logo

దాతలు స్పందిస్తేనే ప్రాణం నిలిచేది!

నియోజకవర్గాల్లోని ఆరేడు మండలాలు,  అల్లూరి సీతారామరాజు జిల్లాలోని చింతపల్లి, గూడెంకొత్తవీధి, కొయ్యూరు మండలాల వారు ఎక్కువగా నర్సీపట్నం ఆసుపత్రికి వస్తుంటారు.

Updated : 02 Dec 2022 04:46 IST

రక్త నిల్వల కొరత
సామర్థ్యం 180.. ఉన్నవి నాలుగు యూనిట్లే

నర్సీపట్నం అర్బన్‌, న్యూస్‌టుడే: నర్సీపట్నం, చోడవరం, పాయకరావుపేట: నియోజకవర్గాల్లోని ఆరేడు మండలాలు,  అల్లూరి సీతారామరాజు జిల్లాలోని చింతపల్లి, గూడెంకొత్తవీధి, కొయ్యూరు మండలాల వారు ఎక్కువగా నర్సీపట్నం ఆసుపత్రికి వస్తుంటారు.  గిరిజనులు పట్టణ ప్రాంతాలకు వెళ్లి రక్తం ప్యాకెట్లు తెచ్చుకునేందుకు ఇబ్బంది పడతారన్న ఉద్దేశంతో వీలున్నంత వరకు ఇక్కడి నుంచే ఇస్తుంటారు.

నర్సీపట్నం ప్రభుత్వ ప్రాంతీయ ఆసుపత్రిలో పది రోజులుగా రక్త నిల్వలు తగ్గిపోయాయి. ఇక్కడి కేంద్రంలో 180 యూనిట్లు నిల్వ చేయడానికి వీలుంది. ‘న్యూస్‌టుడే’ పరిశీలించినప్పుడు నాలుగు యూనిట్ల రక్తమే ఉంది. ఆ సమయానికి రెండు యూనిట్ల రక్తం కావాలని వైద్యుల నుంచి సూచన ఉంది.

పాడేరు, న్యూస్‌టుడే: జిల్లా కేంద్రంలో ఉన్న రక్తనిధి కేంద్రంలో నిల్వలు అరకొరగానే ఉన్నాయి. ఇక్కడ ఐటీడీఏ ఆధ్వర్యంలో రక్తనిధి కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. అంతకు ముందు విశాఖపట్నంలో బ్లడ్‌ బ్యాంకు ద్వారా తీసుకొచ్చేవారు. స్థానికంగా అరకొరగా సేకరించిన నిల్వలను పరిశీలన నిమిత్తం విశాఖ పంపించేవారు. అక్కడి నుంచి సకాలంలో తిరిగి రాక రక్త నిల్వల కొరత తీవ్రంగా ఉండేది. ఆ తర్వాత గిరిజన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో పాడేరులో ఏడాదిన్నర కిందట రక్తనిధి కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. రక్తనిధి కేంద్రాన్ని ఏర్పాటు చేసి రక్త సేకరణకు అవసరమైన సామగ్రి సమకూర్చి సిబ్బంది నియామకాన్ని విస్మరించారు.  ఇటీవల రక్తనిధి కేంద్రంలో కొంత మంది సిబ్బంది రావడంతో పాటు స్థానిక రెడ్‌క్రాస్‌ యూనిట్‌ ఏర్పాటు చేయడంతో రక్త సేకరణ ప్రక్రియ వేగవంతం అయ్యింది. సుమారు 200 యూనిట్ల వరకు నిల్వలు ఎప్పుడూ ఉండాలి.

రక్త నమూనాను పరిశీలిస్తున్న టెక్నీషియన్‌

అనకాపల్లి మదర్‌ బ్యాంకు నుంచి నర్సీపట్నానికి రక్తం పంపుతుంటారు. రెండు రోజుల క్రితం తగినంత నిల్వ లేనందున పంపేందుకు ఇబ్బందని అక్కడి సిబ్బంది చెప్పడంతో వైద్యులు విశాఖలోని ఇండియన్‌ రెడ్‌క్రాస్‌ సొసైటీ ప్రతినిధులను సంప్రదించారు. ఆరు లేదా ఎనిమిది యూనిట్ల వరకు ఇస్తామని రెడ్‌క్రాస్‌ ప్రతినిధులు చెప్పడంతో నర్సీపట్నం నుంచి ప్రత్యేకంగా మనిషిని పంపారు.

చింతపల్లి, న్యూస్‌టుడే: చింతపల్లి ప్రాంతీయాసుపత్రి కేంద్రంలో ప్రస్తుతం ఎ పాజిటివ్‌ 1, బిపాజిటివ్‌ 2, ఓ పాజిటివ్‌ 2 యూనిట్లు ఉన్నాయి. నిల్వలు అయిపోతున్నప్పుడల్లా సిబ్బంది విశాఖలోని విక్టోరియా ఘోష ఆసుపత్రి, లేదా పాడేరు ఇండియన్‌ రెడ్‌క్రాస్‌ బ్లడ్‌ బ్యాంకు నుంచి తీసుకొస్తున్నారు.


ప్రస్తుతం ఓ పాజిటివ్‌ 9, ఏబీ పాజిటివ్‌ 8, బి పాజిటివ్‌ 12, ఓ పాజిటివ్‌ 13 వరకు ఉన్నాయి. అయితే ఇవన్నీ పరిశీలనలోనే ఉన్నాయి. మూడు రోజుల తర్వాత గానీ ఇవి అందుబాటులో రావు. నిత్యం 100 యూనిట్ల వరకు వినియోగం అవుతుండగా, రెడ్‌క్రాస్‌ ఆధ్వర్యంలో30 నుంచి 40 యూనిట్లను మాత్రమే సేకరిస్తున్నారు.


అండగా ఉండాలనే... : నర్సీపట్నం ప్రాంతీయ ఆసుపత్రిలో సెప్టెంబరు 4న రక్తదానం చేశా. అంతకు ముందూ ఒకసారి రక్తమిచ్చా. ఆరోగ్యవంతులంతా మూడు నెలలకోసారి రక్తదానం చేయొచ్చని, దీనివల్ల ఎన్నో ఉపయోగాలున్నాయని వైద్యులు చెబుతున్నారు. రక్తదానం చేస్తే నీరసపడతామన్నది అపోహే. మనమిచ్చే రక్తం కొడిగడుతున్న ఓ ప్రాణాన్ని నిలబెడుతుంది. రక్తదానం ఎంతో సంతృప్తినిస్తుంది.

ఈర్లె హేమలత, గబ్బాడ గ్రామం


శిబిరాలు నిర్వహిస్తాం : ప్రాణాలకు విలువ కట్టలేం. ప్రమాదంలో ఉండి రక్తం అవసరమయ్యే వారి ప్రాణాలను రక్తదాతలే నిలబెట్టగలరు.  నిల్వలు తక్కువగా ఉన్నందున రక్తదాన శిబిరాలను నిర్వహించాలని యోచిస్తున్నాం. దాతలు స్వచ్ఛందంగా ముందుకురావాలి. విశాఖపట్నం ఐఆర్‌సీఎస్‌ వారిని కొన్ని యూనిట్లు ఇవ్వాలని కోరాం. వారు అంగీకరించడంతో మనిషిని పంపి తెప్పిస్తున్నాం.

డాక్టర్‌ స్వాతి, రక్తనిల్వ కేంద్రం ఇన్‌ఛార్జి, నర్సీపట్నం

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని