు ఆరోపిస్తున్నారు. వ్యవసాయ అధికారుల నుంచి తమకు ప్రోత్సాహం, సూచనలు, సలహాలు అందడంలేదని వాపోతున్నారు. పట్టణానికి దూరంగా కార్యాలయం ఉండడం రాకపోకలకు ఇబ్బందులు ఎదురవుతున్నాయని హలధారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

వ్యవసాయాధికారి మహేష్‌ పాఢి వద్ద ‘న్యూస్‌టుడే’ ప్రస్తావించగా కార్యాలయం నిర్వహణకు సరిపడా అధికారులు, సిబ్బంది లేకపోవడంతో ఇబ్బందులు ఎదురవుతున్నాయని, భర్తీకి ప్రభుత్వం పట్టించుకోవడంలేదన్నారు. కార్యాలయంలో పనిచేసే సీనియర్‌ గుమస్తా సెలవులో ఉండడంతో కొన్నిరోజులు కార్యాలయం తెరవలేదని తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని