Top Ten News @ 1 PM: ఈనాడు.నెట్‌లో టాప్‌ 10 వార్తలు @ 1 PM

ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం...

Updated : 27 Apr 2024 12:58 IST

1. పింఛన్ల పంపిణీపై ఏపీ ప్రభుత్వానికి ఈసీ ఆదేశాలు

పింఛన్ల పంపిణీపై ఏపీ ప్రభుత్వానికి ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసింది. ఎన్నికల కోడ్‌ అమలు దృష్ట్యా లబ్ధిదారులకు ఇబ్బంది లేకుండా చూడాలని కోరింది. పింఛన్‌ సహా నగదు బదిలీ పథకాలకు అనుసరించాల్సిన మార్గదర్శకాలను మార్చి 30న జారీ చేసినట్లు వెల్లడించింది. పూర్తి కథనం

2. రెచ్చిపోయిన మిలిటెంట్లు.. సీఆర్పీఎఫ్‌ శిబిరంపై 2 గంటల పాటు కాల్పుల వర్షం

జాతుల మధ్య వైరంతో గతేడాది అట్టుడుకిపోయిన ఈశాన్యం రాష్ట్రం మణిపుర్‌ (Manipur)లో మరోసారి హింసాత్మక ఘటన చోటుచేసుకుంది. బిష్ణూపుర్‌ జిల్లాలో భద్రతా సిబ్బంది క్యాంప్‌పై మిలిటెంట్లు (Militant attack) కాల్పులకు తెగబడ్డారు. ఈ ఘటనలో ఇద్దరు సీఆర్పీఎఫ్‌ (CRPF) సిబ్బంది అమరులయ్యారు.పూర్తి కథనం

3. అన్నమయ్య జిల్లాలో తెదేపా ప్రచార వాహనానికి నిప్పు

అన్నమయ్య జిల్లాలో దుండగులు దాష్టీకానికి పాల్పడ్డారు. వాల్మీకిపురం మండలం విట్టలం వద్ద తెదేపా ప్రచార వాహనంపై పెట్రోల్‌ పోసి నిప్పు పెట్టారు. వాహనంలో డ్రైవర్‌ ఉండగానే దుండగులు నిప్పు పెట్టి అక్కడి నుంచి పరారయ్యారు. ఈ ఘటనలో వాహనం పూర్తిగా దగ్ధమైంది.పూర్తి కథనం

4. అందాల పోటీల్లో తొలిసారి.. 60 ఏళ్ల ‘భామ’కు కిరీటం

అందాల పోటీ అంటే మనకు టీనేజ్ అమ్మాయిలే గుర్తొస్తారు. ఆ ఆలోచనలను పటాపంచలు చేస్తూ అర్జెంటీనా (Argentina)కు చెందిన అలెజాండ్రా మరీసా రొడ్రిగోజ్‌ (Alejandra Marisa Rodriguez) సరికొత్త చరిత్ర సృష్టించారు. ఆరు పదుల వయసులో అందంతో కుర్రకారు మతిపోగొడుతోన్న ఈ ‘భామ’.. తాజాగా మిస్‌ యూనివర్స్‌ ప్రాతినిధ్యం కోసం జరుగుతున్న పోటీల్లో కిరీటం దక్కించుకున్నారు.పూర్తి కథనం

5. ఏ ముఖం పెట్టుకుని ఓట్లు అడుగుతారు జగన్‌?: చంద్రబాబు

మేనిఫెస్టోపై ఏపీ సీఎం జగన్‌కు గౌరవం లేదని తెదేపా అధినేత చంద్రబాబు అన్నారు. మేనిఫెస్టో అంటే బైబిల్, ఖురాన్, భగవద్గీత అన్న జగన్ వాటిల్లో ఏ ఒక్కదాని మీదైనా గౌరవం ఉంటే.. అందులో చెప్పినట్టు రాష్ట్రంలో మద్యపాన నిషేధం అమలు చేసి ఉండేవారని  ధ్వజమెత్తారు.పూర్తి కథనం

6. సునీల్ నరైన్‌కు థ్యాంక్స్‌.. శశాంక్‌ ఓ అద్భుతం: బెయిర్‌స్టో

టీ20 క్రికెట్ చరిత్రలో (T20 Cricket) అత్యధిక టార్గెట్‌ను ఛేదించిన జట్టుగా పంజాబ్ రికార్డు సృష్టించింది. కోల్‌కతా నిర్దేశించిన 262 పరుగుల లక్ష్యాన్ని కేవలం 2 వికెట్లను మాత్రమే కోల్పోయి పంజాబ్ విజయం సాధించింది. అద్భుత శతకంతో జానీ బెయిర్‌స్టో (108*), హాఫ్‌ సెంచరీలు చేసిన శశాంక్‌ సింగ్ (58*), ప్రభ్‌సిమ్రన్ సింగ్ (54) కీలక పాత్ర పోషించారు.పూర్తి కథనం

7. మా పార్టీ పుట్టుక సంచలనం.. దారి పొడవునా రాజీలేని రణం: కేటీఆర్‌

‘తమ పార్టీ పుట్టుక సంచలనం... దారి పొడవునా రాజీలేని రణం’ అని భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌ అన్నారు. భారాస ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా గులాబీ శ్రేణులకు ఆయన ఎక్స్(ట్విటర్‌) వేదికగా శుభాకాంక్షలు తెలిపారు. ఆత్మగౌరవం, అభివృద్ధి పరిమళాలు అద్దుకున్న స్వీయ రాజకీయ పార్టీ అన్నారు. దీని ప్రస్థానం అనితర సాధ్యమని తెలిపారు.పూర్తి కథనం

8. కాంగ్రెస్‌ అలా నిరూపిస్తే పోటీ నుంచి వైదొలుగుతా.. : బండి సంజయ్‌

ఆరు గ్యారంటీలు అమలు చేస్తామని కాంగ్రెస్‌ మోసగించిందని కరీంనగర్‌ ఎంపీ బండి సంజయ్‌ విమర్శించారు. వంద రోజుల్లో ఆరు గ్యారంటీలు అమలు చేస్తామన్నారని గుర్తుచేశారు. తమ మేనిఫెస్టో ఖురాన్‌, బైబిల్‌, భగవద్గీత అని చెప్పారన్నారు. గతంలో హామీలు నిలబెట్టుకోనందుకే భారాసను ప్రజలు బొందపెట్టారని దుయ్యబట్టారు. పూర్తి కథనం

9. క్రికెట్‌.. బేస్‌బాల్‌ గేమ్‌లా మారిపోతోంది: పంజాబ్ కెప్టెన్

కోల్‌కతా - పంజాబ్‌ (Kolkata Vs Punjab) జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌లో 523 పరుగులు నమోదయ్యాయి. తొలుత కోల్‌కతా 261 పరుగులు చేయగా.. పంజాబ్‌ 262 పరుగులు సాధించింది. ఐపీఎల్‌లో అత్యధిక పరుగులు నమోదైన మూడో మ్యాచ్‌గా నిలిచింది. ఇదే సీజన్‌లో బెంగళూరు-హైదరాబాద్‌ మధ్య జరిగిన పోరులో ఏకంగా 549 రన్స్‌ నమోదైన సంగతి తెలిసిందే.పూర్తి కథనం

10. ఎన్నికల అధికారిని బెదిరించిన మంత్రి అప్పలరాజు..

మంత్రి అప్పలరాజు పలాస నియోజకవర్గంలో ఎన్నికల అధికారులతో వాగ్వాదానికి దిగారు. నిబంధనలకు విరుద్ధంగా ఉందని శుక్రవారం వైకాపా ప్రచార రథాన్ని ఎన్నికల అధికారి ఆశాలత ఆపారు. దీంతో మంత్రి ఆగ్రహానికి గురయ్యారు. ప్రచార రథం, రూ.లక్ష ఆమెకు ఇచ్చేయండంటూ తన అనుచరులను ఆదేశించారు. మీ ఇష్టమొచ్చినట్లు తయారు చేసి వాహనాన్ని ఇవ్వాలని అధికారితో మాటల యుద్ధానికి దిగారు.పూర్తి కథనం

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు