logo

వైకాపా నాయకులు దోచుకున్న నగదే పంచి పెడుతున్నారు

విశాఖ ఉత్తర నియోజకవర్గంలో వైకాపా నాయకులు రౌడీయిజాన్ని ప్రోత్సహిస్తున్నారని, దాన్ని ప్రజలు తిప్పికొట్టాలని భాజపా (కూటమి) అభ్యర్థి పి.విష్ణుకుమార్‌రాజు అన్నారు.

Published : 27 Apr 2024 04:03 IST

మాట్లాడుతున్న విష్ణుకుమార్‌రాజు, చిత్రంలో ఉషాకిరణ్‌, శ్రీనివాసరావు, తదితరులు

గురుద్వారా, న్యూస్‌టుడే: విశాఖ ఉత్తర నియోజకవర్గంలో వైకాపా నాయకులు రౌడీయిజాన్ని ప్రోత్సహిస్తున్నారని, దాన్ని ప్రజలు తిప్పికొట్టాలని భాజపా (కూటమి) అభ్యర్థి పి.విష్ణుకుమార్‌రాజు అన్నారు. శుక్రవారం సీతమ్మధార పార్టీ కార్యాలయంలో కూటమి నాయకులతో కలిసి విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. వైకాపా నాయకులు రాష్ట్రాన్ని వ్యాపార స్థావరంగా చేసి వేలకోట్లు దోచుకున్నారని విమర్శించారు. దానికి సంబంధించి తమ దగ్గర ఆధారాలున్నాయని వెల్లడించారు. ఆ సొమ్మునే ఎన్నికల్లో పంచిపెట్టడానికి సిద్ధమవుతున్నారని మండిపడ్డారు. వైకాపా పాలనలో అభివృద్ధి ఉందో లేదో అనే విషయాన్ని అంతర్మథనం చేసుకొని ఓటు వేయాలని సూచించారు. తాను ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో ఉత్తర నియోజకవర్గ అభివృద్ధికి ఎంతో కృషిచేసానని తెలిపారు. రౌడీయిజాన్ని నిర్మూలించి నియోజకవర్గాన్ని అభివృద్ధిపథంలో నడిపేందుకు తనకు కమలం గుర్తుపై, ఎంపీ శ్రీభరత్‌కి సైకిల్‌ గుర్తుపై ఓట్లు వేసి గెలిపించాలని కోరారు. పోలీసు వ్యవస్థ వైకాపాకు వీరభక్తుల్లా పనిచేస్తున్నారని సౌత్‌ ఇండియా కాపు సంఘం అధ్యక్షుడు వేల్పూరి శ్రీనివాసరావు అన్నారు. జగన్‌మోహన్‌రెడ్డిని సీఎం చేయాలని కాపు నాయకుడు ముద్రగడ పద్మనాభం వ్యవహరిస్తున్న తీరుపై మండిపడ్డారు. నియోజకవర్గంలో ఎంతో మందికి సహాయపడిన విష్ణుకుమార్‌రాజును గెలిపించాలని కోరారు. జనసేన నార్త్‌ సమన్వయకర్త పసుపులేటి ఉషాకిరణ్‌, నాయకులు త్రినాథ్‌రావు, సురేశ్‌బాబు, మురళీ, తదితరులు పాల్గొన్నారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని