logo

వన్యప్రాణులకు ఉచ్చు..!

ఆంధ్రా-ఒడిశా సరిహద్దు ప్రాంతాల్లో వన్యప్రాణుల వేట గుట్టుగా సాగిపోతోంది. అప్పుడప్పుడు వేటగాళ్లు వినియోగించే నాటు తుపాకులు బయటపడుతున్న ఘటనలే నిదర్శనం.

Published : 28 Mar 2024 05:52 IST

గుట్టుగా సాగుతున్న వేట
కొరవడిన అటవీ శాఖ పర్యవేక్షణ

చీడిపాలెం సమీపంలో స్వాధీనం చేసుకున్న వన్యప్రాణిని అటవీ శాఖ సిబ్బందికి అప్పగిస్తున్న ఎస్‌ఈబీ అధికారులు

  • 2023 ఫిబ్రవరిలో పాతపట్నం మండలం అంతరాబ వద్ద దుప్పిని సన్నని తీగతో వేటాడిన ముగ్గురిని అటవీ శాఖ    అధికారులు పట్టుకుని వారిపై కేసు నమోదు చేశారు.
  • గతేడాది మేలో కోదూరు సమీపంలో అడవిపంది మాంసాన్ని వాటాలు వేస్తున్న ఇద్దరు పట్టుబడ్డారు.  
  • సెప్టెంబరులో సీదిలో కొండ మేకను వల వేసి పట్టుకున్న   ఇద్దరిపై కేసు నమోదైంది.

న్యూస్‌టుడే, మెళియాపుట్టి: ఆంధ్రా-ఒడిశా సరిహద్దు ప్రాంతాల్లో వన్యప్రాణుల వేట గుట్టుగా సాగిపోతోంది. అప్పుడప్పుడు వేటగాళ్లు వినియోగించే నాటు తుపాకులు బయటపడుతున్న ఘటనలే నిదర్శనం. పాతపట్నం అటవీ శాఖ రేంజి పరిధి కొత్తూరు, పాతపట్నం, మెళియాపుట్టి, హిరమండలం,  సారవకోట, జలుమూరు మండలాల్లో సుమారు 14 వేల హెక్టార్ల విస్తీర్ణంలో దట్టమైన అటవీ ప్రాంతం ఉంది. అలుగు జాతికి చెందిన వన్యప్రాణులు, దుప్పులు, జింకలు, కనుజులు, కొండగొర్రెలు, నెమళ్లు, అడవి పందులు, కుందేళ్లు సంచరిస్తున్నాయి.

వన్య ప్రాణుల వేటకు వినియోగించే సన్న తీగ (పాత చిత్రం)

నాటు బాంబులు..కుక్కలు  

అటవీ ప్రాంతాల్లో వన్యప్రాణుల సంచారం ఆధారంగా వేటగాళ్లు ఉచ్చులు వేస్తుంటారు. ఆహారం, నీటి కోసం వాటి అన్వేషణ సమయాలను ఆసరాగా చేసుకుని సన్నని తీగలు, కట్టి బళ్లాలు, నాటు తుపాకులు, నాటు బాంబులను గురి కుదిరేలా సిద్ధం చేసి మాటు వేసి వేటాడతారు. కొన్ని ప్రాంతాల్లో కుక్కల్ని వినియోగిస్తుంటారు.

నిఘా సిబ్బందికి తాయిలాలు

వేటగాళ్లు అమాయకులైన గిరిజనులను ప్రలోభాలకు గురి చేసి పని కానిచ్చేస్తున్నారు. విషయం బయటకు పొక్కకుండా నిఘా సిబ్బందికి తాయిలాలు అందజేసి ప్రసన్నం చేసుకుంటున్నారు. కళేబరాలను మాంసం రూపంలో పట్టణ ప్రాంతాలకు తరలిస్తున్నారు. తెలిసిన వారికే విక్రయించి సొమ్ము చేసుకుంటున్నారు.

కేసులు నామమాత్రమే..

వన్యప్రాణుల వేటపై అటవీ అధికారుల నిఘా కొరవడింది. ఆంధ్ర-ఒడిశా సరిహద్దులో సువిశాలమైన అటవీ ప్రాంతం పర్యవేక్షణకు సిబ్బంది కొరత ఉంది. మరోవైపు కొందరు చేతివాటం ప్రదర్శిస్తుండటంతో వన్యప్రాణులు బలవుతున్నాయి. గతేడాది అంతరాబ పరిధిలో ట్రాపింగ్‌కు వినియోగించే ఉచ్చులను అటవీ  శాఖ యంత్రాంగం గుర్తించింది. పదేళ్లలో యాదృచ్ఛికంగా పట్టుబడిన కేసుల నమోదు తప్ప ప్రత్యేకంగా నిఘా ఉంచి దాడులు చేసిన సందర్భాలు కానరావడం లేదు. 2013, 2015, 2016, 2023లో సారవకోట, పాతపట్నం, మెళియాపుట్టి మండలాల పరిధిలో అధికారిక గణాంకాల ప్రకారం ఏడు కేసులు నమోదయ్యాయి.


నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు: నిషేధిత అటవీ ప్రాంతాల్లో వన్యప్రాణులను వేటాడటం నేరం. నిబంధనలు ఉల్లంఘిస్తే అటవీ చట్టం ప్రకారం చర్యలు తీసుకుంటాం. క్షేత్రస్థాయిలో పకడ్బందీగా నిఘా ఉంచాం.

ఆర్‌.రాజశేఖర్‌, ప్రాంతీయాధికారి, అటవీ శాఖ, పాతపట్నం

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని