logo

Sasikala: శశికళపై అనుమానం అప్పుడొచ్చింది!

జయలలిత మరణించినట్లుగా అధికారికంగా 2016 డిసెంబరు 5న ప్రకటించారు. ఆ తర్వాత అన్నాడీఎంకే పార్టీ పగ్గాలు చేతులు మారడం, మధ్యలో అనేక నాటకీయ, రాజకీయ పరిణామాలు చోటుచేసుకున్నాయి.

Updated : 24 Oct 2022 12:37 IST

80 రోజుల తర్వాత ఆమెపై కమిషన్‌ దృష్టి
సాక్షుల జాబితా పెంచుకుంటూ వెళ్లిన వైనం

తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత మృతిపై విచారణ చేపట్టిన జస్టిస్‌ ఆరుముగస్వామి కమిషన్‌కు మొదట్లో ఇచ్చిన గడువు కేవలం 3 నెలలు. కానీ ఆ తర్వాత గడువు పొడిగింపులు చాలాకాలం సాగాయి. ఏకంగా 59 నెలల పాటు వారు ఏకబిగిన విచారణ జరిపారు. వారు జరిపిన విచారణ తీరుచూస్తే.. ఎక్కడెక్కడ మలుపు తిరిగిందీ ఓ అవగాహనకు వస్తుంది.
- ఈనాడు-చెన్నై

జయలలిత మరణించినట్లుగా అధికారికంగా 2016 డిసెంబరు 5న ప్రకటించారు. ఆ తర్వాత అన్నాడీఎంకే పార్టీ పగ్గాలు చేతులు మారడం, మధ్యలో అనేక నాటకీయ, రాజకీయ పరిణామాలు చోటుచేసుకున్నాయి. ఆమె మృతిపై విచారణకు కమిషన్‌ను వేయాలనే డిమాండ్లు వచ్చాయి. పార్టీ సభ్యుడు పి.ఎ.జోసెఫ్‌ కోర్టును కూడా ఆశ్రయించారు. సుప్రీంకోర్టు విశ్రాంత న్యాయమూర్తులతో కమిషన్‌ వేయాలని పిటిషన్‌లో తెలిపారు. పార్టీలో కుదుపు రావడంతో ఒ.పన్నీరుసెల్వం యుద్ధం మొదలుపెట్టారు. జయ మృతిపై అనుమానాలున్నాయని పేర్కొంటూ 2017 ఫిబ్రవరిలో ‘ధర్మయుద్ధం’ మొదలుపెట్టారు. దీంతో అప్పటి అన్నాడీఎంకే ప్రభుత్వంపై తీవ్ర ఒత్తిడి పెరిగింది. ప్రజల్లోనూ నానాటికీ అనుమానాలు పెరగడంతో.. 2017 సెప్టెంబరు 27న కమిషన్‌ని ఏర్పాటు చేస్తున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం జీవో ప్రకటించింది. అదే నెల 30న జస్టిస్‌ ఆరుముగస్వామి నేతృత్వంలో కమిషన్‌ ఏర్పడింది.

అంతా వారి గుప్పిట్లోనే..
సీఎస్‌, ప్రభుత్వ వైద్యుల విచారణలో లోతుగా వెళ్లేకొద్దీ.. కమిషన్‌కు ఓ విషయం బాగా అర్థమైంది. వీరికన్నా ముందు ప్రశ్నించాల్సినవారు మరికొందరున్నారని. జయలలితకు అందిన వైద్యం విషయంలో శశికళతో పాటు అపోలో ఆసుపత్రికి మాత్రమే అవగాహన ఉందని తెలిసింది. అప్పటికే 80 రోజుల పాటు కమిషన్‌ విచారణ జరిపింది. ఆ తర్వాత శశికళ పేరును జాబితాలో ఎక్కించారు. సెక్షన్‌ 8బీ కింద డిసెంబరు 21న శశికళకు, అపోలో ఛైర్మన్‌కు నోటీసులు జారీచేశారు. అపోలో ఛైర్మన్‌ ప్రతాప్‌ సి.రెడ్డి ఆసుపత్రి వైద్యుల పేరుతో రాతపూర్వకంగా ఇచ్చారు. అఫిడవిట్‌ను కూడా 2018 మార్చిలో ఇచ్చారు.

లోపాలు బయటపడిందిలా..
జయ ఆరోగ్యం అంతా బాగుందని బయటికి చెప్పినా.. ఆసుపత్రిలో మాత్రం జయ ఆరోగ్యం క్షీణించడం, మరణవార్త బయటికిరావడం పెద్ద అనుమానాలకు తావించ్చింది. ఎవరో కుట్రపన్నారనే వాదనలూ వచ్చాయి. ఈ నేపథ్యంలో అప్పటి రాష్ట్ర ఆరోగ్యశాఖ కార్యదర్శి డాక్టర్‌ జె.రాధాకృష్ణన్‌ పేరునూ విచారణ జాబితాలోకి తెచ్చి మాట్లాడారు. ఇందులో మరిన్ని కీలక విషయాలు బయటపడ్డాయి. కమిషన్‌ ప్రశ్నలకు వచ్చిన సమాధానం ప్రకారం.. ఆసుపత్రిలో జయలలితకు అందించిన వైద్యంలో లోపాలున్నాయని స్పష్టతకు వచ్చారు. దీంతో మరిన్ని అనుమానాలు కమిషన్‌ ప్రశ్నల జాబితాలోకి వచ్చాయి. దీంతో మరింతమందిని విచారించాలని నిర్ణయించుకుంది. మరోవైపు విచారణలో భాగంగా శశికళ వేసిన ఓ దరఖాస్తును కమిషన్‌ 2018 డిసెంబరు 20న పరిగణలోకి తీసుకుంది. అందులోని సాక్షులకు అదేరోజు సమన్లు జారీచేసింది. ఇందులో తేలిన విషయాల ద్వారా మరింత స్పష్టత అవసరమని కమిషన్‌ భావించింది. దీంతో విచారణ గడవును పొడిగించేందుకు అనుమతి తీసుకుంది.

159 మంది సాక్షులు
*విచారణలో కీలక విషయాలు బయటపడుతుండటంతో అపోలో ఆసుపత్రి ఇరకాటంలో పడినట్లుగా వాదనలు వినిపించాయి. ఈ నేపథ్యంలో వారు ఓ దరఖాస్తు పెట్టి మెడికల్‌ బోర్డు నుంచి 21 మంది విభాగాల నిపుణుల్ని కమిటీగా వేయాలని అభ్యర్థించినట్లు కమిషన్‌ తెలిపింది. వాటిని కమిషన్‌ తిరస్కరించింది. దీంతో ఆసుపత్రి యజమాన్యం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. దాన్ని కూడా సుప్రీంకోర్టు 2021 నవంబరు 20న కొట్టివేసింది.
* దీంతో విచారణ మరింత ముందుకెళ్లింది. సాంకేతికంగా వైద్యంపై మెడికల్‌బోర్డు నివేదిక కూడా అవసరమని భావించిన కమిషన్‌.. దాన్ని కూడా తెప్పించుకుంది. ఇలా ఎంతముందుకెళ్లినా.. తమ ప్రశ్నలకు సమగ్రమైన సమాధానాలు రాకపోవడంతో కమిషన్‌ గడువు పెంచుకుంటూ వెళ్లారు.
* కమిషన్‌ ప్రశ్నలకు రావాల్సిన సమాధానాలు, మరోవైపు వివిధ పిటిషన్లలో వచ్చిన సాక్షుల పేర్లు.. ఇలా మొత్తం అందరినీ కలిపి 159 మందిని విచారణ పరిధిలోకి తీసుకున్నట్లు నివేదికలో వెల్లడించారు. పైగా కమిషన్‌కు వివిధ పోలీస్‌స్టేషన్ల నుంచి 302 ఫిర్యాదులొచ్చాయి. 30 మంది నుంచి అఫిడవిట్‌లు అందాయి. అనంతరం ఎట్టకేలకు తమ విచారణని ముగించి ఈ ఏడాది ఆగస్టు 27న నివేదికను ప్రభుత్వానికి సమర్పించారు.

మొదట్లో 13 మంది పేర్లే..
రాష్ట్ర ప్రభుత్వం మొదట్లో 3 నెలల్లో విచారణ పూర్తిచేసి నివేదిక ఇవ్వాలని కమిషన్‌కు గడువు నిర్ణయించారు. 2017 నవంబరు 1న కమిషన్‌ ఓ ప్రకటన చేసింది. జయ మృతికేసులో ఎవరెవరికైతే అవగాహన ఉందో వాటిని అఫిడవిట్‌ రూపంలో దాఖలు చేయాలని చెప్పింది. వీటిని స్కూట్నీ చేసిన తర్వాత అదే నెల 22 నుంచి విచారణ మొదలుపెట్టింది. ప్రాథమికంగా కేసు మీద అవగాహనకు వచ్చాక.. 13 మందిని విచారించాలని భావించారు. ఇందులో ప్రముఖంగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, అపోలో ఆసుపత్రిలో అప్పట్లో ఉన్న ప్రభుత్వ ప్యానల్‌ డాక్టర్లు ఉన్నారు. వీరితో సమగ్రంగా మాట్లాడి వివరాలు సేకరించారు.

జస్టిస్‌ ఆరుముగస్వామి

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని