logo

ఉప్పుగెడ్డపై వంతెన.. ఉత్తమాటేనా?

వైకాపా ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక తెదేపా హయాంలో ప్రారంభించిన పనులను ఎలాగో గాలికొదిలేసింది. కనీసం వారి పాలనలో చేపట్టిన పనులను సైతం పూర్తి చేయలేకపోయారు.

Published : 28 Apr 2024 03:50 IST

మూడేళ్లుగా ముందుకు సాగని పనులు

శిలాఫలకాన్ని ఆవిష్కరిస్తున్న ధర్మాన ప్రసాదరావు, సీదిరి అప్పలరాజు (పాతచిత్రం)

న్యూస్‌టుడే, గార: వైకాపా ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక తెదేపా హయాంలో ప్రారంభించిన పనులను ఎలాగో గాలికొదిలేసింది. కనీసం వారి పాలనలో చేపట్టిన పనులను సైతం పూర్తి చేయలేకపోయారు. బిల్లుల చెల్లింపులో జరుగుతున్న జాప్యం కారణంగా.. ప్రభుత్వంపై విశ్వసనీయత లేక గుత్తేదారులు పనులు చేపట్టేందుకు ఆసక్తి కనబరచడం లేదు. ఫలితంగా చాలా చోట్ల ఎక్కడి పనులు అక్కడే నిలిచిపోయాయి. అందుకు ఉదాహరణే గార మండలంలో ఉప్పుగెడ్డ వంతెన నిర్మాణ పనులు. మొదలుపెట్టి మూడేళ్లయినా కనీసం పునాదుల స్థాయి కూడా దాటలేదు.

గార మండలం బలరాంపురం, శ్రీకూర్మం పంచాయతీ పడపానపేట గ్రామాల మధ్య ఉన్న ఉప్పుగెడ్డపై వంతెన నిర్మించాలని నిర్ణయించారు. వంతెన, రహదారి నిర్మాణానికి నేషనల్‌ సెంటర్‌ ఫర్‌ సస్టయినబుల్‌ ఆక్వాకల్చర్‌, సముద్ర ఉత్పత్తుల ఎగుమతి అభివృద్ధి సంస్థ (ఎంపీఈడీఏ) ఆర్థిక సహకారంతో సుమారు రూ.4 కోట్లతో అంచనాలు రూపొందించారు. ఆ మేరకు 2021 డిసెంబరులో మంత్రి అప్పలరాజు, అప్పుడు ఎమ్మెల్యేగా ఉన్న ప్రస్తుత మంత్రి ధర్మాన ప్రసాదరావు ఆర్భాటంగా పనులు ప్రారంభానికి భూమిపూజ చేశారు. శిలఫలకాన్ని సైతం ఆవిష్కరించారు. వంతెన పూర్తయితే సముద్ర తీర గ్రామాలకు రవాణా సదుపాయం మెరుగవుతుందని, జిల్లా కేంద్రానికి వెళ్లేందుకు దూరం తగ్గుతుందని స్థానికులు, రొయ్యల వ్యాపారులు ఆశపడ్డారు. కానీ ఇప్పటికీ నెరవేరకుండానే పోయింది..

కొలిక్కిరాని స్థల సేకరణ..

శ్రీకూర్మం పంచాయతీ పడపానపేట గ్రామం నుంచి గెడ్డ వరకు 1,744 మీటర్లు మేర మట్టిదారి నిర్మించారు. వంతెనకు మరో వైపు బలరాంపురం ప్రధాన రహదారి వరకు మరో రెండున్నర కి.మీ. రోడ్డు వేసేందుకు భూ సర్వే చేశారు. దానికి స్థానిక రైతులు అభ్యంతరాలు తెలిపారు. అక్కడి నుంచి ప్రక్రియ ముందుకు సాగలేదు. స్థల సేకరణపై స్పష్టత రాకపోవడంతో పనులు ప్రారంభించి మూడేళ్లవుతున్నా.. ఇంకా పునాదులు స్థాయిలోనే ఉండిపోయాయి. ప్రభుత్వ కాలపరిమితి పూర్తయినా వంతెన నిర్మించకపోయారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని