logo

‘శిఖర’మంతా సాహసం.. కోరుతోంది ప్రోత్సాహం..!

జయశ్రీ చదువుతో పాటు సాహస క్రీడల్లోనూ ప్రతిభ చూపుతోంది. తల్లి ఉమా గృహిణి, తండ్రి ఎలక్ట్రికల్‌ దుకాణం నడుపుతున్నారు.

Updated : 28 Nov 2022 06:10 IST

తాడు సాయంతో బియాస్‌ నదిని దాటుతున్న జయశ్రీ మంచు కొండను ఎక్కేందుకు సిద్ధమవుతూ..

సమాజంలో అమ్మాయిలు అన్ని రంగాల్లో ముందుకు సాగుతున్నారు. ఏ శిక్షణకైనా, సాహసానికైనా మేము సైతం సై అంటూ ముందుకుసాగుతున్నారు. ఆ కోవకే చెందుతారు ఆమదాలవలస పట్టణం పాతినవారి వీధికి చెందిన కంచరాపు జయశ్రీ. ఈమె మంచు పర్వతాలు, కొండలు ఎక్కడం, నదులు దాటడం వంటి సాహస క్రీడలపై మక్కువతో ముందడుగు వేస్తున్నారు. ఇటీవల హిమాచల్‌ప్రదేశ్‌లో విజయవంతంగా శిక్షణ పూర్తి చేసుకొని ఎవరెస్టును అధిరోహించడమే లక్ష్యంగా సాగుతున్నారు. ఈ సందర్భంగా ఈమెపై ‘న్యూస్‌టుడే’ ప్రత్యేక కథనం..

న్యూస్‌టుడే, ఆమదాలవలస గ్రామీణం: జయశ్రీ చదువుతో పాటు సాహస క్రీడల్లోనూ ప్రతిభ చూపుతోంది. తల్లి ఉమా గృహిణి, తండ్రి ఎలక్ట్రికల్‌ దుకాణం నడుపుతున్నారు. జయశ్రీ పదో తరగతి వరకు ఆమదాలవలసలో చదువుకుంది. ఇంటర్‌ శ్రీకాకుళంలోని శ్రీచైతన్య కళాశాలలో డిగ్రీ తిరుపతి శ్రీపద్మావతి మహిళా విశ్వవిద్యాలయంలో పూర్తి చేసింది. ఎమ్మెస్సీ ఇంటిగ్రేటెడ్‌ ఫుడ్‌ టెక్నాలజీ పీజీ చివరి సంవత్సరం అక్కడే చదువుతుంది. చివరి సంవత్సరం చదువుతుండగా సాహస క్రీడల్లో శిక్షణకు యూనివర్సిటీ నుంచి ఇద్దరిని ఎంపిక చేయగా వారిలో ఈమె ఒకరు కావడం గమనార్హం. వీరిద్దరూ ఈ నెల 6 నుంచి 15 వరకు హిమాచల్‌ప్రదేశ్‌ రాష్ట్రం కులుమనాలీలోని అటల్‌ బిహారీ వాజ్‌పేయి ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మౌంటైనీరింగ్‌ అండ్‌ అలైడ్‌ స్పోర్ట్సు (అభ్విమాస్‌) శిక్షణా కేంద్రంలో సాహస క్రీడల్లో తర్ఫీదు పొందారు.

శిబిరంలో నేర్పినవి ఇవే... శిబిరంలో దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి 150 మంది విద్యార్థులు పాల్గొన్నారు. మైనస్‌ 2, 3 డిగ్రీల ఉష్ణోగ్రతలో శిక్షణలో భాగంగా యోగా, ధ్యానం, వ్యాయామం, పర్వతాలు, నదులు దాటడానికి శారీరకంగా మానసికంగా సిద్ధమయ్యేందుకు ముందుగా శిక్షణ ఇచ్చారు. మంచుకొండలపె చల్లటి నీటిలో తాడు సాయంతో బియాస్‌ నదిని దాటడం, వరదల్లో కొట్టుకుపోయేవారిని, నదిలో మునిగిపోయేవారిని ఏ విధంగా కాపాడాలో నేర్పించారు. శిక్షణ అనంతరం ప్రశంసాపత్రాలు, బహుమతులు అందించారు.

ఎవరెస్టు అధిరోహించాలనుంది...

శిక్షణను విజయవంతంగా పూర్తి చేశాను. మూడు వేల అడుగులు ఉన్న నాలుగు పర్వతాలను అధిరోహించడం, తాడు సాయంతో ఎత్తయిన కొండలను ఎక్కడం, దిగడం నేర్చుకున్నాను. వాటితో పాటు ఎలాంటి సమస్యలు, కష్టాలు ఎదురైనా దృఢంగా ముందుగా సాగితే విజయం సాధ్యమని పర్వతారోహణ ద్వారా తెలుసుకున్నాను. ఎవరెస్టు శిఖరాన్ని అధిరోహించాలని ఉంది. కానీ అందుకు శిక్షణ పొందేటంత ఆర్థిక స్థోమత లేదు. ప్రభుత్వం స్పందించి శిక్షణ ఇప్పిస్తే ఎవరెస్టును ఎక్కేందుకు సిద్ధంగా ఉన్నాను.

కంచరాపు జయశ్రీ

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని