logo

వైకాపా పందికొక్కులు.. బొక్కింది రూ.666 కోట్లు

జగన్‌ పాలనలో వైకాపా ద్వితీయ శ్రేణి నాయకులు పందికొక్కుల అవతారమెత్తారు. పేదల నోరు కట్టి.. పొట్ట కొట్టి చౌక బియ్యాన్ని అందినంత బొక్కారు. నేతలు, ప్రజాప్రతినిధులకు కమీషన్లు ముట్టజెబుతూ వారి అండతో లెక్కపెట్టలేనంతగా మింగేశారు.

Updated : 03 May 2024 06:52 IST

గడప వద్దకే అంటూ జగన్‌ గొప్పలు
వీధిలోకి కూడా రాని ఎండీయూ వాహనాలు
దారి మళ్లిన పేదల బియ్యం 1.80 లక్షల టన్నులు
ఈనాడు, ఒంగోలు

జగన్‌ పాలనలో వైకాపా ద్వితీయ శ్రేణి నాయకులు పందికొక్కుల అవతారమెత్తారు. పేదల నోరు కట్టి.. పొట్ట కొట్టి చౌక బియ్యాన్ని అందినంత బొక్కారు. నేతలు, ప్రజాప్రతినిధులకు కమీషన్లు ముట్టజెబుతూ వారి అండతో లెక్కపెట్టలేనంతగా మింగేశారు. అయిదేళ్ల పాటు అడ్డూఅదుపు లేకుండా సాగిన ఈ మేత విలువ 1.80 లక్షల టన్నులని.. కిలోల్లో చూస్తే ఆ మొత్తం 18 కోట్లని.. నగదు రూపంలో సదరు విలువ రూ.666 కోట్లని అంచనా. ఇంటింటికీ రేషన్‌ అని బీరాలు పలికిన జగన్‌.. రేషన్‌ డీలర్ల వ్యవస్థను కుప్పకూల్చారు. గడప వద్దకే పంపిణీ అంటూ ఎండీయూ వాహనాలను తీసుకొచ్చారు. ఆ తర్వాత అవి వీధి వరకు కూడా రాకుండా పోయాయి. విప్లవమంటూ ఊదరగొడుతూ లొసుగులను జనం ముందుకు తెచ్చి తమ పార్టీ నాయకా గణం పొట్ట నింపుకొనేలా చేశారు.  


జిల్లాలోని దాదాపు అన్ని నియోజకవర్గాల నుంచి రేషన్‌ బియ్యం పక్కదారి పట్టింది. ముఖ్యంగా దర్శి, కనిగిరి, మార్కాపురం, సంతనూతలపాడు, ఒంగోలు, యర్రగొండపాలెం, గిద్దలూరు నుంచి ఈ వ్యవహారం పెద్ద ఎత్తున సాగింది. రేషన్‌ డీలర్లు ఉన్నంతవరకు పక్కాగా బియ్యంతోపాటు కందిపప్పు, చక్కెర, నూనె లాంటి ఇతర సామగ్రి కూడా కార్డుదారులకు అందించేవారు. పేదలంతా ఊరికి దూరంగా ఉన్నప్పటికీ తమ చేతిలో డబ్బులున్న సమయంలో దుకాణాలకు వెళ్లి సరకులు తెచ్చుకునేవారు. ఎండీయూ వాహనాలతో ఈ విధానానికి వైకాపా ప్రభుత్వం తూట్లు పొడించింది. వీరు వీధిలో ఎక్కడో ఒకటీ రెండు రోజులు వాహనాన్ని నిలిపి ఉంచుతారు. ఆ సమయంలో వచ్చిన కొందరికి మాత్రమే బియ్యం అందిస్తారు. ఆ తర్వాత అయిపోయాయంటూ డబ్బులు చేతిలో పెడతారు. పేదలకు అందించకుండా మిగిలిన బియ్యాన్ని దళారులకు తెగనమ్ముకుని జేబులు నింపుకొంటారు. దళారులేమో వ్యాపారులకు అప్పగిస్తారు. మిల్లుల్లో పాలిషింగ్‌ చేసి ఆ బియ్యాన్ని 25 కిలోల బస్తాల్లో నింపి జిల్లా సరిహద్దులు దాటిస్తారు. కృష్ణపట్నం, కాకినాడ పోర్టుల ద్వారా అక్కడి నుంచి విదేశాలకు తరలించి జేబులు నింపుకొన్నారు.

మార్కాపురం మండలం కోమటికుంట వద్ద అధికారులు స్వాధీనం చేసుకున్న 2,850 కిలోల చౌక బియ్యం బస్తాలు(పాత చిత్రం)


  • యర్రగొండపాలెం నియోజకవర్గంలోని ఓ రైస్‌ మిల్లులో 300 టన్నుల రేషన్‌ బియ్యాన్ని అధికారులు ఇటీవల పట్టుకున్నారు.

  • మార్కాపురం, బేస్తవారపేట, కంభం తదితర ప్రాంతాల్లోని మిల్లుల్లోనూ ఇటీవల పదుల సంఖ్యలో రేషన్‌ బియ్యం బస్తాలు దొరికాయి.

  • మద్దిపాడు మండలంలోని ఓ మిల్లులో అక్రమంగా రేషన్‌ బియ్యం ఉన్నట్లు గుర్తించిన అధికారులు వాటిని స్వాధీనం చేసుకోవడానికి ప్రయత్నించారు. దీంతో సదరు వ్యాపారికి అండగా అధికార పార్టీలోని ఓ ముఖ్య నాయకుడు రంగంలోకి దిగడంతో వదిలేశారు.

  • దర్శి మండలం రాజంపల్లిలోని టెంట్‌హౌస్‌లో విజిలెన్స్‌ అధికారులు దాడులు చేసి 200 బస్తాల రేషన్‌ బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నారు.

  • ఉప్పుగుండూరులోని రైసు మిల్లులో ఏకంగా అయిదు వేల బస్తాల బియ్యాన్ని అధికారులు పట్టుకున్నారు. అందులో నాలుగు వేల బస్తాలు రేషన్‌ బియ్యంగా తేల్చారు. ఇరవై అయిదు కిలోల బస్తాల్లో నింపి ఇతర ప్రాంతాలకు తరలిస్తున్నట్లు గుర్తించారు. మిల్లును సీజ్‌ చేసినా.. అధికార పార్టీ నేతల అండతో నెల రోజుల్లోనే తిరిగి కార్యకలాపాలు ప్రారంభం కావడం గమనార్హం.

  • సింగరాయకొండ నుంచి కాకినాడ పోర్టుకు తరలిస్తున్న 450 బస్తాల బియ్యాన్ని అధికారులు కృష్ణాజిల్లా సమీపంలోని గన్నవరంలో పట్టుకున్నారు.

  • జిల్లాలోని ఒక మిల్లు నుంచి రేషన్‌ బియ్యాన్ని పాలిషింగ్‌ చేసి తిరుమల అన్నదాన సత్రానికి పంపినట్లు ఆరోపణలున్నాయి. అన్నం సరిగా లేదంటూ ఇటీవల భక్తుల నుంచి విమర్శలొచ్చాయి. అందుకు ఇదో కారణమని అక్కడి అధికారులు గుర్తించినట్లు సమాచారం. రేషన్‌ బియ్యం విషయం బయటకు పొక్కకుండా జిల్లాకు చెందిన వైకాపా సీనియర్‌ నాయకుడు, సదరు మిల్లు యజమాని తొక్కి పెట్టించినట్లు తెలిసింది.

మొత్తం తెల్లరేషన్‌ కార్డులు: 6.22 లక్షలు
ప్రతి నెలా పంపిణీ చేసే బియ్యం: 10 వేల టన్నులకు పైగా
అందులో పక్కదారి పట్టింది: 3 వేల టన్నులు
ఆ చొప్పున సంవత్సరానికి: 36 వేల టన్నులు
అయిదేళ్లలో ఆ మొత్తం: 1.80 లక్షల టన్నులు
తీసుకోని వారికి, లేవని చెబుతూ.. కార్డుదారులకు చెల్లించింది: రూ. 10(కిలోకు)
పాలిషింగ్‌ చేసి విక్రయించేది: రూ. 25 - రూ. 30(కిలో)
అయిదేళ్లలో పక్కదారి పట్టింది: 1.80 లక్షల టన్నులు (కిలోల ప్రకారం చూస్తే ఆ మొత్తం 18 కోట్లు)
దారి మళ్లిన బియ్యం విలువ: రూ.666 కోట్లు

(పేదలకు అందించే బియ్యంపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కిలోకు రూ. 37 భరిస్తుంటాయి. రాయితీపై కార్డుదారులకు కిలో రూ.1కే అందిస్తుంటుంది.)

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు