logo

హింసోద్ధారకుడు

నీళ్లడిగారో ఇళ్లకొచ్చి కొడతారు.. రోడ్డు ఊసెత్తారో ఊపిరి తీసేస్తారు.. అభివృద్ధి మాటెత్తితే ఆ మాటే లేకుండా చేస్తారు.. ప్రశ్నిస్తే పగ.. నిలదీస్తే నింద.. దారికాసి దాడులు.. దౌర్జన్యాలు..దోపిడీలు.. అడుగడుగునా వేధింపులు.. ఎక్కడికక్కడే హత్యలు.. అత్యాచారాలు.. ఇదీ వైకాపా అయిదేళ్ల పాలన..

Published : 08 May 2024 04:55 IST

నీళ్లడిగారో ఇళ్లకొచ్చి కొడతారు.. రోడ్డు ఊసెత్తారో ఊపిరి తీసేస్తారు.. అభివృద్ధి మాటెత్తితే ఆ మాటే లేకుండా చేస్తారు.. ప్రశ్నిస్తే పగ.. నిలదీస్తే నింద.. దారికాసి దాడులు.. దౌర్జన్యాలు..దోపిడీలు.. అడుగడుగునా వేధింపులు.. ఎక్కడికక్కడే హత్యలు.. అత్యాచారాలు.. ఇదీ వైకాపా అయిదేళ్ల పాలన.. జగన్‌లాంటి హింసోద్ధారకుడుంటే ఇలాంటి అకృత్యాలు తప్ప.. అభివృద్ధి కనిపిస్తుందంటారా.. ఇలాంటి నాయకులకా మనం ఓటేసేది..

ఈనాడు-విజయనగరం, - న్యూస్‌టుడే, విజయనగరం నేరవార్తా విభాగం, గరివిడి, చీపురుపల్లి గ్రామీణం, నెల్లిమర్ల

రక్తపాతమే సృష్టించారు..

ప్రశాంతంగా ఉండే విద్యలనగరంలో వైకాపా అధికారంలోకి వచ్చిన ఏడాదిలోనే ఆ పార్టీ నాయకులు రక్తపాతం సృష్టించారు. రాజకీయ కక్షతో 2020 జులైలో నగరంలోని నాగవంశం వీధిలో అధికార పార్టీ నాయకులు భాజపా నాయకుడు కాళ్ల నారాయణరావుపై కత్తులు, కర్రలతో దాడికి దిగారు. కొవిడ్‌ సమయంలో  సేవా కార్యక్రమాలు చేయడమే ఆయన చేసిన తప్పు. ముందు రోజు అతడి తమ్ముడిపై.. తరువాత రోజు నారాయణరావుపై కత్తులతో తెగబడ్డారు. ఇంట్లో నుంచి బయటకు లాక్కొచ్చీ మరీ ముఖం, ఇతర భాగాలపై నరికారు. రాష్ట్ర వ్యాప్తంగా ఈ ఘటన సంచలనం సృష్టించింది. అయితే కోమాలో ఉన్న బాధితుడిపైనే పోలీసులు కేసు నమోదు చేయడం గమనార్హం. బాధిత కుటుంబ సభ్యుల్లో మరికొందరినీ అదుపులోకి తీసుకున్నారు. నిందితులపై మాత్రం నామమాత్రపు చర్యలు తీసుకున్నారని బాధితులు వాపోయారు.

న్యూస్‌టుడే, విజయనగరం నేరవార్త విభాగం

ప్రతిపక్షాలే లక్ష్యంగా..

  • చీపురుపల్లి మండలం రామలింగాపురంలో తెదేపా సానుభూతిపరుడు పిన్నింటి రమణ తమ సొంత భూమిలో ఇంటి పేరంటాలు మానసాదేవి అమ్మవారి ఆలయాన్ని నిర్మించారు. అనతి కాలంలోనే ఈ ఆలయం ప్రసిద్ధి చెందడంతో స్థానికంగా ఉన్న ఓ అధికార పక్షం నేత కక్షకట్టారు. ఆలయాన్ని మూసి వేయాలని వేధించారు. ఆ కుటుంబంపై మూడు సార్లు దాడులు చేయించారు. 2022 ఆగస్టులో ఆలయ ధర్మకర్త రమణ, ఆయన కుమారుడు పిన్నింటి శ్రీను, సోదరుడు శ్రీరాములుతో పాటు ఆలయ పూజారిని దారుణంగా కొట్టి గాయపరిచారు. ఈ ఘటనపై తెదేపా విజయనగరం పార్లమెంటరీ నియోజకవర్గ అధ్యక్షుడు కిమిడి నాగార్జున జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేశారు.
  • తెదేపాకు చెందిన చీపురుపల్లి మండలం మెట్టపల్లి సర్పంచి బూటు పద్మ భర్త బూటు శ్రీను గ్రామంలో పాఠశాల పరిసరాలను శుభ్రం చేయిస్తుండగా ఆయనపై రాజకీయ కక్షతో వైకాపాకు చెందిన ఓ కార్యకర్త దాడికి దిగాడు. ఈ ఘటన ఏడాది క్రితం జరిగింది.

గత డిసెంబరులో పార్వతీపురంలో కౌన్సిల్‌ సమావేశం జరుగుతుండగా తెదేపా కౌన్సిలర్లు వాకౌట్‌ చేసి బయటకు వచ్చేశారు. బయట మీడియాతో మాట్లాడుతుండగా ఓ వైకాపా కౌన్సిలర్‌ ఎనిమిదో వార్డు సభ్యుడు నారాయణరావుపై దాడికి దిగారు. గత ఫిబ్రవరిలోనూ ఆయన ఇంటికెళ్లి  దౌర్జన్యం చేశారు.

  • చీపురుపల్లి మండలం బెవరపేటలో రెండేళ్ల క్రితం జనసేన జెండా పట్టుకు తిరుగుతున్నారన్న అక్కసుతో పలువురు కార్యకర్తలను వైకాపా వర్గీయులు తీవ్రంగా కొట్టి గాయపరిచారు
  • మహిళలపైనా వేధింపులు..
  • ‘ప్రభుత్వ పథకాలు అందేలా చూస్తా. నా కోరిక తీర్చితే చాలు’ అని నగరానికి చెందిన ఓ మహిళను అధికార పార్టీకి చెందిన ఓ నాయకుడు లోబర్చుకున్నాడు. ఆమెను లైంగికంగా వేధించాడు. ఈక్రమంలో అతడి తండ్రి సైతం ఆమెను వెంటాడాడు. జిల్లా కేంద్రంలో ఏడాదిన్నర కిందట ఈ ఘటన జరిగింది. బీ ‘నేను చెప్పింది చేయకపోతే మీ ఇల్లు పీకేస్తా. ప్రభుత్వ పథకాలన్నీ రద్దు చేస్తాం. నేను చెబితే కార్పొరేటర్‌తో పాటు అందరూ వింటారు’ అని వైకాపాకు చెందిన ఓ సీనియర్‌ నాయకుడు అభం శుభం తెలియని మహిళను వేధించ సాగాడు. ఆమె ధైర్యంగా మీడియా ముందుకు రావడంతో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఏడాదిన్నర కిందట కలెక్టరేట్‌ సమీపంలో ఈ ఘటన జరిగింది.

అధికారులకూ

బెదిరింపులు..: పార్వతీపురంలో మూడేళ్ల క్రితం కొందరు సారా విక్రయదారులు ఎస్‌ఈబీ కార్యాలయానికి వెళ్లి వీరంగం సృష్టించారు. అయినా కేసు నమోదు కాలేదు. వారి వెనుక ఓ అధికార పార్టీ నాయకుడు ఉండడంతో వదిలేశారు.

ఉపాధ్యాయుడినీ చంపేశారు..

గతేడాది జులైలో జరిగిన తెర్లాం మండలం ఉద్దవోలు గ్రామానికి చెందిన ఉపాధ్యాయుడు ఏగిరెడ్డి కృష్ణ(59) కృష్ణ హత్య కలకలం రేపింది. రాజకీయ కక్షతో ఆయన్ను చంపేశారు. రాజాంలో నివాసముండే ఆయన విధుల్లో భాగంగా ఇంటి నుంచి బయలు దేరి కాలంరాజుపేట ప్రాథమికోన్నత పాఠశాలకు వెళ్తుండగా కొత్తపేట దగ్గర వెనుక నుంచి బొలెరో వాహనంతో ఢీకొట్టి చంపేశారు. ఈయన కుటుంబం మొదటి నుంచీ తెదేపాకు మద్దతు తెలిపేది. ఆయన వైకాపాలో చేరాక కక్షగట్టారు. అనంతరం అభివృద్ధి పనుల విషయంలో గొడవ మొదలైంది. ఈక్రమంలో ఈ హత్య జరిగినట్లు అప్పట్లో పోలీసులు నిర్ధారించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉపాధ్యాయ సంఘాలు ఈ ఘటనపై పెద్దఎత్తున ఆందోళన చేపట్టాయి.

న్యూస్‌టుడే, తెర్లాం

దేవుడిపై దగా..

2020 డిసెంబరులో రామతీర్థం ప్రధానాలయానికి సమీపంలోని నీలాచలం కొండ(బోడికొండ)పై ఉన్న కోదండరామస్వామి ఆలయంలోని సీతారామలక్ష్మణుల విగ్రహాల్లో శ్రీరాముడి విగ్రహాన్ని గుర్తుతెలియని దుండగులు ధ్వంసం చేశారు. శిరస్సు భాగాన్ని సమీప సీతమ్మ కొలనులో పడేశారు. దీనికి ఆలయ అనువంశిక ధర్మకర్త అశోక్‌గజపతిరాజు నిర్లక్ష్యమే
కారణమని ప్రభుత్వం ఆరోపించింది. పైగా ఇది తెదేపా పనేనని విమర్శించింది.

చంద్రబాబుపై కేసు..

2021 జనవరిలో తెదేపా అధినేత చంద్రబాబునాయుడు రామతీర్థం వచ్చారు. ఆయన రాకకు ముందే రాజ్యసభ ఎంపీ విజయసాయిరెడ్డి, వైకాపా నాయకులు చేరుకున్నారు. వారు కొండ దిగుతుండగా వైకాపా నాయకులు, తెదేపా శ్రేణులకు మధ్య తోపులాట జరిగింది. ఈక్రమంలో తనపై కర్రలు, రాళ్లతో దాడిచేశారని విజయసాయిరెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో చంద్రబాబునాయుడు, తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు, మాజీ మంత్రి కిమిడి కళావెంకటరావు, సీనియర్‌ నాయకుడు సువ్వాడ రవిశేఖర్‌, నెల్లిమర్లకు చెందిన పలువురిపై కేసు నమోదు చేశారు. కళావెంకటరావును అరెస్టు చేసి స్టేషన్‌ బెయిల్‌పై విడుదల చేశారు. రవిశేఖర్‌ను నెల రోజుల పాటు బెయిల్‌ రాకుండా పోలీసుల ద్వారా అడ్డుకున్నారు.

అశోక్‌పై కక్షసాధింపు..

పూసపాటి రాజవంశీయుడు, వందలాది ఆలయాల అనువంశిక ధర్మకర్త.. తెదేపా పొలిట్‌ బ్యూరో సభ్యుడు, కేంద్ర మాజీ మంత్రి అశోక్‌గజపతిరాజుపైనా ప్రభుత్వం కక్ష కట్టింది. అడుగడుగునా ఇబ్బందులకు గురిచేసింది. 2021 డిసెంబరులో బోడికొండపై రామాలయ నిర్మాణానికి శంకుస్థాపన చేయాలని ప్రభుత్వం నిర్ణయించడంతో దేవాదాయశాఖ ఆ ఏర్పాట్లు చేసింది. తనకు సమాచారం ఇవ్వలేదని అశోక్‌ ఆవేదన వ్యక్తం చేశారు. ఈక్రమంలో అక్కడున్న స్టీలు రేకు శిలాఫలకాన్ని విసిరేశారని, తమ విధులకు ఆటంకం కలిగించారని అప్పటి ఆలయ కార్యనిర్వహణాధికారి పోలీసులకు ఫిర్యాదు చేయగా.. గజపతిరాజుపై వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని