logo

ప్రజల వద్దకే సేవలంటే ఇలాగేనేమో..

గ్రామీణ ప్రజలకు సేవలు మరింత చేరువ చేస్తాం.. ప్రభుత్వ కార్యకలాపాలు అందుబాటులో ఉంచుతాం.. అందుకే గ్రామ సచివాలయాల వ్యవస్థను ఏర్పాటు చేస్తున్నాం..

Published : 27 Apr 2024 04:41 IST

గ్రామీణ ప్రజలకు సేవలు మరింత చేరువ చేస్తాం.. ప్రభుత్వ కార్యకలాపాలు అందుబాటులో ఉంచుతాం.. అందుకే గ్రామ సచివాలయాల వ్యవస్థను ఏర్పాటు చేస్తున్నాం.. అంటూ గొప్పలు చెప్పిన ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి.. అయిదేళ్లయినా వాటి నిర్మాణంపై నిర్లక్ష్యం వహించారు. ఇప్పటికీ పునాదుల స్థాయిని దాటని భవనాలు ఎన్నో. ఫలితంగా సచివాలయాలను అద్దె భవనాలు, పాఠశాలలు, శిథిల, ఇరుకు భవనాల్లో అరకొర వసతుల మధ్య నిర్వహిస్తున్నారు. వివిధ పనులపై వచ్చే ప్రజలకు కనీస మౌలిక సదుపాయాలు లేక అవస్థలు పడుతున్నారు. వైకాపా పాలనా తీరుకు ఉమ్మడి జిల్లాలో వీటి దుస్థితే నిదర్శనం.

ఇక్కడ పంచాయతీ కార్యాలయమే గతి..  

వీరఘట్టం: మండలంలోని చిట్టపుడివలసలో పంచాయతీ కార్యాలయంలోని రెండు ఇరుకు గదుల్లో సచివాలయం నిర్వహిస్తున్నారు. ఇక్కడ భవన నిర్మాణానికి రూ.40లక్షలు మంజూరయ్యాయి. దీని నిర్మాణం చివరిదశలో నిలిచిపోయింది. పీహెచ్‌సీ, ఆర్బీకే, ఈ భవన నిర్మాణం ఒక్కరే చేయిస్తుండడంతో జాప్యం జరిగింది. దీనిపై ఇంజినీర్‌ రమేష్‌ను అడగ్గా దాదాపు పూర్తయ్యిందన్నారు. త్వరలో అప్పగిస్తామన్నారు.

 సగమే కట్టారు..

శంబరలో పునాదుల్లోనే భవన నిర్మాణం

సాలూరు: నియోజక వర్గంలోని సాలూరు, పాచిపెంట, మక్కువ మండలాల్లో 56 సచివాలయ భవనాలు మంజూరు కాగా, ఇప్పటికి 27 మాత్రమే పూర్తి చేశారు. మిగిలిన భవనాల పనులు పునాదులు, గోడలు, స్తంభాల దశలోనే ఉన్నాయి. శంబర, కూర్మరాజుపేట, కరాసువలస, మరిపల్లి, పాచిపెంట-2లో పునాదుల్లో ఉండగా, గురివినాయుడుపేట, కర్రివలస, పాచిపెంట-1, పనుకువలస, రాయిగుడ్డివలస భవనాలు గ్రౌండ్‌ ఫ్లోర్‌లో నిలిచాయి. మూటకూడు, గంజాయిభద్ర, పట్టుచెన్నారు, సంపంగిపాడులో అసలు ప్రారంభించలేదు. చేసిన పనులకు సకాలంలో బిల్లులు మంజూరు కాకపోవడమే దీనికి కారణం. పనులు పూర్తిచేసేందుకు చర్యలు చేపట్టామని పంచాయతీరాజ్‌ డీఈ చిన్నంనాయుడు తెలిపారు.  

కొనసా...గుతున్నాయ్‌!

మెంటాడ (గజపతినగరం): ఇది మెంటాడ మండలం బడేవలసకు చెందిన గ్రామ సచివాలయ భవన నిర్మాణం. ఏడాదిగా దీని నిర్మాణం అలాగే ఉంది. ప్రస్తుతం ఆర్బీకేలో నడుస్తోంది. ఒకే కార్యాలయంలో సచివాలయం, ఆర్బీకే సిబ్బందికి విధుల నిర్వహణలో ఇబ్బంది పడుతున్నారు. బిల్లుల చెల్లింపులు లేక పనులు నిలిచాయి. కె.ఎల్‌.వలసలో పంచాయతీ కార్యాలయంలో సచివాలయం నిర్వహిస్తున్నారు. చెల్లింపులు లేక గుత్తేదారు పనులు నిలిపేశారు. చల్లపేటలోనూ ఇదే పరిస్థితి. మండలంలో 19 సచివాలయాల్లో పదింటికి భవనాల సమస్య ఉంది. దీనిపై మండల ఇంజినీరింగ్‌ అధికారి గౌతమ్‌ వద్ద ప్రస్తావించగా గుత్తేదారులతో చర్చించి పనులు పూర్తి చేయిస్తామన్నారు.

శిథిల భవనంలో నిర్వహణ

పాచిపెంట: పాచిపెంటలో రెండు సచివాలయాలకు భవనాలు మంజూరు కాగా, పాచిపెంట-2 భవనం నిర్మాణం రెండేళ్లుగా పునాదుల స్థాయి దాటలేదు. మరొకటి మొండిగోడలకే పరిమితమైంది. దీంతో ఖాళీగా ఉన్న ఎస్సీ బాలుర వసతి గృహంలో సచివాలయం-2 నిర్వహిస్తున్నారు. ఉద్యోగులు ఇబ్బందులు పడుతున్నారు. ఇది శిథిలావస్థకు చేరడంతో స్లాబు పెచ్చులూడి కింద పడుతుండడంతో ఉద్యోగులు ఆందోళన చెందుతున్నారు. గ్రామ కార్యదర్శి నవీన్‌ కుమార్‌ ‘న్యూస్‌టుడే’తో మాట్లాడుతూ వేరొక చోట నిర్వహణకు అవకాశం లేక ఇక్కడ పెట్టామన్నారు.  

ఇరుకు గదుల్లోనే పాలన

భోగాపురం: మండలంలో సచివాలయాల నిర్మాణం చాలాచోట్ల పూర్తికాలేదు. రామచంద్రపేట పంచాయతీలో భవన నిర్మాణం చేపట్టగా.. ఆ భూమి తమదేనని కొందరు కోర్టును ఆశ్రయించారు. దీంతో పనులు జరగక.. సచివాలయానికి వసతి సమస్య ఏర్పడింది. పాత పంచాయతీ భవనంలోనే సిబ్బంది విధులు నిర్వహిస్తున్నారు. ఒక్కటే గది కావడంతో అందరికీ సరిపడా సీట్లు కూడా లేని పరిస్థితి. ఇబ్బందులున్నా సర్దుకుపోతున్నామని పంచాయతీ కార్యదర్శి రమణమ్మ తెలిపారు.

తొమ్మిదిలో ఆరు పరాయి పంచనే..

పాలకొండ, గ్రామీణం: నగరపంచాయతీ పరిధిలో తొమ్మిది సచివాలయాలకు గాను ఆరు అద్దె భవనాల్లోనే కొనసాగుతున్నాయి. ఎన్‌కేరాజపురం, బాసూరువారివీధి, కోమటిపేట, గారమ్మకాలనీ, శెగిడివీధి, కోరాడవీధుల్లో ఏళ్లుగా అద్దె ఇళ్లలో కొనసాగుతున్నాయి. ఇరుకుగా ఉండడంతో సిబ్బంది ఇబ్బంది పడుతున్నారు. మండలంలో 22 సచివాలయాలకు 14 మాత్రమే పూర్తయ్యాయి. మిగిలిన 8 పాత పంచాయతీ భవనాల్లో నిర్వహిస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని