logo

అక్కడ సమస్యలనే చదవాలి!!

వేలాది పుస్తకాలు.. పాఠకులకు పూర్తిస్థాయిలో వసతులు.. విశ్రాంత ఉద్యోగులు, వృద్ధులు సేదదీరేందుకు గదులు.. మరుగుదొడ్లు.. నచ్చిన పుస్తకాలు, పత్రికలు..

Published : 29 Mar 2024 04:07 IST

శిథిలావస్థలో కేంద్ర గ్రంథాలయం

 విజయనగరంలో అధ్వానంగా భవనం

విజయనగరం మయూరి కూడలి, న్యూస్‌టుడే: వేలాది పుస్తకాలు.. పాఠకులకు పూర్తిస్థాయిలో వసతులు.. విశ్రాంత ఉద్యోగులు, వృద్ధులు సేదదీరేందుకు గదులు.. మరుగుదొడ్లు.. నచ్చిన పుస్తకాలు, పత్రికలు.. విజయనగరంలోని కేంద్రం గ్రంథాలయంలో ఉన్న సౌకర్యాలివి. అయితే ఇదంతా ఒకప్పటి మాట. ప్రస్తుతం అక్కడ కాసేపు ఉండడమే గగనంగా మారుతోంది. తెల్లారితే అక్కడికి వెళ్లేవారు కనీస మౌలిక వసతులు లేక ఇబ్బంది పడుతున్నారు. అభివృద్ధికి ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంతో ఈ పరిస్థితి ఏర్పడింది.

ముఖద్వారం వద్ద పెచ్చులూడిన పైకప్పు

రానురానూ మూలకు..

ఉమ్మడి జిల్లాకు సంబంధించి 1985లో దీనిని నిర్మించారు. విద్యలనగరంగా పేరు గాంచిన విజయనగరంలో చదివేందుకు వేలాది మంది నగరానికి వచ్చేవారు. ఈక్రమంలో వారికి ఈ కేంద్రం అండగా నిలిచేది. దాతల సహకారంతో వేలాది పుస్తకాలు సమకూరాయి. రోజూ ఉదయం 7 నుంచి సాయంత్రం 7.30 గంటల వరకు ఉంటుంది. నిత్యం 650 మందికి పైగా పాఠకులు వచ్చేవారు. వారి కోసం రెండు రీడింగ్‌ గదులు, మహిళలు, పురుషులకు వేర్వేరుగా ఆరు మరుగుదొడ్లు నిర్మించారు. కొన్నేళ్లుగా నిర్వహణ లేకపోవడంతో అధ్వానంగా మారాయి. ప్రధాన భవనం శిథిలావస్థకు చేరింది. దీంతో పాఠకులు ఇబ్బంది పడుతున్నారు.

గదిలో దెబ్బతిన్న సీలింగ్‌

కాగితాలకే పరిమితం..

సమస్యలు పరిష్కరించాలని ‘ఈనాడు’లో వెలువడిన వరుస కథనాలకు గతేడాది అధికారులు స్పందించి ఉన్నతాధికారులకు ప్రతిపాదనలు పంపించారు. రూ.1.27 కోట్ల నిధులు అవసరమని అందులో పేర్కొన్నారు. అయితే ఇంతవరకు వాటిల్లో కదలిక లేదు. సెస్‌ సొమ్ము ఉంటే వినియోగించుకోవాలని పైనుంచి ఆదేశాలు వచ్చినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం సెస్‌ వసూళ్లు సైతం మందగించాయి. ఒక్క విజయనగరం నగరపాలక సంస్థ నుంచి గత ఆరేళ్లకు సంబంధించి రూ.2.75 కోట్లు రావాలి. మిగిలిన పురపాలికలు, పంచాయతీల నుంచి రూ.కోట్ల మేర వసూలు కావాలి.

తలుపులు లేని మరుగుదొడ్లు


ఎన్నోసార్లు  తెలియజేశాం..
- లక్ష్మి, జిల్లా కార్యదర్శి, గ్రంథాలయాల శాఖ

భవనం పూర్తిగా శిథిలమైంది. ఈ విషయాన్ని ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధులకు ఎన్నోసార్లు తెలియజేశాం. మరోసారి విన్నవిస్తాం. పాఠకులకు పూర్తిస్థాయిలో మరుగుదొడ్లు లేవు. రీడింగ్‌ గదుల్లో సౌకర్యాలు అంతంత మాత్రమే. సెస్‌ బకాయిలు వసూళ్లకు చర్యలు తీసుకుంటాం.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని