logo

జల‘కల’ భగ్నం

వ్యవసాయ ఉత్పాదకత పెంపులో భాగంగా రైతులకు ఉచితంగా వ్యవసాయ బోర్లు వేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం వైఎస్సార్‌ జలకళ పథకాన్ని అమల్లోకి తీసుకొచ్చింది. అందులో భాగంగా చిన్న, సన్నకారు రైతులకు చెందిన పంట పొలాల్లో ఉచితంగా అమర్చాలన్నదే పథకం ఉద్దేశం.

Updated : 02 May 2024 02:15 IST

జగన్‌ నిబంధనల బాదుడు
పథకం దరిచేరక బీళ్లుగా క్షేత్రాలు
ఒంగోలు గ్రామీణం, పామూరు, న్యూస్‌టుడే

వ్యవసాయ ఉత్పాదకత పెంపులో భాగంగా రైతులకు ఉచితంగా వ్యవసాయ బోర్లు వేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం వైఎస్సార్‌ జలకళ పథకాన్ని అమల్లోకి తీసుకొచ్చింది. అందులో భాగంగా చిన్న, సన్నకారు రైతులకు చెందిన పంట పొలాల్లో ఉచితంగా అమర్చాలన్నదే పథకం ఉద్దేశం. దీని కింద తవ్విన బోర్లకు విద్యుత్తు కనెక్షన్లు ఇచ్చే విషయంలో రాష్ట్ర ప్రభుత్వం చేతులెత్తేయడంతో రైతుకు భారంగా మారింది. పథకం ప్రారంభ సమయంలో బోరు డ్రిల్లింగ్‌తోపాటు, విద్యుత్తు కనెక్షన్‌, పంపుసెట్టు ఉచితంగా ఇవ్వనున్నట్లు ప్రకటించగా..అందులో ఎక్కువ బడ్జెట్‌ విద్యుత్తుదే. కొత్త మార్గదర్శకాల ప్రకారం విద్యుత్తు సరఫరా, పంపుసెట్టు వ్యయం పూర్తిగా రైతు భరించాలని మెలిక పెట్టారు. ఇది కష్ట సాధ్యం కావడంతో పథకం నీరుగారిపోయింది. దీంతో తీసిన బోర్లు సైతం గుంతలకే పరిమితమయ్యాయి. విద్యుత్తు తీగలు అందుబాటులో ఉన్నా మిగతా రైతులు కొత్త బోర్లు ఎప్పుడు వేస్తారా అని మూడేళ్లగా ఎదురుచూశారు.

చీమకుర్తిలో వ్యవసాయ బోరుకు డ్రిల్లింగ్‌ చేస్తున్న యంత్రం

ఆద్యంతం జగన్నాటకం

చిన్న, సన్నకారు రైతులకు ఆసరాగా రాష్ట్రవ్యాప్తంగా 2020 సెప్టెంబర్‌ 28న జలకళ పథకాన్ని ప్రారంభించారు. ఈ పథకం ఆద్యంతం జగన్నాటకాన్ని తలపించింది. ఏడాదికి కొన్నిబోర్లు మాత్రమే తవ్విస్తామన్నారు. ఈ క్రమంలో స్థానిక ప్రజాప్రతినిధుల నుంచి ఒత్తిడి రావడంతో మళ్లీ మాట మార్చి ఈ సంఖ్యను పెంచుతూ బోర్లు మంజూరు చేస్తూ అనుమతి ఇచ్చారు. బోరు తవ్వించుకున్న రైతు పొలానికి ఉచితంగా విద్యుత్తు కనెక్షన్‌ ఇప్పించడంతోపాటు మోటారు పంపిణీ చేస్తామని ప్రకటించారు. కొద్దికాలానికి కరెంటు సర్వీసుకు అయ్యే మొత్తం రూ.2 లక్షల వరకే ఇస్తాం.. మిగిలింది రైతులే చెల్లించి కనెక్షన్‌ పొందాలి అంటూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. మళ్లీ కొన్ని నెలలకు కనెక్షన్‌ ఇప్పించలేం.. మొత్తం రైతులే చెల్లించాలని వైకాపా సర్కారు పేర్కొంది. ఈ నేపథ్యంలో జిల్లాలో దరఖాస్తులు భారీగా వచ్చినా బోర్ల తవ్వకాలు నామమాత్రంగానే జరిగాయి. నిధులు విడుదల చేయకపోవడం, ఇతర కారణాలతో తవ్వకాలను నిలిపివేశారు. ఇప్పటికి బోర్లు వేసిన వారికి బకాయిలు రావాల్సి ఉంది. విడుదల చేస్తే తప్ప తాము బోర్లు తవ్వలేం.. ఇప్పటికే అప్పుల పాలయ్యామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బోరు, విద్యుత్తు కనెక్షన్‌, మోటారు కోసం కార్యాలయాల చుట్టూ తిరిగిన అన్నదాతలు... ఎన్నిసార్లు మాట మార్చి.. మడమ తిప్పుతారంటూ జగన్‌పై ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు.

ఎండిపోయిన బత్తాయి చెట్లను నరికేసిన దృశ్యం

ఒక్క విద్యుత్తు కనెక్షన్‌ ఇవ్వలేదు..

కనిగిరి నియోజకవర్గంలో 3,788 మంది రైతులు దరఖాస్తులు చేసుకోగా అందులో కేవలం 455 మందికే మంజూరు చేశారు. అందులోనూ కేవలం 173 మంది రైతులకు మాత్రమే బోర్లు వేశారు. జలకళ పథకం కింద బోరు తవ్వించుకున్న రైతులలో ఒక్కరికి ప్రభుత్వం విద్యుత్తు సర్వీసు ఇవ్వకపోవడం విశేషం.

పీసీపల్లి మండలం తలకొండపాడులో ఎండిపోయిన బత్తాయి తోట

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు