logo

పార్టీలు కొత్త గుర్తులతో పోటీ చేయాలి: సీమాన్‌

నామ్‌ తమిళర్‌ కట్చి(ఎన్టీకే)కి జాతీయ మృగమైన పులిని తమ ఎన్నికల గుర్తుగా కేటాయించాలని కోరనున్నామని ఆ పార్టీ చీఫ్‌ కన్వీనర్‌ సీమాన్‌ తెలిపారు. చెన్నై ప్రెస్‌క్లబ్‌లో బుధవారం ఆయన మీడియా ప్రతినిధులతో సమావేశమయ్యారు.

Published : 28 Mar 2024 00:16 IST

ఎన్నికల గుర్తు చూపుతున్న సీమాన్‌ తదితరులు

చెన్నై, న్యూస్‌టుడే: నామ్‌ తమిళర్‌ కట్చి(ఎన్టీకే)కి జాతీయ మృగమైన పులిని తమ ఎన్నికల గుర్తుగా కేటాయించాలని కోరనున్నామని ఆ పార్టీ చీఫ్‌ కన్వీనర్‌ సీమాన్‌ తెలిపారు. చెన్నై ప్రెస్‌క్లబ్‌లో బుధవారం ఆయన మీడియా ప్రతినిధులతో సమావేశమయ్యారు. కూటమి ఏర్పాటు చేసి ఉంటే తాము కోరిన ఎన్నికల గుర్తు కచ్చితంగా లభించి ఉండేదని సీమాన్‌ తెలిపారు. ఎన్నికల కమిషన్‌, సీబీఐ వంటి సంస్థలు స్వతంత్రంగా వ్యవహరించడం లేదని ఆరోపించారు. దేశంలో మంచి రాజకీయాలు తీసుకురావాలని ఆశిస్తున్నానని తెలిపారు. తన పార్టీ అభ్యర్థులు 40 మంది కూడా చెరకు రైతు గుర్తుతోనే పోటీ చేయాలని చివరి వరకు న్యాయ పోరాటం చేశామని పేర్కొన్నారు. అది సాధ్యపడకపోవడంతో ఎన్నికల కమిషన్‌ కేటాయించిన మైక్‌ గుర్తుతో బరిలో ఉన్నామని తెలిపారు. ఎట్టి పరిస్థితుల్లోనూ, ఎవరితోనూ కూటమి ఏర్పాటు చేయకూడదనే విషయంలో దృఢంగా ఉన్నామని చెప్పారు. 7శాతం ఓటు బ్యాంకు ఉన్న తమను చూసి పెద్దపెద్ద రాజకీయ పార్టీలు సైతం భయపడుతున్నాయని తెలిపారు. ఎన్నికల్లో రాజకీయ పార్టీలు కొత్త గుర్తులు లేదంటే నంబర్లతో పోటీ చేయాలని, అప్పుడే నిజమైన బలం తెలుస్తుందని పేర్కొన్నారు. భాజపా పోటీ చేస్తున్న నియోజకవర్గాల్లో బలమైన అభ్యర్థులను డీఎంకే బరిలోకి దించలేదని అభిప్రాయపడ్డారు. అనంతరం తమ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోను సీమాన్‌ విడుదల చేశారు. అందులో సంస్కరణలు, ఎన్నికల్లో రాజకీయ పార్టీలకు గుర్తులు ఉండకూడదని, ఈవీఎం యంత్రాలను నిషేధించాలని తదితర పలు అంశాలు ఉన్నాయి.

 
Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని