logo

వెలుగొండ పూర్తి.. పథకాలతో ప్రతిఇంటికీ అబ్ధి

రాష్ట్రంలో కీలక పార్లమెంట్‌ నియోజకవర్గం ఒంగోలు. కోస్తా.. రాయలసీమ సంస్కృతుల సమ్మిళితమైన ఈ ప్రాంతం నుంచి తెదేపా తరఫున బలమైన అభ్యర్థి మాగుంట శ్రీనివాసులు రెడ్డి బరిలో నిలిచారు. ఇటు సేవా కార్యక్రమాలు..అటు పార్టీలకతీతంగా వివాద రహితుడిగా గుర్తింపు పొందడం ఆయనకు కలిసొచ్చే అంశం.

Published : 08 May 2024 04:39 IST

 వృద్ధులకు ఇంటి వద్దే మూడు నెలల పింఛన్‌
మహిళలకు ఉచితంగా సిలిండర్లు బస్సు ప్రయాణం
పరిశ్రమల స్థాపనతో యువతకు ఉపాధి
ఇంటింటికీ తాగునీరు, ప్రతి పొలానికీ సాగునీరు
ఒంగోలు తెదేపా ఎంపీ అభ్యర్థి మాగుంట శ్రీనివాసులురెడ్డి
ఈనాడు-ఒంగోలు

రాష్ట్రంలో కీలక పార్లమెంట్‌ నియోజకవర్గం ఒంగోలు. కోస్తా.. రాయలసీమ సంస్కృతుల సమ్మిళితమైన ఈ ప్రాంతం నుంచి తెదేపా తరఫున బలమైన అభ్యర్థి మాగుంట శ్రీనివాసులు రెడ్డి బరిలో నిలిచారు. ఇటు సేవా కార్యక్రమాలు..అటు పార్టీలకతీతంగా వివాద రహితుడిగా గుర్తింపు పొందడం ఆయనకు కలిసొచ్చే అంశం. దీనికితోడు తెదేపా సూపర్‌ సిక్స్‌ పథకాలు అమ్ముల పొదిలో అస్త్రాల్లా మారాయి. ఈ నేపథ్యంలో మహిళలు, యువత, రైతులు, విద్యార్థుల జీవితాల్లో వెలుగులు నింపుతామని, అదే సమయంలో వెలిగొండను పూర్తి చేసి జిల్లాను సస్యశ్యామలం చేస్తామని మాగుంట ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఒంగోలు పార్లమెంట్‌ నియోజకవర్గాన్ని రాష్ట్రంలోనే ఆదర్శంగా నిలుపుతానంటున్నారు. ఆయన మంగళవారం ‘ఈనాడు’ ముఖాముఖిలో తన అంతరంగం ఆవిష్కరించారు. ఆ విశేషాలు..


8 లక్షల మంది మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం

మహిళలకు ఆర్థిక భరోసా కల్పించేందుకు 18-59 ఏళ్ల మధ్య వయస్సు మహిళలకు నెలకు రూ.1500 చొప్పున ఏడాదికి రూ.18వేలు ఆర్థిక సాయం అందిస్తాం. ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం కల్పిస్తాం. దీనివల్ల వారు విద్యా, వ్యాపారాలతో ఉపాధి పొందొచ్చు.  8 లక్షల మంది మహిళలు ఉచిత బస్సు ప్రయాణాన్ని వినియోగించుకోవచ్చు. తల్లికి వందనం పథకం కింద ఇంట్లో ఎంతమంది పిల్లలు చదువుతుంటే అంతమందికి ఒక్కొక్కరికి ఏటా రూ.15వేలు చొప్పున అందజేస్తాం. ప్రస్తుతం అమ్మఒడి ప్రకారం నియోజకవర్గంలో 1.80 లక్షల మంది తల్లులకు లబ్ధి కలగనుంది. స్వయం సహాయక సంఘాల మహిళలకు రూ.10 లక్షల వరకు వడ్డీలేని రుణాలు ఇవ్వనున్నారు. ఈ పథకం ద్వారా నియోజకవర్గంలో 4.59 లక్షల మందికి మేలు చేకూరుతుంది.


యాభై ఏళ్లకే  పింఛన్‌తో మరో లక్ష మందికి మేలు

ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు యాభై ఏళ్లకే పింఛన్‌ రూ.4వేలు, దివ్యాంగుల పింఛను రూ.6వేలు ఏప్రిల్‌ నుంచి జూన్‌ నెల వరకు మూడు నెలల మొత్తం కలిపి జులైలో లబ్ధిదారులకు ఇళ్ల వద్దనే అందజేస్తాం. నియోజకవర్గంలో ప్రస్తుత పింఛన్ల ప్రకారం 2.79 లక్షల మందికి, యాభై ఏళ్లకే తగ్గింపుతో దాదాపు మరో లక్ష మందికి లబ్ధి చేకూరుతుంది. అలానే ఆయా కార్పొరేషన్ల ద్వారా రాయితీ రుణాలు అందజేసి బడుగు బలహీన వర్గాల వారిని ఆర్థికంగా బలోపేతం చేస్తాం.


జిల్లాలో 2.75 లక్షల రైతులకు ఆర్థిక సాయం

రైతులకు, కౌలు రైతులకు ఏటా రూ.20వేలు చొప్పున ఆర్థిక సాయం చేస్తాం. వైకాపా ప్రభుత్వం ఇచ్చిన హామీని సక్రమంగా అమలు చేయలేదు. మేము ప్రతి రైతు, కౌలు రైతుకు రూ.20వేలు చొప్పున ఆర్థిక సాయం అందించడంతోపాటు రాయితీ పథకాలు అందిస్తాం. దీని ద్వారా పార్లమెంట్‌ నియోజకవర్గంలోని 2.75 లక్షల మంది అన్నదాతలు లబ్ధి పొందుతారు. 9 గంటల నాణ్యమైన ఉచిత విద్యుత్తుతో 1.72 లక్షల మంది రైతులకు కష్టాలు దూరమవుతాయి.


6500 కుటుంబాలకు ఉచిత సిలిండర్లు

దీపం గ్యాస్‌ కనెక్షన్లు ఉన్న ప్రతి ఇంటికీ ఏడాదికి మూడు గ్యాస్‌ సిలిండర్లు ఉచితంగా అందించనున్నాం. ఇలా అయిదేళ్లలో ప్రతి కుటుంబానికి 15 సిలిండర్లు అందనున్నాయి. ప్రభుత్వం ఏర్పాటు అయ్యాక ఇంకా ఒకటిరెండు సిలిండర్లు పెంచి ఇచ్చే అంశాన్ని కూడా పరిశీలిస్తాం. ఇలా నియోజకవర్గం పరిధిలో 6500 దీపం కనెక్షన్లు ఉన్న కుటుంబాలకు లబ్ధి చేకూరనుంది.


మెగా డీఎస్సీతో 63 వేలమందికి ఉద్యోగావకాశం

తెదేపా కూటమి ప్రభుత్వం ఏర్పాడ్డాక తొలి సంతకం మెగా డీఎస్సీపైనే పెడాతానని మా అధినేత  చంద్రబాబు ప్రకటించారు. ఆమేరకు పార్లమెంట్‌ నియోజకవర్గం పరిధిలో 63వేల మంది నిరుద్యోగులకు ప్రయోజనం కలగనుంది. వారికి ఉద్యోగం వచ్చేవరకు నెలకు రూ.3వేలు నిరుద్యోగ భృతి అందజేస్తాం.


నిమ్జ్‌ పూర్తి చేస్తాం.. గ్రానైట్‌ పరిశ్రమను ఆదుకుంటాం

తెదేపా హయాంలో దొనకొండ, రాగమక్కపల్లి, మాలకొండాపురం ప్రాంతాల్లో పరిశ్రమలకు స్థలాలు కేటాయించినా, వైకాపా పాలనలో ఒక్క పరిశ్రమ కూడా రాలేదు. మేం యుద్ధప్రాతిపదికన కనిగిరి నియోజకవర్గంలో నిమ్జ్‌, ఇతర ఏపీఐఐసీ స్థలాల్లో పరిశ్రమలు నెలకొల్పి యువతకు ఉద్యోగ, ఉపాధి కల్పిస్తాం. ట్రిపుల్‌ ఐటీకీ సొంతభవనం నిర్మిస్తాం. జిల్లాను ఫార్మ హబ్‌ చేస్తాం. కుదేలైన గ్రానైట్‌ పరిశ్రమను ఆదుకుంటాం.


యువత.. మహిళ.. వృద్ధులు.. రైతుల కష్టాలిక దూరం

‘తెదేపా-జనసేన కూటమి మేనిఫెస్టోతో అన్ని వర్గాల ప్రజలకు మేలు చేకూరుతుంది. పేదల జీవితాల్లో వెలుగులు నింపేందుకే సూపర్‌ సిక్స్‌ పథకాల్ని తీసుకొచ్చాం. ఉచిత గ్యాస్‌ సిలిండర్లు, పక్కా ఇళ్లతో గృహిణులకు, అన్నదాత పథకంతో రైతులకు, నిరుద్యోగ భృతి, మెగా డీఎస్సీతో నిరుద్యోగుల జీవితాల్లో ఆనందం నింపుతాం. తల్లికి వందనంతో విద్యార్థులకు, పరిశ్రమల స్థాపనతో యువతకు ఉద్యోగ, ఉపాధి కల్పిస్తాం. వెలిగొండ ప్రాజెక్టు పూర్తి చేసి జిల్లాలో సాగు, తాగునీటి కష్టాలు దూరం చేస్తాం.  


భూములు లాక్కునే ల్యాండ్‌ టైటిల్‌ చట్టం తీసేస్తాం

జిల్లాలో నిరుపేదలెక్కువ. వారికున్న కొద్దిపాటి భూమికి రక్షణగా ఉంటాం. భూములు లాక్కునే ల్యాండ్‌ టైటిలింగ్‌ చట్టం రద్దుపై రెండో సంతకం చేస్తామని దర్శి పర్యటనలో చంద్రబాబు హామీ ఇచ్చారు. ఇది అమలు చేసి జిల్లావాసులకు భరోసా కల్పిస్తాం.


ప్రతి పౌరుడికీ డిజిటల్‌ హెల్త్‌కార్డు

దేశంలోనే తొలిసారిగా రాష్ట్రంలో ప్రతి కుటుంబానికి రూ.25 లక్షల ఆరోగ్య బీమా కల్పిస్తున్నాం. ప్రతి పౌరుడికీ డిజిటల్‌ హెల్త్‌ కార్డులు ఇవ్వడంతో వారికి ఆరోగ్య బీమా సౌకర్యం లభిస్తుంది. వీటి ద్వారా వైద్య పరీక్షలు నిర్వహించి జనరిక్‌ మందులు అందిస్తారు. జగన్‌ పాలనలో ఆరోగ్యశ్రీ  పూర్తిగా గాడి తప్పింది. రీ ఎంబర్స్‌మెంట్‌ రావడం లేదు. పూర్తిగా నిధులు కేటాయించి దీన్ని పరిపుష్ఠి చేస్తాం.


ఒకటో తేదీనే వేతనం.. ఉపాధ్యాయులకు మరింత గౌరవం

జగన్‌ వచ్చాక ఉద్యోగులకు సకాలంలో జీతాలు రావడం లేదు. ఒకటో తేదీనే ఉద్యోగులకు జీతాలు, పింఛన్లు అందిస్తాం. పాత బకాయిలూ క్లియర్‌ చేస్తాం. వైకాపా సర్కారు ప్రభుత్వ ఉపాధ్యాయులను అగౌరవ పరిచింది. తాము అధికారంలోకి వచ్చాక ఉపాధ్యాయులు, ఉద్యోగులు ఒత్తిడి లేకుండా గౌరవంగా పనిచేసుకునే వాతావరణం కల్పిస్తాం.


ఇప్పటికే ఫ్లోరైడ్‌ బాధితులు, పేదలకు సేవలందిస్తున్నాం

ఒంగోలు పార్లమెంట్‌ స్థానంలో మాగుంట కుటుంబం తొమ్మిదోసారి పోటీ చేస్తోంది.  అధికారంలోకి రాగానే మార్కాపురం జిల్లా ఏర్పాటుతో పశ్చిమ ప్రాంతాన్ని మరింత అభివృద్ధి చేస్తాం. కుమారుడు రాఘవరెడ్డి మార్కాపురంలో నివాసముంటూ అన్ని ప్రాంతాల్లో తిరుగుతున్నారు. కనిగిరి, దర్శి, మార్కాపురం, యర్రగొండపాలెం ఇతర నియోజకవర్గాల్లో ఫ్లోరైడ్‌ ప్రాంతాల్లో పదేళ్ల క్రితమే ఉచితంగా శుద్ధిజలాలు సరఫరా చేసి పేదలకు చేరువయ్యాం. మూడు డిగ్రీ, 16 జూనియర్‌ కళాశాలలు ఏర్పాటు చేశాం. సొంత నిధులతో వందలాదిమంది పేదలకు ఖరీదైన వైద్య చికిత్సలు అందించాం. సింగరాయకొండ వద్ద పరిశ్రమలు ఏర్పాటుచేసి ఉపాధి కల్పించాం. మరింత చురుగ్గా వీటిని కొనసాగిస్తాం.


ఆరు నెలల్లోనే ప్రాజెక్టు పూర్తిచేస్తాం

(మేలు : 4 లక్షల ఎకరాలకు సాగు నీరు)

వైకాపా ప్రభుత్వం వెలిగొండ ప్రాజెక్టును నిలిపేసింది. మేం ఆరు నెలల్లోనే దాన్ని పూర్తిచేసి  జిల్లావాసులకు సాగు, తాగు నీళ్లు అందజేస్తాం. 4 లక్షల ఎకరాలకు సాగు నీరు అందనుంది. జల్‌జీవన్‌ మిషన్‌, వాటర్‌ గ్రిడ్‌ పథకాల ద్వారా ప్రతి ఇంటికీ నీటి కొళాయి వసతి కల్పించి నీరందిస్తాం. జల్‌జీవన్‌ మిషన్‌ కింద 75 వేల ఇళ్లతోపాటు మరో 21 మండలాల్లో ఇంటింటికీ కుళాయి కనెక్షన్లు రానున్నాయి.


సుదీర్ఘ అనుభవం 

మాగుంట శ్రీనివాసులురెడ్డి 1998లో కాంగ్రెస్‌ నుంచి తొలిసారిగా ఎంపీ అయ్యారు.
1999, 2014లో ఓటమి పాలవ్వగా, 2004, 2009, 2019లో ఎంపీగా విజయం సాధించారు.


ఇదీ ఎంపీ ముఖచిత్రం

మొత్తం ఓటర్లు : 16,15,525
మహిళలు : 8,05,409
పురుషులు : 8,10,112
ట్రాన్స్‌జెండర్లు : 4

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని