logo

తెలుసా జగన్‌.. ప్రాణాల విలువ

జగన్‌.. నా గిరిజనులు అన్నావ్‌.. అన్నగా అండగా ఉంటానన్నావ్‌.. మరి ఎందుకు కొండ శిఖర గ్రామాలను వదిలేశావ్‌..

Updated : 27 Apr 2024 05:31 IST

జగన్‌.. నా గిరిజనులు అన్నావ్‌.. అన్నగా అండగా ఉంటానన్నావ్‌.. మరి ఎందుకు కొండ శిఖర గ్రామాలను వదిలేశావ్‌.. ఎస్‌ కోట నియోజకవర్గంలో రోడ్లు, వైద్య సేవల కల్పనను అయిదేళ్లలో పూర్తిగా విస్మరించావ్‌.. ఫలితంగా అమాయకుల ప్రాణాలు తీస్తున్నావ్‌.

విజయనగరం- ఈనాడు, న్యూస్‌టుడే, శృంగవరపుకోట

ఈ ఏడాది జనవరి 21న చిట్టంపాడుకు చెందిన ఏడాదిన్నర వయసున్న జన్ని ప్రవీణ్‌ అనారోగ్యానికి గురవడంతో తల్లిదండ్రులు సన్యాసిరావు, సన్యాసమ్మ డోలీపై ఎస్‌.కోటలోని ప్రాంతీయ ఆసుపత్రికి తీసుకెళ్లారు.  వైద్యుల సూచనలతో ఘోషా ఆసుపత్రికి తీసుకెళ్లగా అక్కడ చికిత్స పొందుతూ కన్నుమూశాడు. మృతదేహాన్ని తీసుకెళ్లేందుకు అంబులెన్సు ఇవ్వకపోవడంతో రూ.3 వేలు చెల్లించి ప్రైవేటు వాహనంలో బొడ్డవర వరకు తెచ్చి, అక్కడి నుంచి డోలీపై తీసుకెళ్లారు.  


శృంగవరపుకోట నియోజకవర్గంలోని ఎస్‌.కోట, వేపాడ మండలాల్లో సుమారు 20 వరకు గిరిజన గ్రామాలున్నాయి. ఇక్కడికి వెళ్లేందుకు ఇప్పటికీ పక్కా రోడ్డు సదుపాయం లేదు. కొన్నిచోట్ల మంజూరైనా ఏళ్లుగా నిర్మాణ పనులు సాగుతున్నాయి. కొన్ని ప్రతిపాదనలతోనే ఆగిపోయాయి. దీంతో అంబులెన్సులు వెళ్లలేని పరిస్థితి. ఆయా గ్రామాల్లో ప్రజలు అనారోగ్యానికి గురైతే అత్యవసర సమయాల్లో నేటికీ డోలీపై మోసుకుని కాలినడకన కి.మీ. దూరంలోని ఆసుపత్రులకు తరలించాల్సిన దుస్థితి. దీంతో సకాలంలో వైద్యం అందక మృత్యువాత పడుతున్నారు. గడిచిన నాలుగు నెలల్లో ఎస్‌.కోట మండలంలో అయిదుగురు చనిపోయారు. ఇంకా వెలుగుచూడని ఘటనలెన్నో.


నాలుగు రోజుల క్రితం మృతిచెందిన మూడేళ్ల ప్రసాద్‌(పాతచిత్రం)

ఇదీ పరిస్థితి

  • జనవరి 24న మూలబొడ్డవర పంచాయతీ శివారు గాదెల్లోవకు చెందిన యువకుడు రాజేష్‌ అనారోగ్యానికి గురవగా, విశాఖ కేజీహెచ్‌లో చేర్పించారు. మందులు కొనుక్కొనే స్థోమత లేక మృతి చెందాడు.
  • ఈ నెల 22న దారపర్తి పంచాయతీ గూనపాడుకు చెందిన బడ్నాయిన జీవన్‌కుమార్‌, దాలమ్మ దంపతుల కుమారుడు ప్రసాద్‌ (3) అనారోగ్యానికి గురవడంతో అత్యవసరంగా ఆసుపత్రికి తీసుకెళ్లాల్సి వచ్చింది. దీంతో స్నేహితుడి బైకుపై, నడక మార్గంలో 9 కి.మీ. దూరం తీసుకెళ్లారు. మార్గమధ్యలో మరణించడంతో తిరిగి ఇంటికి తీసుకొచ్చారు.
  • పూర్తికాని రోడ్లు.. వేపాడ మండలం మారికకు వెళ్లేందుకు 10.5 కిలోమీటర్ల మేర రోడ్డు వేసేందుకు రూ.5 కోట్ల నిధులు మంజూరై ఏళ్లు గడిచినా నేటికీ పనులు పూర్తి కాలేదు. చిట్టంపాడులో వరుస మరణాలతో జిల్లా అధికారులు స్పందించి పీఎం జన్‌మన్‌లో భాగంగా శెనగపాడు మీదుగా చిట్టంపాడుకు 10.2 కి.మీల రోడ్డు నిర్మాణానికి రూ.10.24 కోట్లతో ప్రతిపాదించారు. పీకేఆర్‌పురం- గదబవలసకు 2.8 కి.మీ. రోడ్డుకు రూ.2.65 కోట్లతో ప్రతిపాదనలు చేసినా మంజూరు కాలేదు.

కలగానే బొడ్డవర పీహెచ్‌సీ

గిరిజన పంచాయతీలకు అందుబాటులో ఉండేలా బొడ్డవరలో పీహెచ్‌సీ ఏర్పాటుకు అయిదేళ్ల కిందట స్థలం కేటాయించారు. ఆరు నెలల క్రితం కొట్టాం పీహెచ్‌సీ అనుబంధంగా కోలొకేటెడ్‌ ఆసుపత్రి మంజూరు కాగా, ఎస్‌.కోటలో ఏర్పాటు చేశారు. దీన్ని బొడ్డవరకు మార్చాలని గిరిజనులు కోరుతున్నారు.

ఇంకా డోలీలే దిక్కు..

శృంగవరపుకోట మండలంలోని ఏకైక గిరిశిఖర పంచాయతీ దారపర్తి. సరైన రహదారి సౌకర్యం లేక గిరిజనులు డోలీలపై రోగులను, గర్భిణులను మోసుకురావాల్సిన దయనీయ దుస్థితి. అప్పటి ఎమ్మెల్యే కోళ్ల లలితకుమారి దబ్బగుంట నుంచి పల్లపు దుంగాడ వరకు ఆరు కిలోమీటర్ల తారు రోడ్డు నిర్మాణానికి 2018లో రూ.4.24 కోట్ల నాబార్డు నిధులు మంజూరు చేయించారు. అభయారణ్యంలో నిర్మాణం చేపట్టేందుకు అటవీ శాఖ మోకాలడ్డింది. రోడ్డు వినియోగ స్థలానికి ప్రత్యామ్నాయ స్థలం అటవీశాఖకు అప్పగింత పనులు జరుగుతుండగా ఎన్నికలు రావడంతో ఈ ప్రక్రియ నిలిచిపోయింది.

వైకాపా చెబుతోందేమిటి?..: ఈ మండలంలో ఏకైక గిరిశిఖర పంచాయతీకి తామే రోడ్డు మంజూరు చేయించాం. పనులు పూర్తిచేసి గిరిజనుల కల నెరవేర్చిన ఘనత తమదే.
వాస్తవమిదీ..: వాస్తవానికి ఈ పనులకు నిధులు మంజూరైనా పూర్తి చేయకపోవడంపై ఆదివాసీ గిరిజన సంఘం ఆధ్వర్యంలో ఆందోళనలు చేపట్టారు. రోడ్డు పని పూర్తయ్యే వరకు కదిలేది లేదంటూ తహసీల్దారు కార్యాలయాన్ని ముట్టడించారు. భారీ ఆందోళనలతో విధి లేక ఇంజినీరింగ్‌ అధికారులు 2022 ఆగస్టులో అటవీ శాఖ నుంచి అనుమతి తీసుకున్నారు. గతేడాది ప్రారంభమైనా నేటికీ పూర్తి కాలేదు.

  • జనవరి 5న చిట్టంపాడుకు చెందిన గంగులు కుమారుడు (5) రాత్రి గుక్కపట్టి ఏడుస్తూ తెల్లవారుజామున కోమాలోకి వెళ్లిపోయాడు. బాబుతో పాటు తల్లి గంగమ్మకూ కాళ్లు వాపురావడంతో నడవ లేని స్థితికి చేరింది. గ్రామస్థులు డోలీ కట్టి తొమ్మిది కి.మీ. దూరం మోసుకుంటూ ఎస్‌.కోట ప్రాంతీయాసుపత్రికి తీసుకెళ్లగా, వైద్యుల సూచనలతో విజయనగరం ఘోషాసుపత్రికి, అక్కడి నుంచి కేజీహెచ్‌కు తరలించారు. చికిత్స పొందుతూ 6న బాబు మృతి చెందాడు  16న గంగమ్మ చికిత్స పొందుతూ చనిపోయింది. ఆటోలో ఆమె మృతదేహంతో బయల్దేరిన చోదకుడు, గ్రామానికి రాలేనని, ఎస్‌.కోటలోనే వదిలేశాడు. దీంతో గంగులు స్నేహితుడు బైకుపై భార్య మృతదేహాన్ని బొడ్డవర వరకూ తెచ్చి, అక్కడి నుంచి డోలీపై మోసుకుని గ్రామానికి వెళ్లారు.
Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు