logo

అప్పుల బాధ తాళలేక యువ రైతు ఆత్మహత్య

అప్పుల బాధ తాళలేక యువ రైతు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. ఈ సంఘటన దర్శి నగర పంచాయతీ పరిధిలోని శివరాజ్‌నగర్‌లో గురువారం చోటు చేసుకుంది. ఎస్సై సుమన్‌ తెలిపిన వివరాల ప్రకారం..

Updated : 03 May 2024 04:56 IST

ఏడుకొండలు (పాతచిత్రం)

దర్శి, న్యూస్‌టుడే: అప్పుల బాధ తాళలేక యువ రైతు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. ఈ సంఘటన దర్శి నగర పంచాయతీ పరిధిలోని శివరాజ్‌నగర్‌లో గురువారం చోటు చేసుకుంది. ఎస్సై సుమన్‌ తెలిపిన వివరాల ప్రకారం.. గంటెన ఏడుకొండలు (29) వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడేందుకు కారు చోదకుడిగా కూడా పనిచేస్తున్నారు. తనకు ఉన్న 50 సెంట్ల పొలంతో పాటు మరో పది ఎకరాలు కౌలుకి తీసుకుని మెట్ట పంటలు సాగు చేసుకుంటున్నారు. గత కొన్నేళ్లుగా పంటలు పండక నష్టాల పాలయ్యారు. సాగు నిమిత్తం చేసిన అప్పులు తీర్చే దారి కన్పించకపోవడంతో మానసికంగా ఇబ్బందులు పడుతున్నారు. ఈ క్రమంలో గురువారం భార్య, పిల్లలు బంధువుల ఇంటికి వెళ్లిన సమయంలో ఇంట్లో ఫ్యాన్‌కు చీరతో ఉరి వేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డారు. కొంత సేపటి తర్వాత ఇంటికి వచ్చిన భార్య గుర్తించి స్థానికులకు చెప్పడంతో వారు, ఆటోలో దర్శి ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. పరీక్షించిన వైద్యులు అప్పటికే అతను మృతి చెందినట్లు తెలిపారు. పోలీసులు వైద్యశాలకు వెళ్లి వివరాలు తెలుసుకున్నారు. మృతుని భార్య ఫిర్యాదుతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.


అనుమానాస్పద స్థితిలో..

సింగరాయకొండ గ్రామీణం : అనుమానాస్పద స్థితిలో ఓ లారీ చోదకుడు మృతిచెందారు. అయిదు రోజుల క్రితం ఆయన చనిపోగా, సంఘటన ఆలస్యంగా గురువారం వెలుగు చూసింది. స్థానిక ఎస్సై శ్రీరామ్‌ తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామంలోని బైరాగిమాన్యానికి చెందిన కుంచాల శ్రీకాంత్‌(35) లారీ చోదకుడిగా పనిచేస్తూ మూడేళ్ల క్రితం జరిగిన రోడ్డు ప్రమాదంలో రెండు కాళ్లూ విరిగిపోయి వైకల్యానికి గురయ్యారు. అనంతరం మద్యానికి బానిసై రెండు నెలల క్రితం భార్యాపిల్లలను వదిలి రాములమ్మ కాలనీలో అద్దె ఇంట్లో ఒంటరిగా నివసిస్తున్నారు. ఇటీవల  ఫైనాన్స్‌ సంస్థలో ఆటో కొనుగోలు చేసి చోదకుడిగా పనిచేస్తున్నారు. ఆటో కిస్తీలు ఫైనాన్స్‌ సంస్థకు సక్రమంగా చెల్లించకపోవడంతో 10 రోజుల క్రితం సంస్థ సిబ్బంది వాహనాన్ని జప్తు చేశారు. అప్పటి నుంచి మనోవేదనకు గురై ఎలాంటి ఆహారం తీసుకోకుండా, మద్యం సేవిస్తూ ఉండటంతో ఆరోగ్యం విషమించి మృతిచెంది ఉంటారని భావిస్తున్నారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు మృతదేహాన్ని పరిశీలించి అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని