logo

నరకయాతన!!

ఇతర జిల్లాల్లో జగన్‌ సభలు జరిగినా ఆర్టీసీ అధికారులు నగరవాసులకు చుక్కలు చూపిస్తున్నారు. రాజును మించిన రాజభక్తి ప్రదర్శిస్తున్నారు. ప్రయాణికుల గురించి పట్టించుకోకుండా వందలాది బస్సులను జగన్‌ సభలకు తరలించేస్తున్నారు.

Updated : 20 Apr 2024 05:36 IST

సీఎం జగన్‌ సేవలో ఆర్టీసీ.. జనాల పాట్లు వర్ణణాతీతం
కాకినాడ ‘సిద్ధం’ సభకు 350 సర్వీసుల తరలింపు
నడిరోడ్లపై ప్రయాణికుల పడిగాపులు
న్యూస్‌టుడే, కార్పొరేషన్‌

ఇతర జిల్లాల్లో జగన్‌ సభలు జరిగినా ఆర్టీసీ అధికారులు నగరవాసులకు చుక్కలు చూపిస్తున్నారు. రాజును మించిన రాజభక్తి ప్రదర్శిస్తున్నారు. ప్రయాణికుల గురించి పట్టించుకోకుండా వందలాది బస్సులను జగన్‌ సభలకు తరలించేస్తున్నారు.

శుక్రవారం కాకినాడలో జరిగిన మేమంతా సిద్ధం సభకు నగరం నుంచి 300 సిటీ బస్సులు, 50 దూర ప్రాంత సర్వీసులను పంపించేశారు. దీంతో నగర వాసులకు బస్సులు అందుబాటులో లేకుండా పోయాయి. ఉదయం, సాయంత్రం వేళల్లో ప్రయాణికులు గంటల తరబడి రోడ్లపై నిరీక్షించాల్సి వచ్చింది. విధులకు ఇతర ప్రాంతాలకు వెళ్లే ఉద్యోగులు, వివిధ పనులపై వెళ్లేవారు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఆటోలను ఆశ్రయించి చేతి చమురు వదిలించుకోవాల్సి వచ్చింది.

మాధవధార, మురళీనగర్‌, పెందుర్తి, కొత్తవలస, సింహాచలం, గాజువాక, మల్కాపురం, ఆరిలోవ, భీమిలి, తగరపువలస ప్రాంతాల నుంచి నగరానికి రాకపోకలు సాగించేవారు, ముఖ్యంగా బస్సు పాసులు కలిగినవారి పాట్లు వర్ణణాతీతం. ఇదే అదునుగా ఆటో వాలాలు రూ.10 నుంచి రూ.30 వరకు అదనంగా ఛార్జీలు వసూలు చేశారు. నగరం నుంచి శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం, పాలకొండ, సాలూరు, టెక్కలి, పలాస, ఇచ్ఛాపురం, రాజమహేంద్రవరం, కాకినాడ, విజయవాడకు సర్వీసులను కుదించారు. దీంతో ద్వారకా బస్‌స్టేషన్‌తోపాటు, జాతీయ రహదారిపై ప్రయాణికులు పడిగాపులు పడ్డారు.

ఒక పక్క భగభగ మండే ఎండలు, ఉక్కపోత కారణంగా నిలువునా నీరైపోతుంటే మరో పక్కన బస్సులు లేక నగరవాసులు తీవ్ర అసహనానికి గురయ్యారు. వైకాపా ప్రభుత్వ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కాకినాడ నుంచి బస్సులు తిరిగి వచ్చినా శనివారం మధ్యాహ్నం నుంచి రోడ్లపైకి వచ్చే అవకాశాలున్నాయి. అప్పటి వరకు ప్రయాణికులకు అవస్థలు తప్పవు.


బాబోయ్‌.. ప్రయాణికుల పాట్లెన్నో!

న్యూస్‌టుడే, మద్దిలపాలెం

గంటలకొద్దీ ఎదురుచూపు..: నగరంలో ప్రయివేట్‌ సంస్థలో పనిచేస్తున్నాను. విధులు ముగించుకుని ఆనందపురం వెళ్లడానికి బస్సు కోసం మద్దిలపాలెం ఆర్టీసీ కాంప్లెక్సు వద్ద సాయంత్రం ఐదు గంటల నుంచి సుమారు గంటపాటు పడిగాపులు కాశాను. నగర శివారు ప్రాంతాలకు వెళ్లే సిటీబస్సులతో పాటు, కనీసం విజయనగరం రూట్‌ వెళ్లే బస్సులు కూడా లేక ఇబ్బంది పడ్డాం.

శిరీష, ఆనందపురం


ఆటోలను ఆశ్రయించాల్సి వచ్చింది..

జగన్‌ రాష్ట్రంలో ఏ జిల్లాలో సిద్ధం సభ, సమావేశాలు నిర్వహించినా విశాఖ నుంచి బస్సులు తరలిస్తున్నారు. దీనివల్ల ప్రయాణికులకు ఇబ్బందులు తప్పడం లేదు. నగరంలోకి బతుకుదెరువుకోసం వలస వచ్చాను. ఎంతసేపు ఎదురుచూసినా బస్సు రాలేదు. చివరికి ఆటోను ఆశ్రయించాల్సి వచ్చింది.

అప్పలరెడ్డి, తగరపువలస


అసలే బస్సులు లేవు..

అసలే నగరంలో బస్సులు తక్కువగా ఉన్నాయి. దీనికి తోడు ఈ సభలకు బస్సులను తరలించటం వల్ల ప్రయాణికులకు, విద్యార్థులకు తీవ్ర ఇబ్బందిగా మారింది. ఉదయం కళాశాలలకు రావాలన్నా.. సాయంత్రం ఇంటికి వెళ్లాలన్నా గంటలకొద్దీ నిరీక్షించాల్సి వస్తోంది. ఇలా చేయటం మంచిది కాదు.

నవీన్‌, పెందుర్తి

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని