logo

చెప్పింది ఘనం.. చేసింది శూన్యం

రాష్ట్రంలో సులువైన పారిశ్రామిక విధానం ఉంది. పరిశ్రమల స్థాపనకు, వ్యాపార ప్రతిపాదనలతో వచ్చేవారికి అనువైన వాతావరణం కల్పించేందుకు కృతనిశ్చయంతో ఉన్నాం.

Updated : 26 Apr 2024 05:15 IST

 వైకాపా నేతల తీరుతో పారిశ్రామికవేత్తల బెంబేలు
అన్నీ మాటలేనా.. చేతలు లేవా జగన్‌?
కొత్త పారిశ్రామికవాడలు రాలేదే?
యువతకు దూరమైన ఉపాధి

రాష్ట్రంలో సులువైన పారిశ్రామిక విధానం ఉంది. పరిశ్రమల స్థాపనకు, వ్యాపార ప్రతిపాదనలతో వచ్చేవారికి అనువైన వాతావరణం కల్పించేందుకు కృతనిశ్చయంతో ఉన్నాం. ఎప్పుడు, ఎలాంటి సహకారం అవసరమైనా ఒక్క ఫోన్‌కాల్‌ దూరంలో ఉన్నాం. విశాఖను పారిశ్రామిక నగరంగా మరింత అభివృద్ధి చేస్తాం’

 వివిధ సందర్భాల్లో సీఎం జగన్‌

ఈనాడు డిజిటల్‌, విశాఖపట్నం  వేదికలపై సీఎం జగన్‌ చెప్పే మాటలకు... వాస్తవ పరిస్థితి పూర్తి విరుద్ధంగా ఉంది. వైకాపా ప్రభుత్వంలో పారిశ్రామిక అభివృద్ధి కంటే వ్యక్తిగత ప్రయోజనాలకే ప్రాధాన్యమిచ్చారు. భూకబ్జాలు, బెదిరింపులు, కమీషన్లపైనే దృష్టి పెట్టారనేది ప్రధాన ఆరోపణ. పెట్టుబడులు పెట్టాలనుకున్న పారిశ్రామికవేత్తలను భయపడేలా చేశారు. వాణిజ్య కేంద్రమైన విశాఖలో కొత్త పరిశ్రమల ఏర్పాటు గురించి కనీసం పట్టించుకోలేదు. పారిశ్రామికవాడల్లో అవసరాలు, మౌలిక సదుపాయాల కల్పనకు చేపట్టాల్సిన చర్యలపై శ్రద్ధ పెట్టలేదు. జగన్‌ ప్రభుత్వంలో అయిదేళ్లలో అదనంగా ఒక్క పారిశ్రామికవాడనూ ఏర్పాటు చేయలేదు. వైకాపా ప్రభుత్వం, నాయకుల విధానాల వల్ల గత అయిదేళ్లలో జిల్లాలో అనేక పరిశ్రమలు మూతపడ్డాయి.

ఆటోనగర్‌ ఏర్పాటుకు మంగళం: ఆనందపురం మండలం కణమాంలో ఆటోనగర్‌ ఏర్పాటుకు తెదేపా హయాంలో 155 ఎకరాలు గుర్తించారు. వైకాపా అధికారంలోకి వచ్చాక మళ్లీ వాటినే ఏపీఐఐసీకి కేటాయించారు. గత సెప్టెంబరులో రైతులకు రూ.28 కోట్ల పరిహారం అందించారు. మరో రూ.3.35 కోట్లు చెల్లించాల్సి ఉంది. ఎనిమిది నెలలు గడిచినా ఆ ప్రక్రియ ముందుకు సాగలేదు. అయినా రెవెన్యూ అధికారులు భూమిని ఏపీఐఐసీకి అప్పగించారు. అక్కడ ప్లాట్లు వేయడానికి అనువుగా ఏపీఐఐసీ అధికారులు రోడ్లు, డ్రైనేజీ నిర్మాణానికి సర్వే చేశారు. వీఎంఆర్డీఏ అనుమతికి పంపి చేతులు దులిపేసుకున్నారు. ఇప్పటివరకు అక్కడ ఎలాంటి అభివృద్ధి పనులు జరగలేదు. ఇక్కడ ఆటోనగర్‌ ఏర్పాటును వైకాపా నేతలు అడ్డుకుంటున్నారనే ఆరోపణలున్నాయి. ఈ విలువైన భూమిని మరో పరిశ్రమకు కట్టబెట్టే ఆలోచనలో ఉన్నట్లు చెబుతున్నారు.

పట్టించుకోని మంత్రి: నగరంలోనే నివాసముంటున్న పరిశ్రమలశాఖ మంత్రి గుడివాడ అమర్‌నాథ్‌ పారిశ్రామికవేత్తల అవసరాలపై పూర్తి స్థాయిలో చర్చించేందుకు ఏనాడూ ఆసక్తి చూపలేదు. ప్రతిపక్ష నాయకులపై ఆరోపణలు, విమర్శలు చేయడానికే ఎక్కువ సమయం కేటాయించారు. కొత్త పరిశ్రమలు ఏర్పాటైతే యువతకు ఉద్యోగాలు లభిస్తాయన్న విషయంపై కనీసం దృష్టి పెట్టలేదు. గాజువాక ఇండస్ట్రియల్‌ ఎస్టేట్‌లో రైల్వే వ్యాగన్‌ ఫ్యాక్టరీకి సమీపంలో రైలు గేటు సమస్య పరిష్కారంపై తెదేపా హయాంలో చంద్రబాబునాయుడు దృష్టి పెట్టారు. దీంతో రైల్వే అధికారులు అక్కడ పైవంతెన ఏర్పాటుచేశారు. దానికి అనుసంధానం చేసే రోడ్డును రాష్ట్ర ప్రభుత్వం నిర్మించాల్సి ఉండగా అయిదేళ్లలో చేయలేకపోయారు. అమర్‌నాథ్‌ ఇంటికి కూతవేటు దూరంలోనే ఇది ఉంది. దీనిపై సమీక్షలు జరిపినా ఆచరణకు నోచుకోలేదు. ఫలితంగా రైల్వే గేటు వల్ల భారీ వాహనాలు వెళ్లేటప్పుడు నిత్యం ఇబ్బందులు ఎదురవుతున్నాయి.

వైకాపా పాలనలో ఒక్కటీ లేదు..

నగరంలో ప్రస్తుతం పది పారిశ్రామికవాడలున్నాయి. అవన్నీ గత ప్రభుత్వాల హయాంలో ఏర్పాటైనవే. వైకాపా ప్రభుత్వంలో విశాఖ జిల్లా పరిధిలో నేటికీ ఒక్కటి కూడా ఏర్పాటు కాలేదు. పారిశ్రామికవాడల్లోని స్థలాలన్నీ దాదాపుగా నిండిపోయాయి. కాపులుప్పాడ, గుర్రంపాలెం, చినగదిలి తదితర పార్కుల్లో కొన్ని ప్లాట్లు ఖాళీగా ఉన్నా సరైన సదుపాయాలు లేవు. మరోవైపు పారిశ్రామికవాడల్లో ప్లాట్లు ఖాళీగా ఉన్నట్లు ఆన్‌లైన్‌లో చూపిస్తుంది. దాదాపు అన్నీ ‘వేకెంట్‌ బట్‌ అన్‌ఎలాటబుల్‌’ కేటగిరీలోనే ఉన్నాయి. కోర్టు కేసులు, లేఅవుట్‌ సమస్యల నేపథ్యంలో వాటిని కేటాయించేందుకు అవకాశం లేదు. మెడ్‌టెక్‌ జోన్‌లో వైద్య సంబంధిత, ఐటీ హిల్స్‌పై సంబంధిత పరిశ్రమలకే అవకాశముంటుంది. కొత్తగా పరిశ్రమల ఏర్పాటుకు ఔత్సాహికులు ముందుకొస్తున్నా స్థలాలు, సౌకర్యాలు లేకపోవడంతో వెనుకడుగు వేస్తున్నారు.

జిల్లాలో సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలు: 10,000 (దాదాపు)

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని