logo

ఇంజినీరింగ్‌ విద్య.. ఓ జగన్మాయ

నా ఎస్సీలు.. నా ఎస్టీలంటూనే వారిపై కపట ప్రేమ చూపించి ఆయా వర్గాల వారికి తీవ్ర అన్యాయం చేశారు సీఎం జగన్‌మోహన్‌రెడ్డి. తన సొంత కుటుంబంగా భావించి గిరిజనులకు మంచి చేస్తానని, వారి జీవితాల్లో వెలుగులు నింపుతానంటూ ప్రేమ ఒలకబోసి దెబ్బ కొట్టారు.

Published : 27 Apr 2024 04:52 IST

భవన నిర్మాణాలకు నిధులివ్వని సర్కారు
మంజూరు పోస్టులన్నీ జేఎన్‌టీయూకి మళ్లింపు

నా ఎస్సీలు.. నా ఎస్టీలంటూనే వారిపై కపట ప్రేమ చూపించి ఆయా వర్గాల వారికి తీవ్ర అన్యాయం చేశారు సీఎం జగన్‌మోహన్‌రెడ్డి. తన సొంత కుటుంబంగా భావించి గిరిజనులకు మంచి చేస్తానని, వారి జీవితాల్లో వెలుగులు నింపుతానంటూ ప్రేమ ఒలకబోసి దెబ్బ కొట్టారు. మన్యం యువతకు మెరుగైన విద్యను అందిస్తానని మాటిచ్చి మడం తిప్పేశారు. కురుపాంలోని గిరిజన ఇంజినీరింగ్‌ కళాశాల నిర్మాణ పనుల్లో జరుగుతున్న జాప్యం వైకాపా ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరికి అద్దం పడుతోంది. మూడేళ్ల క్రితం సీఎం దీనికి శంకుస్థాపన చేయగా.. నేటికీ అందుబాటులోకి రాకపోవడం గమనార్హం.

న్యూస్‌టుడే, విజయనగరం విద్యావిభాగం కురుపాం గ్రామీణం

రాష్ట్ర విభజనలో భాగంగా ఉమ్మడి విజయనగరం జిల్లాకు మంజూరైన గిరిజన ఇంజినీరింగ్‌ కళాశాల నిర్మాణానికి కురుపాం మండలం టేకరికండి ప్రాంతంలోని దాదాపు 105 ఎకరాలను కేటాయించారు. నిర్మాణ పనులకు 2020 అక్టోబరు రెండో తేదీన ముఖ్యమంత్రి హోదాలో జగన్‌మోహన్‌రెడ్డి శంకుస్థాపన చేశారు. సుమారు నాలుగేళ్లవుతున్నా ఇప్పటికీ పూర్తికాలేదు. జేఎన్‌టీయూ కాకినాడ విశ్వవిద్యాలయం సమకూర్చిన నిధులతో కొంత వరకు నిర్మాణాలు జరుగుతున్నాయి. 2023-24లో కళాశాలకు మంజూరు చేసిన పోస్టుల్లో కొన్నింటిని జేఎన్‌టీయూ గురజాడ విశ్వవిద్యాలయానికి మళ్లించడంతో వచ్చే సంవత్సరంలో కళాశాల ప్రారంభిస్తే పోస్టుల పరిస్థితి ఏమిటన్న ప్రశ్న తలెత్తుతోంది.

రూ.32.99 కోట్లు ఏవి?

నిర్మాణం పూర్తికాని ఇంజినీరింగ్‌ కళాశాల ప్రధాన భవనం

పనులకు రూ.153.853 కోట్లతో ప్రణాళిక వేశారు. ప్రభుత్వం విడుదల చేయకపోవడంతో జేఎన్‌టీయూ కాకినాడ విశ్వవిద్యాలయం విడతల వారీగా రూ.23 కోట్లు మంజూరు చేయడంతో ప్రారంభించారు. ప్రభుత్వానికి ప్రతిపాదన మేరకు 2023-24 బడ్జెట్‌లో రూ.32.99 కోట్లు మంజూరు చేసినట్లు ప్రకటించినా, విడుదల చేయలేదని తెలుస్తోంది. అధికారుల వివరాల ప్రకారం ఇప్పటి వరకు 50 శాతం పనులే జరిగాయి. కళాశాలను ప్రారంభించేందుకు ఒక బ్లాక్‌ను సిద్ధం చేసేలా తరగతి గదులు, వసతి గృహాల నిర్మాణాలు జరుగుతున్నాయి. బీ కళాశాలకు కేటాయించిన స్థలంలో టేకరికండికి చెందిన 16 మంది, చంద్రశేఖరాజుపురానికి చెందిన 10 మంది సంబంధించిన 32.33 ఎకరాల భూమి ఉంది. ఎన్ని ఆందోళనలు చేసినా వారికి నేటికీ నష్టపరిహారం దక్కలేదు.

విద్యార్థుల వసతికి చేపట్టిన భవన నిర్మాణ పనులివి. ఇవి ఎప్పుడు పూర్తవుతాయో తెలియడం లేదు

పరిశీలనలతో సరి..

2020-21 విద్యాసంవత్సరంలో తొలుత జేఎన్‌టీయూ విజయనగరం ప్రాంగణంలో తరగతులు నిర్వహించి, కళాశాల నిర్మాణం అనంతరం కురుపాంకు తరలించాలని నిర్ణయించారు. అయితే స్థానికంగా తరగతులు నిర్వహించాలన్న డిమాండ్‌తో మొదటగా కురుపాం మండలం చినమేరంగి పాలిటెక్నిక్‌ కళాశాలను పరిశీలించారు. తర్వాత పార్వతీపురం మండలం ఉల్లిభద్ర ఉద్యాన కళాశాల, మరిపివలస పాలిటెక్నిక్‌ కళాశాలల పేర్లు పరిశీలనకు వచ్చాయి. చివరగా బొబ్బిలిలో ఓ ఇంజినీరింగ్‌ కళాశాలను జేఎన్టీయూ బృందం పరిశీలించింది. తగిన మౌలిక సదుపాయాలు, ప్రయోగశాలలు, ప్రధానమైన వసతి సౌకర్యం లేకపోవడంతో అనువైనది కాదని తేల్చారు. ఆఖరుకు జేఎన్‌టీయూలో తాత్కాలిక తరగతులు నిర్వహించడమే మేలన్న అభిప్రాయం వెలిబుచ్చినా ఆ దిశగా అడుగులు పడలేదు.

వారు తక్కువే..

ఎస్టీల్లో ఇంజినీరింగ్‌ చదువుకున్న వారు తక్కువ. అందులో ఉత్తీర్ణులై ఉద్యోగాలు పొందుతున్న వారు 35 శాతం మించడం లేదని అధ్యయనాలు చెబుతున్నాయి. 2022-23లో విజయనగరంలోని ఓ ప్రైవేటు ఇంజినీరింగ్‌ కళాశాలలో ప్రవేశాలు పొందిన ఇద్దరు ఎస్టీ విద్యార్థులు కోర్సు పూర్తిచేయలేకపోయారు. ఇటువంటి పరిస్థితిలో వారికి విద్యావకాశాలు కల్పించాల్సి ఉంది. ఈ నేపథ్యంలో ఇంజినీరింగ్‌ కళాశాలను పూర్తిచేయాలనే డిమాండు వినిపిస్తోంది. కానీ ప్రభుత్వం మాత్రం ఈ నాలుగేళ్లూ నాన్చేసింది.

మంత్రి హామీ..

ఇది గిరిజన కళాశాలైనా ప్రవేశాల్లో గిరిజనేతరులకు సీట్లు కేటాయించేందుకు అవకాశం ఉంది. అయితే గిరిజన విద్యార్థులకు ప్రత్యేక కోటా ఇచ్చే ప్రతిపాదనను స్థానికులు తెరపైకి తీసుకురావడంతో ప్రభుత్వం దృష్టికి తీసుకెళతానని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ హామీ ఇచ్చారు. కానీ నిర్మాణ పనులను మాత్రం పట్టించుకోలేదు.

పోస్టుల బదలాయింపు

ఈ కళాశాల తొలుత జేఎన్‌టీయూ కాకినాడ విశ్వవిద్యాలయానికి అనుబంధ కళాశాలగా ఉండేది. 2022 జనవరిలో జేఎన్‌టీయూ విజయనగరం ప్రాంగణం విశ్వవిద్యాలయం కావడంతో దీని పరిధిలోకి వచ్చింది. ఒక కోర్సుకు 60 సీట్ల చొప్పున సివిల్‌, మెకానికల్‌, సీఎస్‌ఈ, ఈఈఈ, ఈసీఈ కోర్సుల్లో 300 సీట్లకు 2022లో ఆమోదం లభించింది. ఈఏపీసెట్‌ ర్యాంకు ఆధారంగా సీట్లు కేటాయిస్తారని అప్పట్లో ప్రకటించారు. అలాగే బోధన- 80, బోధనేతర పోస్టులు ఆరు మంజూరయ్యాయి. పొరుగుసేవల కింద 48 ఉద్యోగాలు మంజూరుచేస్తూ ఉత్తర్వులు వెలువడ్డాయి. వీటిలో 9 బోధన పోస్టులను హేతుబద్ధీకరణలో జేఎన్‌టీయూ విజయనగరం విశ్వవిద్యాలయానికి బదలాయించారు. మళ్లీ ఇవి కళాశాలకు వచ్చే అవకాశాలు లేవని ఆయా వర్గాలు చెబుతున్నాయి.
 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని