logo

ఉద్దానం సిరి..ఏదీ ఈసారి!

వాతావరణ పరిస్థితుల కారణంగా ఈ సారి కొబ్బరి దిగుబడి 40 శాతం తగ్గిపోయింది. ఈ లెక్కన రైతు సుమారు 10 కోట్ల కాయలను కోల్పోయాడు. అంటే రూ.200 కోట్ల మేర దిగుబడి తగ్గి రైతు నష్టపోయాడు. మరో వైపు ధర తగ్గుదలతో మరో రూ.వంద కోట్ల మేర నష్టం వాటిల్లింది. ఇంకోవైపు ఎగుమతులులేక వ్యాపారులు

Published : 17 Jan 2022 04:04 IST

రైతుల వద్ద నిల్వ ఉన్న కొబ్బరికాయలు

కవిటి, న్యూస్‌టుడే: వాతావరణ పరిస్థితుల కారణంగా ఈ సారి కొబ్బరి దిగుబడి 40 శాతం తగ్గిపోయింది. ఈ లెక్కన రైతు సుమారు 10 కోట్ల కాయలను కోల్పోయాడు. అంటే రూ.200 కోట్ల మేర దిగుబడి తగ్గి రైతు నష్టపోయాడు. మరో వైపు ధర తగ్గుదలతో మరో రూ.వంద కోట్ల మేర నష్టం వాటిల్లింది. ఇంకోవైపు ఎగుమతులులేక వ్యాపారులు మొహం చాటేస్తున్నారు... వచ్చిన కాస్త దిగుబడి కూడా రైతుల వద్ద నిల్వల రూపంలో పేరుకుపోయింది. దీంతో దళారులకు తలవంచాల్సిన పరిస్థితి. మరో వారం ఇదే పరిస్థితి కొనసాగితే జీవనం కనాకష్టమవుతుందని హలధారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

గ్రేడింగ్‌ విధానంతో నష్టం

ఈ సీజన్‌లో 50 శాతం పైగా దిగుబడులు మందగిస్తాయి. వీటికి తోడు గ్రేడింగ్‌ విధానం రైతులకు కోలుకోలేని దెబ్బతీస్తోంది. 20 శాతం కాయలు చిన్నవిగా గుర్తించి వ్యాపారి పక్కన పడేస్తున్నాడు. వాటికి సగం ధర మాత్రమే చెల్లిస్తున్నారు. నూటికి నాలుగు కాయలు అదనంగా తీసుకుంటారు. ఇవన్నీ రైతుకు నష్టం కలిగించేవే. పైగా పెట్టుబడులు బాగా పెరిగాయి. ఎగుమతుల మందగింపు, పెట్టుబడులు ఆర్థిక భారంగా మారుతున్నాయి.

తగ్గిన ధర.. ఆగిన ఎగుమతులు

కొబ్బరిధర తాజాగా కనిష్ఠ స్థాయికి దిగజారింది. గతేడాది కాలంలో కరోనా ఇతరత్రాంశాల్లో ప్రతికూల పరిస్థితులున్నా వెయ్యి కాయలు రూ.20 వేల వరకు పలికాయి. తాజాగా అది రూ.14 వేలకు పడిపోవడంతో రైతన్నలు ఆందోళన చెందుతున్నారు. ఆ ధరకీ కొనేవాళ్లు ముందుకు రావడంలేదు. శీతాకాలంలో కొబ్బరి నాణ్యత, పరిమాణం తగ్గడమూ ఇందుకు కారణం. ఉద్దానం కొబ్బరికి ఉత్తరాది రాష్ట్రాల్లో గిరాకీ ఉంది. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఉద్దానం కొబ్బరి నాణ్యత ఎక్కువ. ఎక్కువకాలం నిల్వ, రుచి, సాంద్రత, పరిమాణం ఉంటుంది. నూనె దిగుబడులు కూడా అధికంగా ఉంటాయి. ఎక్కువగా ఒడిశా, బిహార్‌, రాజస్థాన్‌, ఛత్తీస్‌గఢ్‌, మధ్యప్రదేశ్‌, ఉత్తర్‌ప్రదేశ్‌ తదితర రాష్ట్రాలకు ఎగుమతులుంటాయి.

ప్రభుత్వం సేకరించాలి: ఉత్తరాది రాష్ట్రాల్లో డిమాండ్‌ లేకపోవడంతో ఎగుమతులు మందగించాయి. ఇతర రాష్ట్రాల కొబ్బరి గట్టిపోటీ ఇస్తోంది. ఉద్యానపంటల్లో ప్రధానమైన కొబ్బరికి మద్దతు ధర కల్పించాల్సి ఉంది. ఏటా విపత్కర పరిస్థితులు సర్వసాధారణం అయిపోయాయి. మార్కెట్‌యార్డుల్లోనూ కొబ్బరి సేకరించి రైతులను ఆదుకోవాలి. - సనపల సంతోష్‌కుమార్‌, రైతు, రాజపురం

కవిటి మండలం భైరిపురం గ్రామానికి చెందిన నర్తు అనసూయమ్మకు రెండెకరాల తోట ఉంది. గతంలో 1,800 కాయల వరకు లభించేవి. తాజాగా వెయ్యికాయలే పడ్డాయి. వ్యాపారులు చిన్నకాయలంటూ 150 తీసేశారు. పెట్టుబడులకు సుమారు రూ.18 వేలు వ్యయం చేశారు. రాబడి రూ.14 వేలు. ఆరుగాలం వారు పడ్డ శ్రమకు లభించింది రూ.4 వేల అప్ఫు ఇద్దరు కుమారులున్న ఆ కుంటుంబాన్ని ఎలా పోషించాలి. అప్పులకు వడ్డీ, నిత్యావసర సరకులు, మందులు, పండగ ఖర్చులు అంతా అప్పులతోనే జరుపుకోవాల్సి వచ్చిందంటూ ఆవేదన వ్యక్తం చేశారు.

కవిటి మండలం తొత్తిడిపుట్టుగ గ్రామానికి చెందిన యర్ర త్రినాథ్‌ మూడేళ్ల కిందట రూ.2 లక్షలు అప్పుచేసి ఎకరంన్నర కొబ్బరితోట కొన్నారు. గతంలో 1,700 వరకు కాయలు లభించేవి. చీడపీడలు, విపత్తుల నష్టాలతో తాజాగా 900 కాయలు లభించాయి. పెట్టుబడులు సుమారు రూ.10 వేలు అయ్యాయి. ధరలు లేవంటూ కాయలు ఇంటివద్దే ఉన్నాయి. కుమార్తెకు ఉన్నత చదువులు, ఇంట్లో వృద్ధుల మందుల ఖర్చు ఎలా గడుస్తాయోననే బెంగ పట్టుకుంది.

జిల్లాలో సాగు వివరాలు

మొత్తం విస్తీర్ణం 36,920 ఎకరాలు

ఉద్దానంలో.. 31,300 ఎకరాలు

ప్రత్యక్షంగా ఆధారపడిన కుటుంబాలు 65 వేలు

పరోక్షంగా ఉపాధి పొందుతున్నవి 55 వేలు

ఏడాదికి దిగుబడి 25 కోట్ల కాయలు

గతంలో రోజుకు ఎగుమతులు 25 నుంచి 30 లారీలు

ప్రస్తుతం 2 నుంచి 3 లారీలు

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని