logo

చెవి నొగ్గి వినండి అరాచక ముఠా దిగింది!

కార్యకర్తలొద్దు.. ప్రైవేట్‌ సైన్యమే దన్ను...: ఎన్నికల్లో సదరు బదిలీ అభ్యర్థి పూర్తిగా తన ప్రైవేట్‌ సైన్యం పైనే ఆధారపడ్డారు. తాయిలాల పంపిణీ నుంచి, క్షేత్రస్థాయిలో అసంతృప్తులను బుజ్జగించడం, ఇతర పార్టీల్లోని వారికి ఎరవేయడంలో బిజీగా ఉన్నారు.

Published : 08 May 2024 04:45 IST

ఇళ్లు, లాడ్జీలు, హోటళ్లలో మకాం
దాడులు, దౌర్జన్యాలకు రంగం సిద్ధం

న్యూస్‌టుడే, ఒంగోలు

వైకాపా అధిష్ఠానం చేపట్టిన రాజకీయ బదిలీల్లో భాగంగా ఇతర జిల్లా నుంచి ఓ అభ్యర్థి జిల్లాకు వచ్చారు. అడపాదడపా తళుక్కున మెరిసి మాయమవ్వడం తప్ప ఆయన పెద్దగా ప్రచారంలో పాల్గొన్న దాఖలాలు లేవు. పార్టీ కార్యకర్తల సంగతి అటుంచితే కనీసం ద్వితీయశ్రేణి నాయకులతోనూ పరిచయాలు లేవు. కేవలం ప్రలోభాలకు గురిచేయడం మినహా, తాను పోటీ చేస్తున్న నియోజకవర్గంలో అభ్యర్థులు, నాయకులు, కార్యకర్తలను కనీసం పట్టించుకోవడం లేదని పార్టీలోనే ఆయనపై తీవ్ర విమర్శలు ఉన్నాయి. తాను పార్టీ అధినేతకు అత్యంత సన్నిహితుడిననీ, అందరూ తన కనుసన్నల్లో మెలగాలంటూ ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారు. ఈ తీరుపై ఆ పార్టీలోనే నిరసన స్వరాలు వినిపిస్తున్నాయి.

కార్యకర్తలొద్దు.. ప్రైవేట్‌ సైన్యమే దన్ను...: ఎన్నికల్లో సదరు బదిలీ అభ్యర్థి పూర్తిగా తన ప్రైవేట్‌ సైన్యం పైనే ఆధారపడ్డారు. తాయిలాల పంపిణీ నుంచి, క్షేత్రస్థాయిలో అసంతృప్తులను బుజ్జగించడం, ఇతర పార్టీల్లోని వారికి ఎరవేయడంలో బిజీగా ఉన్నారు. తాను పోటీ చేసే కేంద్ర స్థానంలో కనీసం కార్యాలయం ఏర్పాటు చేసుకోలేదు. ప్రతి సచివాలయం పరిధిలో వ్యక్తిగత సిబ్బందిని నియమించుకున్నారు. విశ్రాంత పోలీసులతో జట్టును సిద్ధం చేసుకున్నారు. ప్రస్తుతం పోస్టల్‌ బ్యాలెట్‌ ఓట్ల కొనుగోళ్లలోనూ ఈ జట్టు ప్రధాన పాత్ర పోషిస్తోంది. వీటికి తోడు ఇప్పుడు పొరుగు జిల్లాలతో పాటు పక్క రాష్ట్రాల నుంచి పెద్దఎత్తున కిరాయి సైన్యాన్ని జిల్లాలోకి దించారు.

జిల్లాలో అలజడులకు కుట్ర..!

జిల్లాలో పోలింగ్‌ రోజున అలజడులు సృష్టించి ఓటర్లను భయభ్రాంతులకు గురిచేసి లబ్ధి పొందేందుకు కుట్రలు చేసినట్లు విస్తృతంగా ప్రచారం సాగుతోంది. ఇప్పటికే పొరుగు రాష్ట్రమైన తమిళనాడులో పార్లమెంట్‌ ఎన్నికల ప్రక్రియ ముగిసింది. ఈ నేపథ్యంలో ఆ రాష్ట్రంతో పాటు తాను ఇప్పటి వరకు ప్రాతినిథ్యం వహించిన జిల్లా నుంచి రైళ్లు, బస్సులు, ఇతర ప్రైవేట్‌ వాహనాల్లో కిరాయి సైన్యాన్ని రప్పించినట్లు సమాచారం. వీరితో అలజడులు సృష్టించేందుకు కార్యాచరణ ప్రణాళిక రూపొందించినట్లు తెలిసింది. కొన్ని బృందాలు ఇప్పటికే జిల్లాకు చేరుకుని ఇళ్లు అద్దెకు తీసుకోవడంతో పాటు పలు ప్రాంతాల్లో లాడ్జిలు, హోటళ్లు, అపార్ట్‌మెంట్లలో మకాం వేశారనే సమాచారంతో నిఘావర్గాలు కూడా దృష్టిసారించి ఆరా తీస్తున్నాయి.

ఇప్పటికే హెచ్చరికలు చేసిన ఈసీ

ప్రశాంత రాజకీయాలకు ఒంగోలు పెట్టింది పేరు. ఎన్నికల రోజున చెదురుమదురు సంఘటనలు మినహా పెద్ద అవాంఛనీయ సంఘటనలుండవు. ప్రస్తుతం ఆ ముద్ర చెరిగింది. నియోజవర్గంలో ఇటీవల తరచూ ఘర్షణలు చోటుచేసుకుంటున్నాయి. అధికార పక్షానికి చెందిన పలువురు కయ్యానికి కాలు దువ్వుతున్నారు. రాష్ట్రంలోనే అత్యంత సమస్యాత్మక నియోజకవర్గాలైన పద్నాలుగింటిలో ఒంగోలు ఒకటిగా ఈసీ ఇప్పటికే ప్రకటించింది. అన్ని కేంద్రాల్లోనూ వెబ్‌ కాస్టింగ్‌తో పాటు కేంద్ర బలగాలతో బందోబస్తు ఏర్పాటు చేయాలని ఆదేశించింది. ఈ పరిణామాలు నగర వాసులను తీవ్ర ఆందోళనకు గురిచేస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఇక్కడ పోలీసు యంత్రాంగం సమర్థంగా వ్యవహరించి ప్రశాంత ఎన్నికలు నిర్వహణకు పటిష్ఠ చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

    ap-districts
    ts-districts

    సుఖీభవ

    చదువు