logo

ఇక సచివాలయాల్లో రిజిస్ట్రేషన్లు

సచివాలయాలు ఇక రిజిస్ట్రేషన్‌ కేంద్రాలుగా మారనున్నాయి. ఈ మేరకు ఆస్తుల క్రయ, విక్రయాలు నిర్వహించేందుకు స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ సిద్ధమైంది. విజయనగరం జిల్లా పరిధిలో 116 సచివాలయాలున్నాయి.

Published : 07 Feb 2023 03:08 IST

జిల్లా రిజిస్ట్రార్‌ కార్యాలయంలో సిబ్బందికి అవగాహన కల్పిస్తున్న అధికారులు

విజయనగరం కోట, న్యూస్‌టుడే: సచివాలయాలు ఇక రిజిస్ట్రేషన్‌ కేంద్రాలుగా మారనున్నాయి. ఈ మేరకు ఆస్తుల క్రయ, విక్రయాలు నిర్వహించేందుకు స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ సిద్ధమైంది. విజయనగరం జిల్లా పరిధిలో 116 సచివాలయాలున్నాయి. సంబంధిత సిబ్బందికి ఇప్పటికే జిల్లా రిజిస్ట్రార్‌ కార్యాలయంలో అవగాహన కల్పించారు. కలెక్టర్‌ ఆదేశాల మేరకు మరో 15 రోజులపాటు శిక్షణ ఇవ్వనున్నారు. అంతే కాకుండా శాఖా పరంగా ప్రక్రియ సజావుగా సాగేందుకు వీలుగా సాఫ్ట్‌వేర్‌ అనుసంధానంతో పాటు, అవసరమైన వెబ్‌ కెమెరాలను సమకూర్చారు.

ఇప్పటి వరకు ఆస్తుల రిజిస్ట్రేషన్‌ కేవలం సబ్‌రిజిస్ట్రార్‌ కార్యాలయాల్లోనే జరిగేది. ఇక నుంచి సచివాలయాలకూ వెళ్లొచ్చు. సంబంధిత రిజిస్ట్రేషన్ల సంఖ్యలను మాత్రం శాఖ పరంగా కేటాయించనున్నారు. ఈ మేరకు ప్రభుత్వం ప్రత్యేక ఆదేశాలు జారీ చేసింది. జిల్లాలో ఇప్పటికే 168 గ్రామాల్లో సమగ్ర భూ సర్వే పూర్తయింది. ఆయా ప్రాంతాల వారు సమీపంలోని సచివాలయాలకు  వెళ్లి సేవలు పొందవచ్చు. సర్వే నంబరు ఆధారంగా సిబ్బంది మార్కెట్‌ ధర నిర్ధరిస్తారు. ల్యాండ్‌ పార్శిల్‌ మ్యాప్‌ మెంబర్‌(ఎల్‌పీఎం) ద్వారా ధరల మార్పును పరిశీలిస్తారు. అనంతరం శాఖాధికారుల పరిశీలనకు పంపిస్తారు. అక్కడ నంబరు కేటాయించిన తర్వాత రిజిస్ట్రేషన్‌ పూర్తిచేయనున్నారు. దీనిపై ఇప్పటికే సిబ్బందికి తగిన తర్ఫీదునిచ్చామని జిల్లా రిజిస్ట్రార్‌ సృజన తెలిపారు. ప్రజలు ముందుకొచ్చి, సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని