logo

సహకారం కరవు

ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘాలు(పీఏసీఎస్‌లు) నిస్తేజమవుతున్నాయి. లావాదేవీలు లేకపోవడంతో కొన్నేళ్లుగా సేవలు నిలిచిపోయాయి.

Published : 29 Mar 2024 04:11 IST

నిరసన తెలుపుతున్న సహకార ఉద్యోగులు(పాతచిత్రం)

  • గంట్యాడ మండలం బోనంగి సొసైటీ సీఈవో ఇటీవల పదవీ విరమణ పొందడంతో అతని స్థానంలో బొబ్బిలిలో పనిచేస్తున్న సీఈవోను నియమించారు. అతనికి నెలకు రూ.28 వేల జీతం చెల్లించాలి. అంత మొత్తంలో ఇవ్వలేమని పాలకవర్గం చెప్పడంతో వెనక్కి వచ్చేశారు.

  • బొండపల్లి మండలం రాచకిండాం సొసైటీలో ముగ్గురు ఉద్యోగులు పనిచేస్తున్నారు. వీరికి ఏడాది నుంచి జీతాలు లేవు. ఇదే పరిస్థితి ఉమ్మడి జిల్లాలోని కొత్తవలస, పార్వతీపురం మండలం కృష్ణపల్లి, సాలూరు మండలం పెదపాదం సొసైటీల్లో నెలకొంది.

విజయనగరం అర్బన్‌, న్యూస్‌టుడే: ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘాలు(పీఏసీఎస్‌లు) నిస్తేజమవుతున్నాయి. లావాదేవీలు లేకపోవడంతో కొన్నేళ్లుగా సేవలు నిలిచిపోయాయి. ఉద్యోగులకు జీతాలు సైతం అందడం లేదు. వ్యాపార కార్యకలాపాలను విస్తరించుకోకపోవడం, రికవరీలు లేకపోవడం, ప్రభుత్వ ప్రోత్సాహం కరవవడం తదితర కారణాలతో ఈ పరిస్థితి ఏర్పడింది. ఉమ్మడి జిల్లాలో 95 సొసైటీల పరిధిలో సుమారు 300 మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. దాదాపు 30 శాతం సొసైటీల్లో ఈ దుస్థితి కనిపిస్తోంది.
మనుగడ ప్రశ్నార్థకం.. రుణాలు మంజూరు చేయడం ద్వారా వచ్చే వడ్డీల నుంచి సిబ్బంది జీతాలు తీసుకోవాలి. ఈమేరకు సొసైటీలకు రుణాలు మంజూరు చేసి, వ్యాపార లావాదేవీలను పెంచుకునేలా జిల్లా కేంద్ర సహకార బ్యాంకు(డీసీసీబీ) సహకారం అందించాలి. అయితే కొన్నేళ్లుగా ఆ ప్రక్రియ నిలిచిపోయింది. నేరుగా బ్యాంకుశాఖల ద్వారా రుణ వితరణ చేపట్టడంతో వాటి మనుగడ ప్రశ్నార్థకంగా మారుతోంది. తక్కువ రికవరీలున్న చోట డీసీసీబీ ఇలా చేస్తోంది. 2022-23 ఆడిట్‌ నివేదిక ప్రకారం 15 పీఏసీఎస్‌లే ఆర్థిక పరిపుష్టి సాధించాయి. మిగిలినవాటిలో కొన్ని ఆపరేటింగ్‌ ప్రాఫిట్స్‌(పాత నష్టాలు ఉంటాయి)లో ఉండగా, ఇంకొన్ని మూసివేత దశగా సాగుతున్నాయి.

హెచ్‌.ఆర్‌.పాలసీ ఎక్కడ..?

ఉద్యోగులకు హెచ్‌ఆర్‌ పాలసీని అమలు చేయాల్సి ఉంది. నాలుగేళ్లుగా జాప్యం జరుగుతోంది. ఈ ప్రక్రియ పూర్తయితే సిబ్బందికి ప్రయోజనాలతో పాటు సొసైటీలు ఆర్థికంగా బలోపేతమయ్యే అవకాశముంది. డీసీసీబీ ఛైర్మన్‌ కన్వీనరుగా ఏర్పాటైన సాధికార కమిటీ పాలసీ అమలుకు చర్యలు తీసుకోవాలి. కమిటీలో మెంబర్‌ కన్వీనర్‌గా డీసీసీబీ సీఈవో, జిల్లా సహకార అధికారితో పాటు నాబార్డు డీడీఎం ఉన్నారు. తొలుత సొసైటీలను విస్తరణ పేరుతో జాప్యం చేస్తూ వచ్చారు. తర్వాత 2020 ఆడిట్‌ నివేదిక ప్రకారం కేటగిరీల వారీగా విభజించి, ఏ మేరకు సిబ్బంది ఉండాలో గుర్తించారు. 41 చోట్ల సీఈవోలు లేరని, ఇన్‌ఛార్జులతోనే నిర్వహిస్తున్నట్లు ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లారు.

అమలైతే ప్రయోజనమిలా..?

  • ఉమ్మడి సర్వీసు నిబంధనలు వర్తింప జేస్తారు. ఆర్థిక లావాదేవీలను బట్టి సిబ్బంది సంఖ్య, వేతనం నిర్ణయించి, అవసరం మేరకు నియామకాలు చేపడతారు. ః ఆర్థిక పరిపుష్టిలేని చోట్ల ఆప్కాబ్‌, డీసీసీబీ ద్వారా మూడేళ్ల పాటు జీతాలు చెల్లించేలా చర్యలు తీసుకుంటారు.
  • ఇప్పటివరకు సొసైటీలే సొంతంగా సిబ్బందిని నియమించుకుంటున్నాయి. నియామకాలకు ఒక నిర్ధిష్టమైన విధానం లేకపోవడంతో చాలా మందికి విద్యార్హతలు లేవు. ఇక మీదట డిగ్రీ, కంప్యూటర్‌ పరిజ్ఞానమున్న వారికే ప్రాధాన్యతిస్తారు. రాత, మౌఖిక పరీక్షల ఆధారంగా ఎంపిక చేస్తారు.
  • సంఘానికి ఒక సీఈవో, కార్యనిర్వాహక సహాయకుడు, సబార్డినేట్‌ ఉంటారు. జీతభత్యాలతో పాటు డీఏ, హెచ్‌ఆర్‌ఏ, ఇంక్రిమెంట్లు అమలు చేస్తారు. అయిదేళ్లు నిండిన సీఈవోలకు డివిజన్‌స్థాయిలో బదిలీలు నిర్వహిస్తారు.
  • పాలసీలో సీఈవోకు మూలవేతనం రూ.6,970 కాగా, గరిష్ఠ వేతనం రూ.21,725గా ఉంది. సహాయకులకు రూ.6,740- రూ.19,110, సబార్డినేట్లకు రూ.6,550 నుంచి రూ.15,070 వరకు చెల్లిస్తారు.

ఇదీ పరిస్థితి..

సొసైటీలు: 95
లాభాల్లో ఉన్నవి: 15
పాత నష్టాలతో కొనసాగుతున్నవి: 75
మూత దశకు చేరినవి: 05


అమలుకు ఇబ్బంది లేదు.. కొన్నిచోట్ల వ్యాపారాలు మందగించాయి. అలాంటి చోట్ల జీతాలకు ఇబ్బంది ఉంటుంది. పంట రుణాల బాధ్యత వారిదే. ఎస్టీయేతర రుణాలు రూ.15 లక్షలు దాటితే బ్యాంకు ద్వారా మంజూరు చేస్తున్నాం. హెచ్‌ఆర్‌ పాలసీ అమలుకు ఉద్యోగులు న్యాయస్థానానికి వెళ్లారు. కేసు ఉపసంహరించుకుంటే అమలు చేసేందుకు అభ్యంతరం లేదు.

కె.జనార్దన్‌, సీఈవో, డీసీసీబీ

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని