logo

నామినేషన్ల వేళ మారిన పేర్లు

నామినేషన్ల దాఖలు సమయంలో కాంగ్రెస్‌ పార్టీలో అనూహ్యంగా అభ్యర్థుల మార్పు చోటుచేసుకుంది. గతంలో ప్రకటించిన వారికి కాకుండా కొన్నిచోట్ల ఇతరులకు సీట్లు కేటాయించారు.

Published : 24 Apr 2024 04:15 IST

సీట్లు ప్రకటించిన కాంగ్రెస్‌, ఇద్దరు మహిళలకు చోటు

ఒంగోలు నగరం, న్యూస్‌టుడే: నామినేషన్ల దాఖలు సమయంలో కాంగ్రెస్‌ పార్టీలో అనూహ్యంగా అభ్యర్థుల మార్పు చోటుచేసుకుంది. గతంలో ప్రకటించిన వారికి కాకుండా కొన్నిచోట్ల ఇతరులకు సీట్లు కేటాయించారు. ఒంగోలు, కొండపి, కనిగిరి అసెంబ్లీ స్థానాలకు కొత్త అభ్యర్థులను తెర పైకి తెచ్చారు. జిల్లా పర్యటన సమయంలో సదరు అభ్యర్థులకు పీసీసీ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల ఈ మేరకు బీ ఫారాలు అందజేశారు. వీరిలో ఇద్దరు మహిళలు ఉన్నారు.

మారిన పరిస్థితులు...: గత ఎన్నికల సమయంలో కాంగ్రెస్‌ తరఫున బరిలో నిలిచేందుకు ఎవరూ అంతగా ఆసక్తి చూపలేదు. దీంతో పోటీ చేసే అభ్యర్థులను నాయకులు వెతుక్కోవాల్సి వచ్చింది. ప్రస్తుతం పరిస్థితి మారింది. షర్మిల పీసీసీ అధ్యక్షురాలు కావడం.. పొరుగు రాష్ట్రాలైన తెలంగాణ, కర్ణాటకలో కాంగ్రెస్‌ ప్రభుత్వాలు ఏర్పడటంతో ఆ పార్టీలో జోష్‌ పెరిగింది. ఎన్నికల్లో వామపక్షాలు కూడా జత కావడంతో టికెట్ల కోసం పలువురు పోటీ పడ్డారు. ఒక్కో నియోజకవర్గానికి నాలుగు నుంచి పది మంది వరకు దరఖాస్తులు అందజేశారు. మొదటి జాబితాలో ప్రకటించిన పేర్లలో తాజాగా ముగ్గురిని మార్చారు. ఒంగోలుకు బీఆర్‌ గౌస్‌ పేరు తొలుత ప్రకటించడంతో ఆయన ప్రచారం ప్రారంభించారు. మూడో జాబితాలో కొత్తపట్నం మండలానికి చెందిన కాంగ్రెస్‌ పార్టీ నగర అధ్యక్షురాలు దాసరి నాగలక్ష్మి పేరు ప్రకటించారు. కొండపి సీటును తొలుత పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి శ్రీపతి సతీష్‌కు ఇచ్చారు. ఇప్పుడు పసుమర్తి సుధాకర్‌కు కేటాయించారు. కనిగిరి సీటును తొలుత కదిరి భవానికి కేటాయించారు. ఇప్పుడు ఆమె స్థానంలో కిసాన్‌ కాంగ్రెస్‌ ఛైర్మన్‌ దేవరపల్లి సుబ్బారెడ్డిని ప్రకటించారు. ఒంగోలు పార్లమెంట్‌ అభ్యర్థిగా ఈదా సుధాకరరెడ్డిని నియమించడంతో మంగళవారం ఆయన నామినేషన్‌ దాఖలు చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని