logo

అడిగేస్తున్నారు.. కడిగేస్తున్నారు..?

సమస్యలు చెబితే కేసులు.. ప్రశ్నిస్తే దాడులు.. సామాజిక మాధ్యమాల్లో అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తే పోలీసు వేధింపులు... అయిదేళ్లుగా అన్నీ మౌనంగా భరించిన జనం.. ఓపిక నశించి వైకాపా అభ్యర్థులను ప్రశ్నిస్తున్నారు.

Published : 26 Apr 2024 05:09 IST

వైకాపా అభ్యర్థులను నిలదీస్తున్న ప్రజలు
జనం తిరుగుబాటుతో కంగుతింటున్న నాయకులు

సమస్యలు చెబితే కేసులు.. ప్రశ్నిస్తే దాడులు.. సామాజిక మాధ్యమాల్లో అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తే పోలీసు వేధింపులు... అయిదేళ్లుగా అన్నీ మౌనంగా భరించిన జనం.. ఓపిక నశించి వైకాపా అభ్యర్థులను ప్రశ్నిస్తున్నారు. అధికార పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడేందుకు ఇన్నాళ్లూ భయపడినవారు ప్రచారానికి వస్తున్న నాయకులకు ఉగ్రరూపాన్ని చూపుతున్నారు. మీకెందుకు ఓట్లెయ్యాలని ముఖంమీదే కడిగేస్తున్నారు. క్షేత్రస్థాయిలో వ్యతిరేకత, ప్రజాగ్రహం చూస్తున్న వైకాపా నాయకులు ఏం సమాధానం చెప్పాలో తెలియక అక్కడ్నుంచి మౌనంగా వెళ్లిపోతున్నారు.

 ఈనాడు, రాజమహేంద్రవరం


నిరసన పట్టదు గానీ ఓటెయ్యాలా..

మార్చి 23

చొల్లంగిలో ఎమ్మెల్యే పొన్నాడ సతీష్‌కుమార్‌ను నిలదీస్తున్న గ్రామస్థులు

అధికారంలో ఉంటూ మా వైపు కన్నెత్తి చూడని మీరు.. ఇప్పుడు ఓట్లు కోసం ఎందుకు వచ్చారు. ఇన్ని రోజులుగా దీక్ష చేసినా పట్టలేదు..  ఇప్పుడొచ్చి ఏం ఫలితం.

తాళ్లరేవు మండలం చొల్లంగి నుంచి ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టిన ఎమ్మెల్యే పొన్నాడ సతీష్‌కుమార్‌కు తొలిరోజే నిరసన సెగ గట్టిగా తగిలింది. చొల్లంగిలో ఇతర ప్రాంతానికి చెందిన లబ్ధిదారులకు నివాస స్థలాలు ఇవ్వొద్దని స్థానికులు 46 రోజుల పాటు నిరసన దీక్ష చేపట్టి, ఎన్నికల కోడ్‌ రావడంతో నిలుపుదల చేశారు. వీరికి పలు పార్టీల నాయకులు, ప్రజాసంఘాలు మద్దతు పలికాయి. సమస్య పరిష్కారానికి చొరవ చూపాల్సిన ఎమ్మెల్యే పట్టనట్లు వ్యవహరించారు. నిరసన వ్యక్తం చేస్తున్నవారిని అధికార పార్టీ నాయకులు వేధించడంతో వారంతా తీవ్ర ఆగ్రహానికి లోనయ్యారు. దీంతో వారంతా ప్రచారానికి వచ్చిన ఎమ్మెల్యేను ప్రశ్నించారు. అక్కడే ఉన్న వైకాపా శ్రేణులు స్థానికులపై దురుసుగా ప్రవర్తించడంతో ఉద్రిక్త పరిస్థితి ఎదురైంది.


నీకేం అర్హత ఉంది?
ఏప్రిల్‌ 1

ద్విచక్ర వాహనంపై వెళ్లిపోతున్న ఎమ్మెల్సీ

దళిత డ్రైవర్‌ను చంపి ఇప్పుడు ఓట్ల కోసం గ్రామానికి వచ్చి.. అంబేడ్కర్‌ విగ్రహానికి దండేస్తావా..
ప్రత్తిపాడు మండలం ధర్మవరంలో  అంబేడ్కర్‌ విగ్రహానికి పూలమాల వేసి ఎమ్మెల్సీ అనంతబాబుకు స్థానికుల నుంచి తీవ్ర ప్రతిఘటన ఎదురైంది. దళితులంతా ఏకమై నిలదీశారు. గ్రామస్థులు తిరుగుబాటుతో దిక్కుతోచని స్థితిలో అక్కడున్న ద్విచక్ర వాహనంపై అనంతబాబు పలాయనం చిత్తగించారు. ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో హల్‌చల్‌ చేసింది. ఎన్నికల ప్రచారంలో భాగంగా వైకాపా ఎమ్మెల్యే, ఎంపీ అభ్యర్థులతో కలిసి గ్రామానికి వచ్చిన సందర్భంలో ఈ ఘటన జరిగింది.


రోడ్డేయరు గానీ.. గెలిపించాలట!

ఏప్రిల్‌ 1

ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్థులను ప్రశ్నిస్తూ..

వైకాపా అంటే అభిమానంతో గత ఎన్నికల్లో ఓటేస్తే అయిదేళ్లుగా వీధి రోడ్డు వేయలేదు గానీ ఇప్పుడు మళ్లీ ఓట్లు అడిగేందుకు ఏ ముఖం పెట్టుకుని వచ్చారు..

ప్రత్తిపాడు మండలం ధర్మవరంలో వైకాపా ఎమ్మెల్యే అభ్యర్థి వరుపుల సుబ్బారావు, ఎంపీ అభ్యర్థి చలమలశెట్టి సునీల్‌కు స్థానిక మహిళల నుంచి ఎదురైన ప్రశ్న ఇది. మళ్లీ గెలిపించండి.. సమస్యలన్నీ పరిష్కరిస్తామంటూ నేతలు ముందుకు కదలగా మరో ప్రాంతంలోనూ అదే పరిస్థితి ఎదురైంది.


సాయంలో సగం మీ అనుచరులే దోచేస్తున్నారు

మార్చి 21

అధికారంలో ఉన్నప్పుడు మా బాగోగులు పట్టించుకోరు గానీ ఇప్పుడు ఓట్లు వేయాలట. కాకినాడలో మా ఓట్లతోనే ఎవరైనా గెలిచేది. మాకే అన్యాయం చేస్తే మేమెందుకు ఓట్లేయాలి

కాకినాడ నగరం వైకాపా అభ్యర్థి, ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖరెడ్డి గత నెల ఏటిమొగలోని ముల్లారమ్మ గుడి ప్రాంతం నుంచి ఇంటింటి ప్రచారం ప్రారంభించారు. ప్రచారం మొదలుపెట్టిన రోజే స్థానికుల నుంచి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఓట్లు అడిగేందుకు వచ్చిన ఆయన్ను మత్స్యకార మహిళలు నిలదీశారు. గత ఎన్నికల్లో మిమ్మల్ని నమ్మి గెలిపిస్తే అయిదేళ్లలో మా కోసం ఏం చేశారు.. ప్రభుత్వం అందించే పథకాల సాయంలో మీ అనుచరులే సగం దోచేస్తున్నారని ధ్వజమెత్తారు. అక్కడున్న వైకాపా నాయకుడు, మాజీ కార్పొరేటర్‌ సత్తిబాబుపై తీవ్ర ఆరోపణలు చేశారు. దీంతో ఎమ్మెల్యే కంగుతిన్నారు.


మీ గుమ్మానికి వస్తే పట్టించుకోరు కానీ...

ఏప్రిల్‌ 4

 స్థానిక సర్పంచి తీరుపై విన్నవించేందుకు మీ గుమ్మానికి వచ్చినప్పుడే పట్టించుకోలేదు.. ఇప్పుడేం చేస్తారు
కాకినాడ గ్రామీణ ఎమ్మెల్యే కురసాల కన్నబాబు ఎన్నికల ప్రచారం ప్రారంభించిన రోజే మత్స్యకార మహిళలు అడ్డుకుని నిరసన వ్యక్తం చేయడంతో కంగుతిన్నారు. నేమాంలో ప్రచార రథంపై వెళ్తుండగా స్థానికులంతా రథం ముందు నిల్చొని కదలనీయలేదు. గ్రామంలో మత్స్యకారులకు చెందిన ఆరు చెరువుల సమస్యపై స్థానిక సర్పంచి ఇబ్బందులు పెట్టారని, సమస్య విన్నవించేందుకు మీ(ఎమ్మెల్యే) కార్యాలయానికి వచ్చినా పట్టించుకోలేదని నిలదీశారు. స్థానిక చెరువులోని మట్టిని అక్రమంగా విక్రయించారని సర్పంచి తీరును దుయ్యబట్టారు. సమస్య పరిష్కరిస్తానని కన్నబాబు హామీ ఇచ్చినా.. ఇప్పుడేం చేస్తారంటూ ఆందోళన కొనసాగించారు. కాసేపటికి కన్నబాబు అక్కడ్నుంచి వెళ్లిపోయారు.


రోడ్డేస్తేనే ఓటేస్తాం

ఏప్రిల్‌ 3

  అయిదేళ్లలో మా సమస్యలు పట్టించుకోలేదు.. ఇప్పుడు మళ్లీ ఓట్లు వేయమని అడగడానికి ఎలా  వచ్చారు..
కొవ్వూరు నియోజకవర్గం తాళ్లపూడి పద్మశాలి వీధిలో వైకాపా అభ్యర్థి ఎమ్మెల్యే తలారి వెంకట్రావుకు ఎదురైన ప్రశ్న ఇది. స్థానికంగా ఉన్న మట్టి రోడ్డును అభివృద్ధి చేయకుండా ఇక్కడి వైకాపా నాయకుడు అడ్డుకున్నాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. రోడ్డేస్తేనే ఓటేస్తామని తేల్చిచెప్పారు. రోడ్డేసే బాధ్యత తీసుకుంటామని కంటితుడుపుగా చెప్పి అక్కడి నుంచి వెంకటరావు ముందుకు కదిలారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని