logo

మాదిగలకు ఆది నుంచీ అండగా చంద్రన్న

రాష్ట్రంలో జగన్‌ అనే పాలకుడు పోవాలి, మరోసారి చంద్రబాబు రావాలని ఎమ్మార్పీఎస్‌ వ్యవస్థాపకుడు మందా కృష్ణమాదిగ ఆకాంక్షించారు.

Published : 03 May 2024 03:33 IST

ఎంపీ ఇస్తానంటూ వైఎస్‌ ప్రలోభాలు
ఎమ్మార్పీఎస్‌ నేత కృష్ణమాదిగ వ్యాఖ్యలు

యర్రగొండపాలెంలో ప్రసంగిస్తున్న  కృష్ణమాదిగ. చిత్రంలో తెదేపా అభ్యర్థి ఎరిక్షన్‌బాబు, మన్నె రవీంద్ర

యర్రగొండపాలెం పట్టణం, న్యూస్‌టుడే: రాష్ట్రంలో జగన్‌ అనే పాలకుడు పోవాలి, మరోసారి చంద్రబాబు రావాలని ఎమ్మార్పీఎస్‌ వ్యవస్థాపకుడు మందా కృష్ణమాదిగ ఆకాంక్షించారు. గురువారం యర్రగొండపాలెంలో తెదేపా, జనసేన, భాజపా కూటమి ఆధ్వర్యంలో నిర్వహించిన మాదిగ ప్రజా ఆశీర్వాద సభలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా నిర్వహించిన ర్యాలీలో ఆయన తెదేపా అభ్యర్థి ఎరిక్షన్‌బాబు మద్దతు పలికారు. అనంతరం మాట్లాడుతూ ముప్ఫై ఏళ్ల ఎస్సీ వర్గీకరణ ఉద్యమంలో అన్ని పార్టీలూ తనకు మంచి పదవులిస్తామని మభ్యపెట్టినా తాను లొంగిపోలేదన్నారు. 2007లో చంద్రబాబు ఎస్సీ వర్గీకరణ చేసి మాట నిలుపుకుని తమకు ఎనలేని గౌరవమిచ్చారన్నారు. అనంతరం వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక వర్గీకరణను అడ్డుకున్నారన్నారు. దీనిపై మద్దతు ఇవ్వాలని కోరగా, తనను, మాల మహానాడుకు చెందిన జూపూడి ప్రభాకరరావును పిలిపించి రాజ్యసభ పదవి ఇస్తానని ఆశ చూపారన్నారు. తాను తిరస్కరించగా, జూపూడి పదవి తీసుకున్నారన్నారు.

జగన్‌కు సాయం చేస్తే మాట మార్చారు

ఇబ్బందుల్లో ఉన్న ముఖ్యమంత్రి జగన్‌కు సహాయపడితే..అధికారంలోకి వచ్చాక వర్గీకరణ విషయంలో ఆయన మాట మార్చారన్నారు. వర్గీకరణకు చంద్రబాబు, ప్రధాని మోదీ ఆశీస్సులున్నందున వారికి అండగా ఎన్డీఏ కూటమి అభ్యర్థులను గెలిపించాలని పిలుపునిచ్చారు. తెదేపా సీనియర్‌ నాయకుడు డాక్టర్‌ మన్నె రవీంద్ర, ఎమ్మార్పీఎస్‌ నేత నాగరాజు, కాశీరావు తదితరులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని