logo

రూ.6.47 కోట్ల బంగారం, వెండి వస్తువుల స్వాధీనం

వ్యానులో తరలిస్తున్న రూ.6.47 కోట్ల విలువజేసే బంగారం, వెండి వస్తువులను విజయనగరం జిల్లా డెంకాడ మండలం మోదవలస చెక్‌పోస్టు వద్ద పోలీసులు శుక్రవారం రాత్రి పట్టుకున్నారు.

Published : 27 Apr 2024 04:36 IST

వాహనంలో వస్తువులు ఉన్న పార్సిళ్లను పరిశీలిస్తున్న అధికారులు

డెంకాడ, న్యూస్‌టుడే: వ్యానులో తరలిస్తున్న రూ.6.47 కోట్ల విలువజేసే బంగారం, వెండి వస్తువులను విజయనగరం జిల్లా డెంకాడ మండలం మోదవలస చెక్‌పోస్టు వద్ద పోలీసులు శుక్రవారం రాత్రి పట్టుకున్నారు. దీనికి సంబంధించి భోగాపురం సీఐ వెంకటేశ్వరరావు, డెంకాడ ఎస్‌ఐ కృష్ణమూర్తి తెలిపిన వివరాల ప్రకారం... ముంబయి, దిల్లీ, చెన్నై తదితర ప్రాంతాల నుంచి బి.వి.సి.లాజిస్టిక్స్‌ కొరియర్‌ పార్సిల్‌ సర్వీసు ద్వారా విజయనగరంలోని ఆరు ప్రముఖ జ్యూయలరీ దుకాణాల పేరుతో రూ.6.47 కోట్ల విలువైన 10 కిలోల బంగారం ఆభరణాలు, 17 కిలోల వెండి వస్తువులు రవాణా అవుతున్నాయి. వీటిని విశాఖపట్నంలోని మురళీనగర్‌లోని కొరియర్‌ సర్వీసు బ్రాంచ్‌ కార్యాలయం ద్వారా ఆయా దుకాణాలకు శుక్రవారం రాత్రి వ్యానులో రవాణా చేస్తున్నారు. వాహన తనిఖీల్లో భాగంగా మోదవలస చెక్‌పోస్టు వద్ద పోలీసులు తనిఖీలు నిర్వహించగా భారీగా వస్తువులు గుర్తించి సీజ్‌ చేశారు. వీటికి సంబంధించిన బిల్లులు ఉన్నప్పటికీ ఎన్నికల కమిషన్‌ నుంచి అనుమతి పత్రం లేకపోవడంతో స్వాధీనం చేసుకుని, దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ వెంకటేశ్వరరావు తెలిపారు. దుకాణదారులు కొనుగోలు చేశారా? లేక ఎన్నికల్లో పంపిణీ కోసం తెస్తున్నారా? అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేపట్టారు.  

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని