logo

ఐదేళ్లయినా దారికి రాని విస్తరణ..!

  రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ 2022 నవంబరు 23న నరసన్నపేట పర్యటనలో ప్రధాన రహదారి అభివృద్ధికి రూ.10 కోట్ల నిధులు మంజూరు చేస్తున్నట్లు ప్రకటించినా ఇంతవరకు స్పందన లేకపోవడం గమనార్హం.

Updated : 19 Apr 2024 06:38 IST

నిధులు లేక నిలిచిన పనులు  

నెరవేరని ముఖ్యమంత్రి హామీ

 

ఆర్టీసీ కాంప్లెక్స్‌ సమీపంలో విస్తరణకు నోచుకోని వైనం

రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ 2022 నవంబరు 23న నరసన్నపేట పర్యటనలో ప్రధాన రహదారి అభివృద్ధికి రూ.10 కోట్ల నిధులు మంజూరు చేస్తున్నట్లు ప్రకటించినా ఇంతవరకు స్పందన లేకపోవడం గమనార్హం.

న్యూస్‌టుడే, నరసన్నపేట: నరసన్నపేట పట్టణంలోని ప్రధాన రహదారి విస్తరణకు ఐదేళ్లుగా గ్రహణం వీడడం లేదు. పాలకుల నిర్లక్ష్యంతో పరిస్థితి ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా మారింది. 3 కి.మీ. ర.భ. రహదారిని అభివృద్ధి చేసేందుకు నిధుల లేమి వెంటాడుతోంది. నిత్యం రద్దీగా ఉండే ఈ రహదారిని విస్తరించక పోవడంతో తరచూ ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయని వాహనదారులు వాపోతున్నారు. 2020లో రాష్ట్ర ప్రభుత్వం నరసన్నపేట ప్రధాన రహదారి విస్తరణకు ఆమోదం తెలపగా, అదే ఏడాది అప్పటి ఉప ముఖ్యమంత్రి ధర్మాన కృష్ణదాస్‌ పనులను ప్రారంభించినా నేటికీ కొలిక్కి రాలేదు.

అరకొర పనులు

నరసన్నపేట సమీపంలోని సత్యవరం కూడలి నుంచి జమ్ము కూడలి వరకు పాత జాతీయ రహదారి 2.8 కి.మీ. కాగా, ర.భ శాఖ ఈ రహదారిని నిర్వహిస్తోంది. 2021 జూలై 9న ఈ మార్గం విస్తరణకు ప్రణాళికలు రూపొందించారు. అప్పటి వరకు అందుబాటులో ఉన్న నిధులు కేవలం రూ.4.5కోట్లు. దీంతో స్థానిక పోలాకి కూడలి నుంచి ఆర్టీసీ కాంప్లెక్స్‌ వరకు 1.1 కి.మీ. పొడవునా 80 అడుగుల రహదారిగా విస్తరించారు. అటు ఇటు విడిచిపెట్టి మధ్యలో ప్రారంభమైన ఈ పనులు 2022 డిసెంబరు నాటికి పూర్తయ్యాయి. ఇక ఆర్టీసీ కాంప్లెక్స్‌ నుంచి సత్యవరం కూడలి వరకు, మరోవైపున పోలాకి కూడలి నుంచి జమ్ము కూడలి వరకు పనులు చేయాల్సి ఉంది. 1.7కి.మీ. మేర రహదారిని విస్తరించాలి. దీనికి మరో రూ.11 కోట్లు అవసరమని ఇంజనీరింగ్‌ శాఖ ప్రభుత్వానికి నివేదించింది. మూడేళ్ల క్రితమే జమ్ము కూడలి నుంచి పెద్దపేట వరకు రహదారికి రెండు వైపులా ఉన్న భవనాలను కూల్చివేశారు. తీరా రహదారి నిర్మాణం మాత్రం పూర్తి చేయలేదు. కేవలం పట్టణం నడిబొడ్డున మాత్రమే పనులు చేసి చేతులు దులుపుకొన్నారని పలువురు పెదవి విరుస్తున్నారు. మిగిలిన పనులకు ఎప్పుడు మోక్షం కలుగుతుందోనని ఎదురు చూస్తున్నారు.


హడావుడి తప్ప ఆచరణ లేదు

నాలుగేళ్ల క్రితం ప్రధాన రహదారి విస్తరణకు వైకాపా ప్రభుత్వం హడావుడి చేసి పలు భవనాలను కూల్చివేసింది. తీరా రహదారి నిర్మాణాన్ని పూర్తి చేయలేకపోయింది. కేవలం కొద్ది దూరం మాత్రమే విస్తరించి చేతులు దులుపుకొంది. ఈ పనులకు ఇప్పట్లో మోక్షం లభించేలా లేదు.

- బోయిన సతీష్‌, లచ్చుమన్నపేట


మాట తప్పిన ముఖ్యమంత్రి

 నరసన్నపేట ప్రధాన రహదారి విస్తరణకు ముఖ్యమంత్రి జగన్‌ నరసన్నపేట వచ్చి మరీ రూ.10 కోట్లు నిధులు మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు. దాదాపు రెండేళ్లు కావస్తున్నా ఒక్క రూపాయి విడుదల చేయలేదు. విస్తరణకు నోచుకోక పోవడంతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయి.  
- తాళాభక్తుల గోవిందరావు, ఆదివారపుపేట


ప్రభుత్వానికి నివేదించాం

నరసన్నపేట ప్రధాన రహదారి విస్తరణకు రూ.11కోట్లతో ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించాం. నిధులు విడుదల కాలేదు. మంజూరైన వెంటనే పనులు పూర్తి చేసి ప్రజల ఇబ్బందులు తీరుస్తాం.

- రాజశేఖర్‌, ఏఈ, ర.భ.శాఖ

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని