logo

కలెక్టరేట్‌ నిర్మాణం కలేనా..!

జిల్లా కలెక్టరేట్‌ నిర్మాణం కలగానే మిగిలిపోయింది. వరంగల్‌ హనుమకొండ జిల్లాలుగా విడిపోయి 9 మాసాలు కావస్తున్నా ఇంతవరకు స్థల సేకరణే చేపట్టలేదు. హనుమకొండ జిల్లాకు కొత్త కలెక్టరేట్‌ భవనం అందుబాటులోకి వచ్చి నూతన భవనంలో కార్యకలాపాలు సాగుతున్నా, వరంగల్‌ కలెక్టరేట్‌ కార్యకలాపాలు ఇంకా హనుమకొండలోని నీటిపారుదల శాఖ

Published : 17 Aug 2022 05:44 IST

న్యూస్‌టుడే, కాశీబుగ్గ

ప్రతిపాదించిన అజంజాహి మిల్లు మైదానం

జిల్లా కలెక్టరేట్‌ నిర్మాణం కలగానే మిగిలిపోయింది. వరంగల్‌ హనుమకొండ జిల్లాలుగా విడిపోయి 9 మాసాలు కావస్తున్నా ఇంతవరకు స్థల సేకరణే చేపట్టలేదు. హనుమకొండ జిల్లాకు కొత్త కలెక్టరేట్‌ భవనం అందుబాటులోకి వచ్చి నూతన భవనంలో కార్యకలాపాలు సాగుతున్నా, వరంగల్‌ కలెక్టరేట్‌ కార్యకలాపాలు ఇంకా హనుమకొండలోని నీటిపారుదల శాఖ భవనంలోనే సాగుతున్నాయి. కనీసం కలెక్టర్‌ కార్యాలయ భవనానికి ఇప్పటి వరకు శంకుస్థాఫన సైతం జరగకపోవడంతో ప్రజలకు సేవలు మరింత దగ్గర కావాలన్న సీఎం ఆశయం నెరవేరలేదు. రాష్ట్ర ఆవిర్భావం తరువాత 2016 దసరా వేళ ఉమ్మడి 10 జిల్లాలను 31 జిల్లాలుగా విభజిస్తూ సీఎం కేసీఆర్‌ సర్కారు నిర్ణయించింది. వరంగల్‌, హనుమకొండ జిల్లాల ఏర్పాటుకు ముసాయిదా విడుదల చేసినా చారిత్రక వరంగల్‌ నగరాన్ని విడదీయవద్దని ఓరుగల్లు వాసులు అభ్యంతరం చెప్పడంతో వరంగల్‌ నగరాన్ని కలిపి వరంగల్‌ అర్బన్‌గా మిగిలిన ప్రాంతాన్ని వరంగల్‌ రూరల్‌గా మార్పు చేశారు. ప్రజల అభీష్టం మేరకు అంటూ 2021 డిసెంబరులో మళ్లీ వరంగల్‌, హనుమకొండ జిల్లాలుగా విభజించారు. వరంగల్‌ రూరల్‌ జిల్లాగా ఉన్నప్పుడు హనుమకొండలోనే కలెక్టర్‌ కార్యాలయ నిర్వహణ జరగగా, వరంగల్‌ జిల్లా ఏర్పాటు అనంతరం అక్కడే  కార్యకలాపాలు సాగుతున్నాయి.  

అజంజాహి స్థలం ఎంపిక చేసినా..

జిల్లా ఏర్పాటు చేసే సమయంలో సీఎం కేసీఆర్‌ ఉమ్మడి జిల్లాకు చెందిన మంత్రులు ఎర్రబెల్లి దయాకర్‌రావు, సత్యవతిరాథోడ్‌తోపాటు ప్రజాప్రతినిధులందరితోనూ మాట్లాడి నిర్ణయం తీసుకున్నారు. కలెక్టర్‌ కార్యాలయానికి అనుకూలమైన స్థలం గురించి చర్చిస్తూ అజంజాహి మైదానంలోని 30 ఎకరాల స్థలం అనుకూలమైనదని నాయకులు సీఎంకు వివరించారు. స్థలం కూడా పరిశీలించారు. రాష్ట్రంలో తాజాగా 8 జిల్లా కలెక్టర్‌ కార్యాలయాల నిర్మాణాలు పూర్తయి సీఎం చేతుల మీదుగా ప్రారంభోత్సవాలకు సిద్దమవుతున్నా జిల్లా కలెక్టర్‌ కార్యాలయం కలగానే మిగిలిపోయింది.

స్థలం మార్పుపై చర్చ

కలెక్టరేట్‌ నిర్మాణానికి అజంజాహి మిల్లు స్థలం సరికాదని కొందరు సీఎం దృష్టికి తీసుకెళ్లినట్లు సమాచారం. రాంకీ కాలనీకి ఆనుకొని ఉన్న ఈ స్థలం పక్కనే భారత పెట్రోలియం కార్పొరేషన్‌ భారీ ఆయిల్‌ ట్యాంకర్లు అవరోధమని ముఖ్యమంత్రికి వివరించినట్లు తెలిసింది. అంతే కాదు, ఆ స్థలం కేంద్రప్రభుత్వ పరిధిలోని నేషనల్‌ టెక్స్‌టైల్‌ కార్పొరేషన్‌(ఎన్‌టీసీ) అధీనంలో ఉందని, ఎన్‌టీసీ నుంచి స్థలం కొనుగోలు చేయాల్సి ఉంటుందని చెప్పినట్లు తెలిసింది. ఈ కారణాలలోనే అజంజాహి స్థలంపై ప్రభుత్వం ఓ నిర్ణయానికి రాలేక పోతున్నట్లు సమాచారం. అజంజాహి మిల్లు స్థలం కాకుంటే గత ఏడాది కూల్చివేసిన వరంగల్‌ కేంద్ర కారాగారం స్థలం అయితే అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటుందని జిల్లా యంత్రాంగం తోపాటు జిల్లా పరిధిలోని ప్రజాప్రధినిధులు సైతం భావిస్తున్నట్లు తెలిసింది. అన్ని అవరోధాలు దాటుకుని కలెక్టరేట్‌ కార్యాలయం త్వరగా పూర్తి కావాలన్నది జిల్లా వాసుల కల. ప్రజాప్రతినిధులు, అధికారులు తలచుకుంటే జిల్లా వాసుల కల నిజమవుతుంది.


అసౌకర్యాల మధ్య పాత భవనంలో..  

వరంగల్‌ కలెక్టరేట్‌, న్యూస్‌టుడే:  ప్రస్తుతం జిల్లా కలెక్టరేట్‌ హనుమకొండలోని నిజాం కాలంనాటి పాత భవనంలోనే కొనసాగిస్తున్నారు. ఈ భవనంలో కనీస సౌకర్యాలు లేకపోవడంతో.. ప్రజలతో పాటు అధికారులు ఇబ్బందులకు గురవుతున్నారు. పాత భవనం కావడంతో... కొన్నిసార్లు పెచ్చులూడిన సందర్భాలు ఉన్నాయి. ఆర్డీవో, డీపీఆర్వో, వివిధ సెక్షన్‌ కార్యాలయాలు, అదనపు కలెక్టర్‌, జిల్లా పాలనాధికారి కార్యాలయాలు మినహా.. జిల్లాలోని మిగిలిన కార్యాలయాలన్నీ హనుమకొండ జిల్లాలో వివిధ ప్రదేశాల్లో ఉన్నాయి. దాంతో ప్రజలు తమ సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వ కార్యాలయాల కోసం వెతుకులాడుతున్నారు. చెట్టుకొకటి.. పుట్టకొకటి ప్రభుత్వ కార్యాలయాలు విస్తరించి ఉండడంతో వారు ఇబ్బందులు పడుతున్నారు. అన్ని శాఖలను ఒకే చోటకు తీసుకొచ్చేందుకు సమీకృత కలెక్టరేట్‌ సముదాయం అవసరమున్నా.. అధికారులతో పాటు ప్రజాప్రతినిధులు పట్టించుకోవట్లేదని ఆరోపణలు వినిపిస్తున్నాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని