logo

కూటమి.. కలిసి సమరానికి కదిలి

ఎక్కడ చూసినా జనం.. ఎటువైపు చూసినా పసుపు, తెలుపు, కాషాయమయం.. ఒంగోలు, కనిగిరి, గిద్దలూరు ఎన్డీఏ కూటమి అభ్యర్థుల నామినేషన్లను పురస్కరించుకుని ఆయా నియోజకవర్గ కేంద్రాల్లో బుధవారం కనిపించిన దృశ్యాలివి.

Published : 25 Apr 2024 02:45 IST

జిల్లా వ్యాప్తంగా నామపత్రాల దాఖలు సందడి

ఒంగోలులో

ఒంగోలు గ్రామీణం, న్యూస్‌టుడే: ఎక్కడ చూసినా జనం.. ఎటువైపు చూసినా పసుపు, తెలుపు, కాషాయమయం.. ఒంగోలు, కనిగిరి, గిద్దలూరు ఎన్డీఏ కూటమి అభ్యర్థుల నామినేషన్లను పురస్కరించుకుని ఆయా నియోజకవర్గ కేంద్రాల్లో బుధవారం కనిపించిన దృశ్యాలివి. అధిక సంఖ్యలో తరలివచ్చిన కార్యకర్తలు.. మేళతాళాలు, డప్పు వాయిద్యాల మధ్య కూటమి అభ్యర్థులు ప్రదర్శనగా వెళ్లి తమ నామపత్రాలను అధికారులకు అందజేశారు. సంప్రదాయ నృత్యాలు, తీన్‌మార్‌ డప్పులు, సైకిల్‌ గుర్తుతో బుట్టబొమ్మలు, సూపర్‌-6 పథకాలతో ప్రచార రథాలు ర్యాలీలో ఆకట్టుకున్నాయి. యువతీ, యువకులు, మహిళలు, వృద్ధులు సైతం స్వచ్ఛందంగా తరలివచ్చి జేజేలు పలికారు.

ఒంగోలు అసెంబ్లీ తెదేపా అభ్యర్థిగా దామచర్ల జనార్దన్‌ నామినేషన్‌ దాఖలు చేశారు. మినీ స్టేడియం నుంచి నెల్లూరు బస్టాండ్‌ వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. ఆర్డీవో కార్యాలయానికి చేరుకుని ఆర్వో జీవీ.సుబ్బారెడ్డికి నామపత్రం అందజేశారు. ఆయనతోపాటు, జనసేన జిల్లా అధ్యక్షుడు షేక్‌ రియాజ్‌ ఉన్నారు. ర్యాలీలో ఎంపీ అభ్యర్థి మాగుంట శ్రీనివాసులురెడ్డి, భాజపా జిల్లా కార్యదర్శి పీవీ.శివారెడ్డి తదితరులున్నారు.

కనిగిరి అసెంబ్లీ తెదేపా అభ్యర్థిగా ముక్కు ఉగ్రనరసింహారెడ్డి నామినేషన్‌ దాఖలు చేశారు. తొలుత అమరావతి మైదానం నుంచి పామూరు రోడ్డు, ఎమ్మెస్సార్‌, వైఎస్సార్‌ రోడ్డు వరకు భారీ ప్రదర్శన కొనసాగింది. అక్కడ నుంచి నడిచి ఆర్డీవో కార్యాలయానికి తన కుటుంబ సభ్యులతో వెళ్లి ఆర్వో జాన్‌ ఇర్విన్‌కు నామపత్రాలు అందజేశారు.

గిద్దలూరు అసెంబ్లీ తెదేపా అభ్యర్థిగా ముత్తుముల అశోక్‌రెడ్డి పార్టీ నాయకులు మాగుంట రాఘవరెడ్డితో కలిసి నామినేషన్‌ వేశారు. తొలుత ఆర్టీసీ బస్టాండ్‌ నుంచి అయ్యప్పస్వామి గుడి వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం మండల తహసీల్దార్‌ కార్యాలయంలో తమ నామపత్రాలు అందజేశారు.

విజయ సంకేతం చూపుతూ ఒంగోలులో తెలుగు మహిళల సందడి

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని