logo

వేర్వేరు ఘటనల్లో ముగ్గురి దుర్మరణం

జిల్లాలో వేర్వేరు ఘటనల్లో ముగ్గురు మృతి చెందారు. అనకాపల్లి రైల్వేస్టేషన్‌లో రైలు ఢీకొని గురువారం ఒప్పంద పారిశుద్ధ్య కార్మికుడు మృతి చెందారు. దువ్వాడ జీఆర్పీ ఎస్సై

Published : 21 Jan 2022 04:10 IST


అప్పారావు (పాతచిత్రం)

లక్ష్మీదేవిపేట(అనకాపల్లి), న్యూస్‌టుడే: జిల్లాలో వేర్వేరు ఘటనల్లో ముగ్గురు మృతి చెందారు. అనకాపల్లి రైల్వేస్టేషన్‌లో రైలు ఢీకొని గురువారం ఒప్పంద పారిశుద్ధ్య కార్మికుడు మృతి చెందారు. దువ్వాడ జీఆర్పీ ఎస్సై కె.శాంతారాం తెలిపిన వివరాల ప్రకారం.. స్థానిక శ్రీరామనగర్‌కు చెందిన పెద్దాడ అప్పారావు(43) స్టేషన్‌లో గురువారం మూడో నంబరు ప్లాట్‌ఫాం పట్టాలపై చెత్తను శుభ్రం చేసి ట్రాక్‌ దాటుతుండగా ఏపీ ఎక్స్‌ప్రెస్‌ ఢీకొట్టడంతో మృతి చెందారు. అప్పారావు భార్య గతంలోనే చనిపోవడంతో ఇద్దరు పిల్లలను చదివిస్తూ కుటుంబాన్ని నెట్టుకొస్తున్నారు. బాధిత కుటుంబానికి పరిహారం చెల్లించాలని మృతుడి కుటుంబసభ్యులు గుత్తేదారుడితో వాగ్వాదానికి దిగారు. పోలీసులు జోక్యం చేసుకొని సర్ది చెప్పారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై తెలిపారు.

కొక్కిరాపల్లిలో వాహనం ఢీకొని..
ఎలమంచిలి గ్రామీణం: కొక్కిరాపల్లి కూడలి వద్ద గుర్తుతెలియని వాహనం ఢీకొని ఒకరు మృతి చెందినట్లు గ్రామీణ ఎస్‌ఐ సన్నిబాబు తెలిపారు. 30 ఏళ్లు వయసు కలిగి తెల్లరంగు చొక్కా ధరించి ఉన్నాడని, వివరాలు తెలిసిన వారు  పోలీసుస్టేషన్‌లో సంప్రదించాలన్నారు.  

చికిత్స పొందుతూ వృద్ధురాలు..
అనకాపల్లి పట్టణం: తుమ్మపాలలో ఈనెల 15న అగ్ని ప్రమాదంలో గాయపడిన వృద్ధురాలు పీలా లక్ష్మి (65) చికిత్స పొందుతూ మృతిచెందింది. పట్టణ ఎస్సై ధనుంజయ్‌ కథనం ప్రకారం.. చీర కొంగుతో గ్యాస్‌ స్టౌవ్‌ నుంచి టీ పాత్ర తీస్తుండగా చీరకు మంటలు అంటుకుని గాయపడింది. చికిత్స నిమిత్తం కేజీహెచ్‌కు తరలించగా గురువారం మృతిచెందింది. ఈమె కుమార్తె అన్నపూర్ణ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదుచేసినట్లు ఎస్సై తెలిపారు.  


సబ్‌జైలు హెడ్‌ వార్డర్‌ మృతి

తెనాలి టౌన్‌, న్యూస్‌టుడే: గుంటూరు జిల్లా తెనాలి సబ్‌ జైలు హెడ్‌ వార్డర్‌ కృష్ణారెడ్డి (60) గురువారం మృతిచెందారు. తాను నివసించే క్వార్టరు మెట్ల వద్ద ఈయన మృతిచెంది ఉండడాన్ని తోటి ఉద్యోగులు గుర్తించారు. 2019లో ఈయన బదిలీపై ఇక్కడికి వచ్చారు. పిల్లల చదువుల నేపథ్యంలో కుటుంబం విశాఖపట్నంలో ఉంటోంది. భార్య అప్పుడప్పుడూ ఇక్కడికి వచ్చి వెళుతుంటారు. సంక్రాంతి పండుగకు కూడా ఆమె వచ్చి ఈ నెల 16న తిరిగి వెళ్లారు.  పోలీసులు కేసు నమోదు చేశారు. కృష్ణారెడ్డి కుటుంబసభ్యులు తెనాలి చేరుకున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని