logo

మంత్రి, మాజీలవి కాలక్షేపపు మాటలు

వెలిగొండ ప్రాజెక్టు పూర్తికి తక్షణం రూ.1,500 కోట్లు విడుదల చేయాలని భాజపా జిల్లా మాజీ అధ్యక్షుడు శిరసనగండ్ల శ్రీనివాసులు డిమాండ్‌ చేశారు.

Published : 01 Feb 2023 01:50 IST

మాట్లాడుతున్న భాజపా జిల్లా మాజీ అధ్యక్షుడు శిరసనగండ్ల శ్రీనివాసులు..

చిత్రంలో జిల్లా అధ్యక్షుడు శివారెడ్డి, నాయకులు

ఒంగోలు ట్రంకురోడ్డు, న్యూస్‌టుడే: వెలిగొండ ప్రాజెక్టు పూర్తికి తక్షణం రూ.1,500 కోట్లు విడుదల చేయాలని భాజపా జిల్లా మాజీ అధ్యక్షుడు శిరసనగండ్ల శ్రీనివాసులు డిమాండ్‌ చేశారు. ఒంగోలులో మంగళవారం ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో పార్టీ జిల్లా అధ్యక్షుడు పి.వి.శివారెడ్డితో కలిసి ఆయన మాట్లాడారు. నాలుగు లక్షల ఎకరాలకు సాగు నీరు, పది లక్షల మందికి తాగునీరందించే కీలకమైన ప్రాజెక్టు విషయంలో ప్రభుత్వం, జిల్లాకు చెందిన ప్రజాప్రతినిధులు నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తుండటం శోఛనీయం అన్నారు. అధికారంలోకి వచ్చిన ఏడాదిలోపే ప్రాజెక్టు పూర్తిచేస్తామని చెప్పిన ముఖ్యమంత్రి జగన్‌ మోహన్‌ రెడ్డి ఆచరణలో మాట తప్పారని, మడమ తిప్పారని విమర్శించారు. నిర్వాసితుల సమస్యలను కూడా పట్టించుకోవడం లేదన్నారు. జిల్లాకు చెందిన మంత్రి ఆదిమూలపు సురేష్‌, మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి ప్రజల సమస్యలు పట్టించుకోవడం లేదని.. పేకాట, మత మార్పిళ్ల గురించి మాట్లాడుతూ కాలక్షేపం చేస్తున్నారని ఎద్దేవా చేశారు. వెలిగొండకు తక్షణం నిదులు కేటాయించి ఈ వేసవిలోపు పనులు ముమ్మరం చేయకుంటే ప్రజా పోరాటాలు చేస్తామని హెచ్చరించారు. సమావేశంలో భాజపా జిల్లా అధ్యక్షుడు పి.వి.శివారెడ్డి, కిసాన్‌ మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షుడు పి.వి.కృష్ణారెడ్డి, పార్టీ నాయకులు సెగ్గం శ్రీనివాస్‌, జువ్విగుంట కోటేశ్వరి తదితరులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని