logo

ఇళ్లకు డిజిటల్‌ నెంబర్లు

పురపాలికలోని రెవెన్యూ విభాగం అధికారులు ఇంటి నంబర్లను అస్తవ్యస్తంగా కేటాయించారు. స్థానిక ప్రజా ప్రతినిధుల అండతో ఇష్టారాజ్యాంగా ఇచ్చినట్లు ఆరోపణలున్నాయి. ప్రభుత్వ స్థలాల్లో నిర్మించుకున్న పలు గృహాలకు సైతం ఒకే నంబరు కేటాయించడం గమనార్హం. పక్క పక్కన ఉన్న ఇళ్లకు సైతం సీరియల్‌ నంబర్లు సరిగా లేవు.

Published : 29 May 2022 04:11 IST

కసరత్తు చేస్తున్న అధికారులు


భూపాలపల్లి పట్టణ ముఖచిత్రం

మొత్త వార్డులు 30

గృహాలు 13,647

భూపాలపల్లి, న్యూస్‌టుడే: పురపాలికలోని రెవెన్యూ విభాగం అధికారులు ఇంటి నంబర్లను అస్తవ్యస్తంగా కేటాయించారు. స్థానిక ప్రజా ప్రతినిధుల అండతో ఇష్టారాజ్యాంగా ఇచ్చినట్లు ఆరోపణలున్నాయి. ప్రభుత్వ స్థలాల్లో నిర్మించుకున్న పలు గృహాలకు సైతం ఒకే నంబరు కేటాయించడం గమనార్హం. పక్క పక్కన ఉన్న ఇళ్లకు సైతం సీరియల్‌ నంబర్లు సరిగా లేవు. కొత్తవారు ఇంటిని తెలుసుకోవాలంటే ఇబ్బందికరంగా మారింది. ఈ నేపథ్యంలో సాంకేతిక విధానానికి శ్రీకారం చుట్టారు. ఇప్పటికే ఆన్‌లైన్‌ సేవలతోనే పలు సమస్యలు పరిష్కారం అవుతున్నాయి. తాజాగా డిజిటల్‌ ఇంటి నంబర్ల విధానాన్ని అమలు చేసేందుకు పురపాలకశాఖ రంగం సిద్ధం చేస్తోంది. తొలి విడతగా సూర్యాపేట పట్టణంలో ప్రయోగాత్మకంగా అమలు చేశారు. విజయవంతం కావడంతో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని మున్సిపాలిటీల్లో అమలు చేసేందుకు నిర్ణయించారు. ఇటీవల హైదరాబాద్‌లో పురపాలిక ఛైర్మన్లు, కమిషనర్లతో మంత్రి కేటీఆర్‌ నిర్వహించిన సమీక్ష సమావేశంలో డిజిటల్‌ ఇంటి నెంబర్ల అమలుపై చర్చించారు. 2023 మార్చి31 నాటికి పూర్తి చేయాలని ఆదేశించారు.

గందరగోళానికి స్వస్తి..

ప్రస్తుతం ఉన్న ప్రాంతాల ఆధారంగా మొదటి అంకెతో మొదలైన మధ్యలో అడ్డగీత తర్వాత ఇంటి నంబర్లున్నాయి. క్రమంగా వాటికి బైనంబర్లు పెరిగి గందరగోళంగా తయారయ్యాయి. పక్క పక్కన ఉండే ఇళ్లకు సైతం క్రమబద్ధంగా లేవు. దీంతో చిరునామా తెలుసుకోవడం కష్టమైన ప్రక్రియగా మారింది. ఈ క్రమంలో కోడ్‌ల ప్రామాణికంగా డిజిటల్‌ నంబర్లను రూపొందిస్తారు. ఇప్పటికే పట్టణంలో అన్ని ఇళ్లను భువన్‌ యాప్‌లో నమోదు చేశారు. వీటి ఆధారంగానే డిజిటల్‌ నంబర్లను ఇళ్లకు కేటాయించడం సులువు. అన్నింటా డిజిటలైజేషన్‌ విధానంలో వస్తున్న మార్పులకు తగినట్లుగా సరికొత్త విధానాన్ని ఆచరణలో తీసుకరానున్నారు. ఆంగ్ల అక్షరాలతో పాటు సంఖ్యను సులభంగా గుర్తించేలా డిజిటల్‌ ప్లేట్‌ అమర్చుతారు. ఒక రకంగా పిన్‌కోడ్‌ తరహాలో రాష్ట్ర, జిల్లా, పురపాలిక వార్డులు ఇలా కోడ్‌ వారీగా సంఖ్యను గృహానికి ఇవ్వనున్నారు. అపార్టుమెంట్లకు ఒకే సంఖ్య ఇచ్చి, చివరలో ప్లాట్‌ నంబరు జోడించనున్నారు. కేటాయించిన సంఖ్యను అంతర్జాలంతో అనుసంధానిస్తే భవిష్యత్తులో గూగుల్‌ మ్యాప్‌ ద్వారా చూపించే వీలుంటుంది. ఈ సంఖ్యతో పాటు బార్‌కోడ్‌ స్కాన్‌ చేస్తే పురపాలికకు చెల్లింపులు, బకాయిలు, ఇంటి వివరాలు తెలుస్తాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని