logo

ద్విచక్ర వాహనం నుంచి జారిపడి మహిళ మృత్యువాత

మండలంలోని పెంటూరు గ్రామానికి చెందిన కూర్మాపు సరోజినీ  (48) ద్విచక్ర వాహనం పైనుంచి జారిపడి మృతి చెందింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.

Published : 20 Apr 2024 04:45 IST

కూర్మాపు సరోజినీ (పాత చిత్రం)

నందిగాం, న్యూస్‌టుడే: మండలంలోని పెంటూరు గ్రామానికి చెందిన కూర్మాపు సరోజినీ  (48) ద్విచక్ర వాహనం పైనుంచి జారిపడి మృతి చెందింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఆమె కుమారుడు రమేష్‌కు ఈనెల 24న వివాహం జరగనుంది. పెండ్లి సామగ్రి కొనుగోలు చేయడానికి శుక్రవారం కుమారుడితో కలిసి పలాసకు ద్విచక్ర వాహనంపై వెళ్లారు. తిరుగు ప్రయాణంలో కొత్తఅగ్రహారం వద్దకు వచ్చేసరికి వాహనంపై నుంచి జారిపడింది. తలకు బలమైన గాయం కావడం వల్ల విపరీతమైన రక్తస్రావంతో ఆమె అక్కడికక్కడే దుర్మరణం చెందింది. శవ పంచనామా నిమిత్తం టెక్కలి జిల్లా ఆసుపత్రికి తరలించారు. సరోజినీ సోదరుడు వసంతరావు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఎస్సై మహమ్మద్‌ అమీర్‌ ఆలీ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.


ఫార్మా పరిశ్రమలో ప్రమాదం

నలుగురికి గాయాలు

రణస్థలం, న్యూస్‌టుడే: ప్రారంభానికి సిద్ధంగా ఉన్న శ్రేయాస్‌ ఫార్మా పరిశ్రమలో శుక్రవారం మధ్యాహ్నం ప్రమాదం జరిగి నలుగురికి గాయాలయ్యాయి. పోలీసులు కథనం మేరకు.. పరిశ్రమలో ట్రయల్‌ రన్‌ వేస్తుండగా బొగ్గు నుంచి పౌడరు తీసే బ్రాయిలరు వద్ద ప్రమాదవశాత్తూ మంటలు చెలరేగడంతో కంచిలికి చెందిన జానకి ప్రధాన్‌, మద్ది దాలయ్య, ఝార్ఖండ్‌కు చెందిన నకుల్‌కుమార్‌పాల్‌, విశాఖకు చెందిన మణికంటస్వామికి గాయాలయ్యాయి. వీరిని పరిశ్రమ యాజమాన్యం విశాఖలోని ప్రైవేటు ఆసుపత్రిలో చేర్చి చికిత్స అందిస్తుంది. శుక్రవారం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై గోవిందరావు తెలిపారు.


30 మేకల అపహరణ

సారవకోట, న్యూస్‌టుడే: మండలంలోని జమచక్రం పంచాయతీ రామచంద్రాపురం గ్రామంలో దండుపాటి సింహాచలంనకు చెందిన 30 మేకలు అపహరణకు గురయ్యాయి. వాటిని పెంచుతూ కుటుంబాన్ని పోషించుకుంటున్న ఈయన ఎప్పటి మాదిరిగా తన ఇంటికి సమీపంలో ఉన్న శాలలో గురువారం రాత్రి వాటిని ఉంచారు. శుక్రవారం ఉదయం లేచి చూసేసరికి ఒక్క మేక కూడా శాలలో లేదు. సాలకు ఉన్న తలుపు తీసి ఉండటంతో బయటకు వెళ్లిపోయి ఉంటాయని భావించి స్థానిక, పరిసర గ్రామాల్లో వెదికినప్పటికీ ఫలితం లేకపోయింది. రూ.5 లక్షల విలువ గల మేకలను దొంగలు ఎత్తుకుపోయారని గుర్తించి లబోదిబోమన్నారు. సారవకోటలోని పోలీస్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఈ విషయాన్ని సర్పంచి మెండ సంధ్యకు, పెద్దలకు తెలియజేశారు. పోలీసులు రామచంద్రాపురం గ్రామానికి వెళ్లి పరిశీలించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని