logo

అమ్మఒడి.. తడబడి..!

ప్రభుత్వ విభాగంలో పనిచేస్తూ నెలకు రూ.10 వేలు ఆదాయం మించిన వారందరిని అనర్హులుగా చూపిస్తున్నారు. దీనివల్ల అంగన్‌వాడీ కార్యకర్తల పిల్లలకు సాయం అందకుండా పోతుందని వారు ఆవేదన

Updated : 23 May 2022 04:29 IST

రెండేళ్లలో రూ.2 వేల కోత

నిబంధనలతో ఉక్కిరిబిక్కిరి..

ఈనాడు డిజిటల్‌, అనకాపల్లి

పేదరికం కారణంగా పిల్లలు చదువుకు దూరం కాకూడదనే ఉద్దేశంతో ప్రభుత్వం తీసుకొచ్చిన అమ్మఒడి పథకం తడబడుతోంది. మొదటి ఏడాది రూ.15 వేల ఆర్థిక సాయం అందించిన సర్కారు రెండో ఏడాదికి వచ్చేసరికి రూ.14 వేలే ఇచ్చారు. తాజాగా ఈ ఏడాదికి వచ్చేసరికి సాయం అందించాల్సిన గడువును ఆరు నెలలు పొడిగించడంతో పాటు మరో రూ.వెయ్యి కోతపెట్టి రూ.13 వేలే జమ చేస్తామంటోంది. పైగా లబ్ధిదారుల గుర్తింపునకు పెట్టే నిబంధనలు తల్లిదండ్రులను కలవరపెడుతున్నాయి. గతం కంటే ఈ ఏడాది అమ్మఒడి లబ్ధిదారులు తగ్గే అవకాశాలున్నాయని ఉపాధ్యాయ వర్గాలే చెబుతున్నాయి.

* ప్రభుత్వ విభాగంలో పనిచేస్తూ నెలకు రూ.10 వేలు ఆదాయం మించిన వారందరిని అనర్హులుగా చూపిస్తున్నారు. దీనివల్ల అంగన్‌వాడీ కార్యకర్తల పిల్లలకు సాయం అందకుండా పోతుందని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ఉమ్మడి జిల్లాలో 2020-21 విద్యా సంవత్సరంలో 4.10 లక్షల మంది విద్యార్థులకు అమ్మఒడి సాయం రూ.14 వేలు చొప్పున అందజేశారు. పాఠశాలల్లో మరుగుదొడ్ల నిర్వహణ కోసం రూ.వెయ్యి మినహాయించుకున్నారు. 2021-22 విద్యా సంవత్సరానికి సంబంధించిన అమ్మఒడి సాయం జనవరిలో కాకుండా జూన్‌కు పొడిగించారు. అయితే మొదటి ఏడాది కంటే రెండో ఏడాది లబ్ధిదారులు ఎలా పెరిగారంటూ గతేడాది జూన్‌లో ప్రత్యేక సర్వే చేపట్టారు. అనకాపల్లి, పరవాడ, ఎస్‌.రాయవరం, చీడికాడ, బుచ్చెయ్యపేట, నర్సీపట్నం వంటి చోట్ల కొంతమంది అనర్హులకు ఈ సాయం అందినట్లు గుర్తించారు. ఆ తర్వాతే పథకం పొందడానికి 75 శాతం హాజరుతో పాటు మరికొన్ని నిబంధనలు పెట్టినట్లు తెలుస్తోంది. అమ్మఒడి సాయం ఆరునెలలు ఆలస్యమైనా వచ్చేనెలలో అందుతుందని బాలల తల్లులు ఎదురుచూస్తున్నారు. ఈ సమయంలో పాఠశాలల్లో మౌలిక సదుపాయాల నిర్వహణ కోసమంటూ మరో రూ.వెయ్యి కత్తిరించడానికి సిద్ధమవుతున్నారు. మరోవైపు సుమారు 60 వేల మంది విద్యార్థులు ఈ ఏడాది అమ్మఒడికి బదులు ల్యాప్‌టాప్‌లు ఎంపిక చేసుకున్నారు. అమ్మఒడి సాయం రెండేళ్లలో రూ.2000 కోత పెట్టడంతో ల్యాప్‌టాప్‌ లబ్ధిదారులకు ఏవిధంగా కోతపెడతారోనని ఆందోళన చెందుతున్నారు.

వారికి దక్కేది అనుమానమే

* నేషనల్‌ పేమెంట్స్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా (ఎన్‌పీసీఐ)తో అనుసంధానమైన బ్యాంకు ఖాతాలకే ఆర్థిక సాయం జమచేస్తారు. అనుసంధానం కాకుంటే లబ్ధి నిలిచిపోతుంది. దీనిపై తల్లిదండ్రుల్లో చాలామందికి అవగాహన లేదు.

* బియ్యం కార్డులో తప్పనిసరిగా తల్లి, పిల్లల పేర్లు ఉండాలి. లేకుంటే సాయం అందదు. కొంతమంది పిల్లలకు తల్లిదండ్రులు లేరు. వారి సంరక్షకుల కార్డుల్లో పిల్లల పేర్లు ఉండవు. వీరిని అనర్హులుగా గుర్తించే ప్రమాదం ఉంది.

* గతేడాది కొవిడ్‌ కారణంగా ప్రైవేటు పాఠశాలల్లో నుంచి ప్రభుత్వ పాఠశాలల్లో చేరిన విద్యార్థులు వేలల్లో ఉన్నారు. వీరిలో చాలామంది తాము ముందు చదివిన పాఠశాల నుంచి టీసీలు తెచ్చుకోలేదు. ఫీజులు చెల్లిస్తేనే టీసీ ఇస్తామని ప్రైవేటు స్కూళ్ల వారు చెబుతున్నారు. దీంతో వీరి పేర్లు ఛైల్డ్‌ ఇన్‌ఫోలో నమోదు కాలేదు. వీరికి అమ్మఒడి సాయం అందుతుందో లేదో చెప్పలేమని ఉపాధ్యాయులంటున్నారు.

* విద్యుత్తు వినియోగం 300 యూనిట్లు దాటితే సాయం అందే పరిస్థితి లేదు.. అయితే మూడో విడత సాయంపై ఎంతమంది లబ్ధిదారులు, ఎంత మొత్తం సాయం అందుతుందన్న వివరాలేవీ ఇంకా రాలేదని జిల్లా విద్యాశాఖ అధికారులు చెబుతున్నారు.

 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని