logo

ఏలేరు కాలువలో పడి వ్యక్తి మృతి

కొప్పాక వద్ద ఏలేరు కాలువలో ప్రమాదవశాత్తు జారిపడి వ్యక్తి మృతిచెందాడు. గ్రామీణ పోలీస్‌స్టేషన్‌ ఎస్సై సీహెచ్‌.నర్సింగరావు తెలిసిన వివరాల ప్రకారం... గాజువాకలోని కణితి రోడ్డులో నివసిస్తున్న బొబ్బాది వెంకటేశ్వరరావు

Published : 20 May 2022 04:54 IST

బొబ్బాది వెంకటేశ్వరరావు (పాతచిత్రం)

అనకాపల్లి పట్టణం, న్యూస్‌టుడే: కొప్పాక వద్ద ఏలేరు కాలువలో ప్రమాదవశాత్తు జారిపడి వ్యక్తి మృతిచెందాడు. గ్రామీణ పోలీస్‌స్టేషన్‌ ఎస్సై సీహెచ్‌.నర్సింగరావు తెలిసిన వివరాల ప్రకారం... గాజువాకలోని కణితి రోడ్డులో నివసిస్తున్న బొబ్బాది వెంకటేశ్వరరావు (48) తోపుడుబండి వ్యాపారం చేసుకుంటూ జీవిస్తున్నారు. ఈనెల 18న ఇంటి నుంచి ద్విచక్రవాహనంపై బయలుదేరి అనకాపల్లి వచ్చారు. మార్గమధ్యలో కొప్పాక ఏలేరు కాలువ వద్ద కాలకృత్యాలకు ఆగి ప్రమాదవశాత్తు జారిపడడంతో మృతిచెందినట్లు పోలీసులు నిర్థారించారు. గురువారం మృతదేహం లభ్యమవ్వడంతో పోస్టుమార్టం నిమిత్తం ఎన్టీఆర్‌ జిల్లా ఆసుపత్రికి తరలించారు. వెంకటేశ్వరరావుకు భార్య, కుమార్తె ఉన్నారు. భార్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నట్లు గ్రామీణ పోలీస్‌స్టేషన్‌ ఎస్సై తెలిపారు.


సముద్రంలో విద్యార్థి గల్లంతు

ఆకుల పురుషోత్తం (పాతచిత్రం)

భీమునిపట్నం, న్యూస్‌టుడే: పరీక్షలు ముగియడంతో స్నేహితులతో కలిసి సరదాగా సముద్ర స్నానానికి వచ్చి ఓ విద్యార్థి కెరటాల ధాటికి గల్లంతయ్యాడు. దీనికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. ఉమ్మడి విజయనగరం జిల్లా డెంకాడ మండలం మోపాడ గ్రామానికి చెందిన ఆకుల పురుషోత్తం(17) అక్కివరం ఏపీ మోడల్‌ కళాశాలలో ఇంటర్‌ ద్వితీయ సంవత్సరం చదువుతున్నాడు. గురువారంతో పరీక్షలు ముగియడంతో తోటి విద్యార్థినులు, విద్యార్థులతో కలిసి భీమిలి తీరానికి వచ్చాడు. వీరిలో పురుషోత్తం, సంతోష్‌కుమార్‌ నీళ్లల్లోకి దిగారు. బలమైన కెరటం పురుషోత్తంను లోపలికి నెట్టేయగా.. సంతోష్‌కుమార్‌ అదృష్టవశాత్తు బయటపడ్డాడు. గల్లంతైన విద్యార్థి పురుషోత్తం  తండ్రి నారాయణరావు భీమిలి మండలం చిప్పాడ దివీస్‌ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నారు. కుమారుడు గల్లంతయ్యాడని తెలిసి కుటుంబ సభ్యులు తీరానికి వచ్చి చేసిన రోదనలు కంటతడిపెట్టించాయి. విద్యార్థి కోసం గాలిస్తున్నామని.. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సి.ఐ. జి.వి.రమణ తెలిపారు.


నకిలీ నోట్లు చలామణి చేస్తున్న ఇద్దరి అరెస్టు

వరంగల్‌క్రైం, న్యూస్‌టుడే: నకిలీ కరెన్సీ నోట్లను చలామణి చేస్తున్న గనిశెట్టి నగేశ్‌, గొర్రెల మురళీమోహన్‌లను సీసీఎస్‌, మట్టెవాడ పోలీసులు గురువారం అరెస్టు చేశారు. వరంగల్‌ కమిషనరేట్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సీపీ తరుణ్‌జోషి ఈ వివరాలను వెల్లడించారు. విశాఖపట్నానికి చెందిన గనిశెట్టి నగేశ్‌ ఏసీ మెకానిక్‌గా, రాజమండ్రి దవళేశ్వరంలోని రథం వీధికి చెందిన గొర్రెల మురళీమోహన్‌ కారు డ్రైవర్‌గా పని చేస్తున్నారు. జల్సాలకు అలవాటు పడిన వీరు సులువుగా డబ్బులు సంపాదించాలనుకున్నారు. ఈ క్రమంలో హైదరాబాద్‌ ఫిలింనగర్‌లోని బార్‌లో వాజేడు మండలం చింతూరు గ్రామానికి చెందిన పేడిచర్ల మోహన్‌తో వీరిద్దరికి పరిచయం ఏర్పడింది. తమ వద్ద నకిలీ నోట్లు ఉన్నాయని అసలు నోట్లకు మూడింతల నకిలీ నోట్లు ఇస్తామని నగేశ్‌, మురళీమోహన్‌ చెప్పారు. దీంతో వరంగల్‌లోని ఎంజీఎం ఆసుపత్రి వద్దకు రమ్మని పేడిచర్ల మోహన్‌ చెప్పడంతో గురువారం వారిద్దరూ వరంగల్‌కు వచ్చారు. సమాచారం అందుకున్న సీసీఎస్‌, మట్టెవాడ పోలీసులు వారిద్దరిని పట్టుకొని వారి వద్ద 30 నకిలీ నోట్ల కట్టలు, అయోడిన్‌, టోనర్‌ సీసాలను స్వాధీనం చేసుకున్నారు. .
మోసం చేసేది ఇలా..  
అసలు కరెన్సీకి ముందుగా అయోడిన్‌, టోనర్‌ పూసి నల్లగా మారుస్తారు. వాటిని నీటితో కడిగితే అసలు నోట్లు కనిపిస్తాయి. నిందితులిద్దరూ ఇలా కొన్ని అసలు నోట్లను తీసుకొని నల్లగా మారుస్తారు. వీటికి నకిలీ నోట్లను కూడా జత చేస్తారు. కట్టపైన ఉన్న నాలుగైదు నోట్లను తీసి ముందుగా నీటితో కడుగుతారు. అవి అసలు నోట్లు కావడంతో నల్లరంగు పోయి అసలు నోట్లుగా కనిపిస్తాయి. అన్నీ ఇలాగే ఉంటాయని తొందరపెట్టి అసలు నోట్లతో పాటు నకిలీ నోట్లు ఇస్తారు. ఇలా మోసానికి పాల్పడతారు. నిందితులను పట్టుకోవడంలో ప్రతిభ కనబర్చిన అదనపు డీసీపీ కె.పుష్పారెడ్డి, ఏసీపీ డేవిడ్‌రాజు, సీసీఎస్‌ ఇన్‌స్పెక్టర్లు ఎల్‌.రమేశ్‌కుమార్‌, శ్రీనివాస్‌రావు, మట్టెవాడ ఇన్‌స్పెక్టర్‌ సీహెచ్‌ రమేశ్‌, ఎస్సై కొమురెల్లి, సీసీఎస్‌ ఏఎస్సైలు కె.శివకుమార్‌, పి.శ్రీనివాస్‌రాజులను సీపీ తరుణ్‌జోషి అభినందించారు.


40 కిలోల గంజాయి స్వాధీనం

ఎం.వి.పి.కాలనీ, న్యూస్‌టుడే: అక్రమంగా రవాణా చేస్తున్న గంజాయిని టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు స్వాధీనం చేసుకుని, నలుగురిని అదుపులోకి తీసుకున్నారు. దీనికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. ఏజెన్సీ ప్రాంతం నుంచి గంజాయి అక్రమ రవాణా జరుగుతుందన్న సమాచారంతో అన్ని ప్రాంతాల్లోనూ నిఘా ఉంచారు. అందులో భాగంగా తనిఖీ చేస్తుండగా రైల్వేన్యూకాలనీలో జరిపిన తనిఖీల్లో గంజాయిని గుర్తించారు. మహారాష్ట్రకు చెందిన జహీర్‌ ఖాన్‌ రెహ్మాత్‌ ఖాన్‌, షేక్‌ మొహ్సేన్‌, విజయ్‌ మనోహర్క్‌ హారానా, హైదరాబాద్‌కు చెందిన మహ్మాద్‌ షఫీఖాన్‌లను అదుపులోకి తీసుకుని వీరి నుంచి 40 కిలోల గంజాయి, రెండు ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసి నాల్గో పట్టణ పోలీసుస్టేషన్‌కు అప్పగించగా సి.ఐ. సాయి దర్యాప్తు చేస్తున్నారు.

 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని