logo

రాష్ట్రానికి త్వరలోనే మంచి రోజులు

కూటమి విజయంతోనే రాష్ట్ర భవిష్యత్తు బాగుంటుందని కూటమి అభ్యర్థి సుందరపు విజయ్‌కుమార్‌ పేర్కొన్నారు.

Published : 27 Apr 2024 04:11 IST

ప్రచారంలో కూటమి అభ్యర్థులు

తురంగలపాలెంలో ప్రచారం చేస్తున్న సుందరపు విజయ్‌కుమార్‌

ఎలమంచిలి గ్రామీణం, రాంబిల్లి, న్యూస్‌టుడే: కూటమి విజయంతోనే రాష్ట్ర భవిష్యత్తు బాగుంటుందని కూటమి అభ్యర్థి సుందరపు విజయ్‌కుమార్‌ పేర్కొన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా శుక్రవారం తురంగలపాలెం, షేకిళ్లపాలెం, పేటబయ్యవరం గ్రామాల్లో పర్యటించారు. మహిళలు చూపిస్తున్న ఆదరణ మరువలేనని తెలిపారు.  ఒక్క అవకాశమంటూ అధికారంలోకి వచ్చిన జగన్‌ ప్రజల నడ్డి విరిచారని ఆరోపించారు. రానున్న ఎన్నికల్లో కూటమి అభ్యర్థులకు ఓటు వేసి గెలిపించాలని కోరారు. ఇత్తంశెట్టి సన్యాసినాయుడు, బొద్దపు శ్రీను, పల్లా సత్యనారాయణ, రాజాన నారాయణమ్మ, విజయబాబు తదితరులు పాల్గొన్నారు. రాంబిల్లి వైస్‌ ఎంపీపీ కొటాపు లక్ష్మి, ఆమె భర్త వైకాపా నేత వడ్డికాసులు అనుచర వర్గంతో సుందరపు సమక్షంలో జనసేనలో చేరారు. సీఎం.రమేశ్‌ సోదరుడు రాజేష్‌, నాయకులు పప్పల నూకన్నదొర, డీఎస్‌ఎన్‌.రాజు, బైలపూడి శ్రీరాందాసు, కొఠారు దల్లమ్మదేవి, మోటూరి శ్రీవేణి పాల్గొన్నారు.

నక్కపల్లి, న్యూస్‌టుడే: రాష్ట్రానికి, ప్రజలకు త్వరలోనే మంచి రోజులు రానున్నాయని కూటమి ‘పేట’ అభ్యర్థి వంగలపూడి అనిత అన్నారు. సీహెచ్‌బీ అగ్రహారం, వెదుళ్లపాలెం గ్రామాల్లో ఆమె ప్రచారం చేపట్టారు. వైకాపా పాలనలో ప్రజలకు కష్టాలు, కన్నీళ్లే మిగిలాయన్నారు. కార్యక్రమంలో కొప్పిశెట్టి వెంకటేష్‌, గింజాల లక్ష్మణరావు, వెదుళ్ల తాతబాబు, వెదుళ్ల పాపారావు, గొనగాల రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.


రేషన్‌ డీలర్లను ఆదుకుంటాం: సీఎం రమేశ్‌

సీఎం రమేశ్‌కు వినతిపత్రం అందిస్తున్న రాష్ట్ర డీలర్ల అసోసియేషన్‌ ప్రతినిధులు

అనకాపల్లి, న్యూస్‌టుడే: వైకాపా ప్రభుత్వం రేషన్‌ డీలర్లను వీధిన పడేసిందని అనకాపల్లి ఎంపీగా పోటీ చేస్తున్న సీఎం రమేశ్‌ తెలిపారు. రాష్ట్ర రేషన్‌ డీలర్ల సమాఖ్య అధ్యక్షులు దివి లీలా మాధవరావు ఆధ్వర్యంలో కార్యవర్గ సభ్యులు శుక్రవారం రమేశ్‌ను కలిసి వారి సమస్యలపై వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ డీలర్ల వ్యవస్థను వైకాపా ప్రభుత్వం నిర్వీర్యం చేసిందన్నారు. తెదేపా హయాంలో ఎనిమిది రకాల వస్తువులు రేషన్‌ షాపుల ద్వారా పంపిణీ చేసేవారన్నారు. సంక్రాంతి కానుకలు, రంజాన్‌ తోఫా పంపిణీతో డీలర్లకు ఏడాదికి రూ.90 కోట్ల ఆదాయం వచ్చేదన్నారు. కూటమి ప్రభుత్వం వచ్చిన వెంటనే డీలర్ల సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. రాష్ట్ర కోశాధికారి గంగాధర్‌ గౌడ్‌, రాష్ట్ర సలహాదారు బోడేపూడి ఫణికుమార్‌ తదితరులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని