logo

Srikakulam - SBI: మా బంగారం సంగతేంటి..?

స్టేట్‌ బ్యాంకు గార శాఖలో కుదువపెట్టిన బంగారం గల్లంతుపై ఖాతాదారుల్లో ఆందోళన తీవ్రమవుతోంది. శుక్రవారం ఉదయం బ్యాంకు వద్దకు పెద్దసంఖ్యలో చేరుకుని ప్రత్యేక శిబిరం ఏర్పాటు చేసి నిరసన తెలిపారు. పోలీసుల సమక్షంలో శాఖ మేనేజర్‌ రాధాకృష్ణను కలిసి మాట్లాడారు.

Updated : 02 Dec 2023 11:01 IST

న్యూస్‌టుడే, పాత శ్రీకాకుళం, గార, నేరవార్తావిభాగం: స్టేట్‌ బ్యాంకు గార శాఖలో కుదువపెట్టిన బంగారం గల్లంతుపై ఖాతాదారుల్లో ఆందోళన తీవ్రమవుతోంది. శుక్రవారం ఉదయం బ్యాంకు వద్దకు పెద్దసంఖ్యలో చేరుకుని ప్రత్యేక శిబిరం ఏర్పాటు చేసి నిరసన తెలిపారు. పోలీసుల సమక్షంలో శాఖ మేనేజర్‌ రాధాకృష్ణను కలిసి మాట్లాడారు. బ్యాంకులో జరిగిన అవకతవకలపై సమాధానం చెప్పాలని డిమాండ్‌ చేశారు. తమకు భరోసానివ్వాలని కోరారు. అధికారులు ఎలాంటి సమాధానం చెప్పకుంటే మొత్తం 2,430 మంది ఖాతాదారులు వచ్చి బ్యాంకుకు తాళం వేసి కార్యకలాపాలను అడ్డుకుంటామని హెచ్చరించారు. బ్యాంకు వద్ద ఎలాంటి ఉద్రిక్తత చోటు చేసుకోకుండా ఎస్సై ఎన్‌.కామేశ్వరరావు బందోబస్తు నిర్వహించారు. ప్రాంతీయ అధికారి ఫిర్యాదుపై విచారణ జరుగుతుందని ఎస్సై తెలిపారు.

సందేహాలకు సమాధానమేదీ..?

బంగారం కుదువపెట్టిన ఖాతాదారుల్లో రైతులు, దినసరి కూలీలు, మత్స్యకారులే అధికంగా ఉన్నారు. వారంతా వివిధ అవసరాలకు తాకట్టు పెట్టిన ఆభరణాలు ఏమయ్యాయో తెలియక లబోదిబోమంటున్నారు. బ్యాంకు అధికారుల నుంచి సరైన సమాధానం రాకపోవడంతో వారిలో అనేక సందేహాలు వ్యక్తమవుతున్నాయి. అసలు ఎంత బంగారం గల్లంతైందో కూడా స్పష్టంగా చెప్పలేకపోవడంపై ఆందోళన చెందుతున్నారు. బంగారు వస్తువులకు ఇచ్చే రసీదుల్లో కొన్నింటికి తేదీలు నమోదు చేయలేదని ఖాతాదారులు చెబుతున్నారు. అలాంటి రసీదులను పరిగణనలోకి తీసుకుంటారా.. లేదా.. అర్థం కాని పరిస్థితి. ఈ వ్యవహారం జరిగి వారాలు గడిచినా అధికారులు తాత్సారం చేస్తున్నారే తప్ప బాధితులకు నమ్మకం కల్పించలేకపోవడం గమనార్హం. ఈ విషయమై బ్రాంచ్‌ మేనేజర్‌ సీహెచ్‌ రాధాకృష్ణ మాట్లాడుతూ.. ‘ఖాతాదారులు అప్పగించిన బంగారానికి బ్యాంకే బాధ్యత వహిస్తుంది. ఎలాంటి ఆందోళన చెందవద్దు. కొద్దిరోజుల్లో అన్ని విషయాలు తెలియజేస్తాం. సహకరించాలి.’ అని అన్నారు. 

ఇటు దర్యాప్తు.. అటు ఒత్తిళ్లు..! 

ఎస్‌బీఐ గార శాఖలో తాకట్టులోని బంగారం మాయమైన వివాదంలో ఫిర్యాదు అందుకున్న పోలీసులు దర్యాప్తు దిశగా సాగుతున్నారు. కేసులో ప్రధాన నిందితురాలుగా పేర్కొన్న ఉరిటి స్వప్నప్రియ చరవాణిలో కాల్‌ డేటా పరిశీలించేందుకు ప్రయత్నిస్తున్నారు. మరోవైపు ఈ నెల 28న బ్యాంకులో అయిదు సంచులను అందజేసిన అపరిచిత వ్యక్తి ఎవరనేది ఇంకా నిర్ధారణ కాలేదు. అతను ఎవరు, ఆయనకు స్వప్నప్రియ సోదరుడు కిరణ్‌బాబుకు ఉన్న సంబంధమేంటి అనే అంశాలపైన కూడా ఆరా తీస్తున్నారు. మరోపక్క కిరణ్‌బాబు విషయంలో గతంలో జిల్లాలో ఎస్పీగా పనిచేసి, ప్రస్తుతం మరోచోట ఐజీ స్థాయిలో ఉన్న  ఓ అధికారి నుంచి జిల్లా అధికారులకు ఒత్తిడి వస్తున్నట్లు సమాచారం. జిల్లాకు చెందిన కీలక ప్రజాప్రతినిధి కూడా ఇదే విషయమై చెప్పినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. 

రికవరీ కాకపోతే పరిహారం ఎలా..

దర్యాప్తుతో బ్యాంకు నుంచి పోయిన బంగారం రికవరీ అవుతుందని బ్యాంకు ఉన్నతాధికారులు విశ్వసిస్తున్నారు. వివిధ వర్గాల నుంచి ఒత్తిళ్ల నేపథ్యంలో నిష్పక్షపాతంగా విచారణ జరగపోతే కేసు సుదీర్ఘ కాలం కాలయాపన జరిగే అవకాశాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో బాధితుల బంగారం రికవరీ అవ్వకపోతే వారికి ఇవ్వాల్సిన పరిహారం పరిస్థితి ఏమిటన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ప్రతి రుణానికీ బీమా చేయించడం అన్ని బ్యాంకుల్లో ఆనవాయితీ. గార శాఖలో బీమా చేయించారు. పోయిన బంగారం కారణంగా బీమా పరిహారం వచ్చేస్తుంది. బాధితులకు నగదు ఇవ్వాలా లేక వారు తాకట్టు పెట్టిన నగలు కొని ఇవ్వాలా అన్నది కేంద్రస్థాయిలో బ్యాంకు బోర్డు నిర్ణయం ఆధారంగా కార్యాచరణ జరుపుతారు. బాధితులు రూపాయి కూడా నష్టపోయే అవకాశం ఉండదని బ్యాంకు అధికారులు చెబుతున్నారు. 

అధికారులేమీ చెప్పట్లేదు: - మైలపల్లి స్వాతి, కొమరవానిపేట, ఖాతాదారు 

నేను సుమారు 6 తులాల బంగారు వస్తువులను రూ.2 లక్షలకు బ్యాంకులో కుదువ పెట్టాను. బ్యాంకులోని బంగారం పోయిందని తెలిసి కనుక్కుందామని వస్తే అధికారులేమీ చెప్పట్లేదు. అసలు మా బంగారం ఉందో.. లేదో కూడా తెలియట్లేదు. వారం రోజులతర్వాత రమ్మంటున్నారు.

లోపలికి కూడా రానివ్వట్లేదు: - కొర్లాపు వెంకటరావు, కొర్లాం

ఏడాది కిందట 17 తులాల బంగారు ఆభరణాలు రూ.8 లక్షలకు కుదువపెట్టాను. ఇప్పుడు విడిచిపిద్దామంటే ఆడిట్‌ అవుతుందని చెబుతున్నారు. డబ్బులు పట్టుకొని తిరుగుతున్నా బ్యాంకు లోపలికి కూడా రానివ్వట్లేదు. మా బంగారం ఇవ్వకుంటే చావడం తప్ప మరో మార్గం లేదు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని